డెల్టా.. చెరువుల తవ్వకంతో ఉల్టా | farmers interested on Prawns cultivation | Sakshi
Sakshi News home page

డెల్టా.. చెరువుల తవ్వకంతో ఉల్టా

Published Sat, Jan 18 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

farmers interested on Prawns cultivation

పాలకొల్లు, న్యూస్‌లైన్ :  డెల్టాలో రొయ్యల పెంపకం కోసం విస్తారమైన పంట భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. వరిసాగుతో వరుస నష్టాలను మూటగట్టుకుంటున్న రైతులు రొయ్యల సాగుపై మక్కువ పెంచుకుంటున్నారు. దీనితో ఎంతో విస్తారమైన భూములకు సుమారు 200 అడుగుల లోతులోని ఉప్పు నీటిని తోడడం వల్ల భూములు  ఉప్పునీటికయ్యలవుతున్నాయి.

 వరి సాగుపై విముఖత
 డెల్టాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి వుండగా ఇటీవల కాలంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి రొయ్యల సాగు పెరుగుతోంది. ఇటీవల వరుస తుపాన్లు, భారీ వర్షాలు కారణంగా వరిసాగు చేసే రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. వరి సాగు  కోసం పెట్టుబడులు పెరగటం, ప్రతికూల వాతావరణంతో ఆశించిన దిగుబడులు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతులు  వరిసాగుపై విముఖత చూపుతున్నారు.

ఈ తరుణంలో రొయ్యల సాగు ఆశజనకంగా ఉండంతో భూస్వాములు రొయ్యల సాగుకే తమ భూములను లీజుకిస్తున్నారు. ఎకరం భూమి లీజుకిస్తే కేవలం రెండు పంటలకు 24 బస్తాలు మగతా( సుమారు రూ.24 వేలు) వస్తోంది. అయితే రొయ్యల చెరువుకు లీజుకిస్తే ఎకరాకు  ఏడాదికి రూ. 50 వేలు నుంచి రూ.70 వేలు వరకు ఆదాయం లభిస్తోంది. ఆకివీడు, కాళ్ల, భీమవరం, గణపవరం తదితర మండలాల్లో చేపల చెరువులకు ఎకరాకు ఏడాదికి రూ.60 వేలు నుంచి లక్ష రూపాయలు వరకు లీజుకు ఇస్తున్నారు. దీంతో దాదాపు డెల్టా ప్రాంతంలో ఎక్కువ శాతం భూస్వాములు తమ భూములను చెరువులకు లీజుకు ఇవ్వడానికే మొగ్గుచూపుతున్నారు.

 తగ్గిన సరిహద్దు వివాదాలు
 గతంలో రొయ్యల చెరువులు తవ్వే సమయంలో సరిహద్దు భూముల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసి తవ్వకాలను అడ్డుకునే వారు. అయితే ప్రస్తుతం చెరువుల తవ్వకాలపై రైతులు అభ్యంతరం తెలపకపోవడం, భవిష్యత్‌లో తమ భూముల కూడా చెరువులుగా మార్చకోవచ్చుననే ముందుచూపుతో వారు అడ్డు చెప్పడం లేదు.  దీనితో  ఏమాత్రం మురుగునీటి పారుదల అవకాశం ఉన్న భూమినైనా చెరువులుగా మార్చేస్తున్నారు.

 పెరుగుతున్న సీడ్ ట్యాంక్‌లు
 రొయ్యల చెరువుల విస్తీర్ణం పెరగడంతో రొయ్యల సీడ్ ట్యాంకులు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా వీరవాసరం మండలంలో  సీడ్ ట్యాంకులు  ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఒంగోలు, వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ఉప్పునీటిలోని  రెడ్(చిన్నసైజు పిల్లలు)ను తీసుకువచ్చి ఈ సీడ్ ట్యాంక్‌ల్లో  వేసి తీపి నీటి రొయ్యలుగా మార్పుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు.  
 సీడ్ వ్యాపారం మూడు పిల్లలు, ఆరు రొయ్యలగా సాగడంతో అనేకమంది ఈ వ్యాపారంపై ఆశక్తి చూపుతున్నారు.

 అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు
 ప్రధాన రహదారుల పక్కనే విస్తారమైన భూములను అక్రమంగా రొయ్యల చెరువులు, సీడ్ ట్యాంక్‌లుగా మార్పు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇటీవల కాలంలో రొయ్యల ధర గణనీయంగా పెరగడంతో లాభాలు ఆర్జిస్తున్న రైతులు అధికారులకు ముడుపులు కూడా పెద్దమొత్తంలో ఇస్తున్నారని, దీంతో రొయ్యల చెరువు దరిదాపులకు అధికారులు వెళ్లడం లేదని పలువురు చెబుతున్నారు.

 రొయ్యల చెరువుల తవ్వకాలపై ఉన్నాతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలోని సాగు భూములన్నీ ఉప్పునీటి కయ్యలు మారిపోయే ప్రమాదం ఉందని, తద్వారా ఈ ప్రాంతంతో 15 అడుగుల లోతులో లభించే మంచినీరు కరువౌతుందని పలువురు ఆందోళన వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement