మీసం మెలేస్తున్న రొయ్య! | Prawns Prices Are Highly Increased In Vijayawada | Sakshi
Sakshi News home page

మీసం మెలేస్తున్న రొయ్య!

Published Wed, Sep 11 2019 11:36 AM | Last Updated on Wed, Sep 11 2019 11:36 AM

Prawns Prices Are Highly Increased In Vijayawada - Sakshi

రొయ్యలు

సాక్షి, అమరావతి : రొయ్య మీసం మెలేస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు అంతంతమాత్రంగా ఉన్న రొయ్య ధర ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చాన్నాళ్లుగా ప్రతికూల పరిస్థితులతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అక్వా రైతుకు వీటి ధర పెరుగుదల, ప్రభుత్వం విద్యుత్‌ యూనిట్‌ చార్జీని సగానికి పైగా తగ్గించడం వెరసి ఉపశమనం కలిగిస్తోంది. దీంతో ఇప్పుడు ఒకింత ఒడ్డున పడ్డామన్న ఆనందం వీరిలో వ్యక్తమవుతోంది. ఆక్వా సాగులో భాగమైన రొయ్యల సాగు జూదంలా మారింది. ఒక ఏడాది లాభాల పంట పండితే మరో ఏడాది నష్టాల పాల్జేస్తోంది. దీంతో రైతులు ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా కలిసొస్తుందన్న ఆశతో దీనిని వదులుకోలేకపోతున్నారు. ఇలా ఏటికేడాది చెరువులకు ఎదురీదుతున్నారు. కొన్నేళ్ల నుంచి పరిస్థితి మరింతగా దిగజారింది. ఒకపక్క ప్రకృతి ప్రతికూలత, మరోపక్క నాణ్యత లేని సీడ్, అదుపు లేని ఫీడ్‌ ధర, వ్యాధుల బెడద, గిట్టుబాటు కాని రొయ్యల రేటు వెరసి ఈ రైతును నిలువునా ముంచుతున్నాయి.

అన్నింటికీ మించి విద్యుత్‌ చార్జీలు పెను భారంగా మారుతూ వచ్చాయి. ఈ తరుణంలో రొయ్యల ధర పెరగడం, అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రంగానికి విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కు రూ.3.85 నుంచి 1.50కి (రూ.2.35) తగ్గించడం ఈ రైతును కోలుకునేలా చేస్తోంది. కృష్ణా జిల్లాలో 50 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఎకరానికి 2 నుంచి 2.50 టన్నుల దిగుబడి వస్తుంది. నాలుగు నెలలకు ఒక దఫా పంట చేతికొస్తుంది. ఇలా ఏడాదికి రెండు పర్యాయాలు మాత్రమే రొయ్యల సాగుకు వీలుంటుంది. ఇలా వీటి ద్వారా ఏటా 1.50 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. 

ఎగబాకుతున్న రొయ్యల ధర
రొయ్యల ధర ఇప్పుడిప్పుడే ఎగబాకుతోంది. ఉదాహరణకు నెల రోజుల క్రితం 100 కౌంట్‌ రొయ్య టన్ను ధర రూ.1.90 లక్షలుండగా ఇప్పుడది 2.40 లక్షలకు చేరుకుంది. 70 కౌంట్‌ 2.45 నుంచి 2.70 లక్షలకు, 30 కౌంట్‌ 4.50 నుంచి 5 లక్షల చొప్పున  ఎగబాకింది. ఏ కౌంట్‌ ఎంత? (టన్నుల్లో)

ఎగుమతులకు ఊపు..
రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న రొయ్యలను అధికశాతం తైవాన్‌ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్నాయి. తైవాన్‌లో జూన్‌ నెలతో రొయ్యల సాగు పూర్తయింది. మరో రెండు మూడు నెలల పాటు అక్కడ రొయ్యల ఉత్పత్తి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాదు. అందువల్ల అప్పటిదాకా రొయ్యల ఎగుమతికి ఊపు కొనసాగుతుందని, ప్రస్తుత ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని ఆక్వా రైతులు ఆశాభావంతో ఉన్నారు. 

విద్యుత్‌ చార్జీ తగ్గింపుతో ఊరట!
గతంలో ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.3.85 చెల్లించే వారం. అసలే గిట్టుబాటు కాని ధరలతో నష్టాలను తట్టుకోవడం కష్టంగా ఉండేది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక యూనిట్‌ చార్జీని రూ.1.50కి తగ్గించడం ఊరటనిస్తోంది. దీనికి రొయ్య రేటు ఆశాజనకంగా ఉండడం ఆక్వా రైతును బతికిస్తోంది. గతంలోలా పాత ధరలు కొనసాగితే కుదేలే. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో రొయ్యలకు వైట్‌గట్‌ అనే వ్యాధి సోకి నష్టాల పాల్జేసింది.                 
–వెంకట్, రొయ్యల సాగు రైతు, ఎదురుమొండి, నాగాయలంక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement