Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు.. | All traders As Syndicate and Are Drowning The Aqua Farmers | Sakshi
Sakshi News home page

Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు..

Published Fri, Oct 28 2022 4:41 PM | Last Updated on Fri, Oct 28 2022 5:32 PM

All traders As Syndicate and Are Drowning The Aqua Farmers - Sakshi

వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్‌గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్‌ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానుల తీరుతో సాగుకు పెట్టిన పెట్టుబడి రాక ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయిన వీరిని ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ రాయితీలు ప్రకటించారు. వాణిజ్యపరంగా అండగా నిలిచేందుకు ఆక్వా హబ్‌లు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ, వ్యాపారులు మాత్రం రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎంతగా అంటే.. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయేంత. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది.

ఈ నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు, రైతులు, వ్యాపారులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రొయ్యలు కొనుగోలు చేయాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేసింది. సమావేశం ముగిసి పదిరోజులు కావస్తున్నా వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానుల్లో కనీస మార్పు రాలేదు. దానికితోడు జిల్లాలోని అధికారులు సైతం రొయ్యల మార్కెట్‌పై దృష్టి సారించకపోవడం కూడా ప్రధాన కారణమని విమర్శలూ వినిపిస్తున్నాయి. విజయవాడలో వ్యాపారులతో ప్రభుత్వం చర్చలు జరిపి కనీస మద్దతు ధర ప్రకటించినా ఆ ధరలను వ్యాపారులు అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే వెనామీ రొయ్యలు కేజీకి రూ.30 నుంచి రూ.55 వరకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. 

కౌంట్‌ పేరుతో దోపిడీ... 
వ్యాపారులు కూటమికట్టి ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు. వెనామీతో పాటు టైగర్‌ రొయ్యలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కౌంట్‌ రొయ్యలు తీసుకోకుండా లేని కౌంట్‌ రొయ్యలు కావాలని వ్యాపారులు మెలికపెట్టి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే మరీ తక్కువ చేసి కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. 


ఎకరా సాగుకయ్యే ఖర్చు రూ.4.15 లక్షలు... 

రైతును తీవ్రంగా నష్టపరుస్తున్నారు 
వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారుల పట్టించుకోవడం లేదు. దిగుబడి వచ్చిన తర్వాత రొయ్యలను నిల్వ చేసుకునే అవకాశం లేదు. దీనిని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానుల ఎగుమతులను ఆపేయాలి. అప్పుడే వాళ్లకు కష్టం అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాపారులు రైతులను అణగదొక్కుతున్నారు. 
– బత్తుల రమేష్‌రెడ్డి, ఆక్వా రైతు, కొత్తపట్నం 

అధికారులు నిర్లక్ష్యం వీడాలి 
రొయ్యల ధరల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. 
– దుగ్గినేని గోపీనాథ్, రొయ్యల రైతుల సంఘ నాయకుడు 

జిల్లా వ్యాప్తంగా  సమావేశం ఏర్పాటు చేస్తాం 
జిల్లా వ్యాప్తంగా రొయ్యల వ్యాపారులు, రైతులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికే వారికి ప్రకటించిన ధరలకే అమ్మాలని నిర్దేశించింది. అయినా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను అమలుచేస్తాం. 
– ఆవుల చంద్రశేఖరరెడ్డి,  మత్స్యశాఖ జిల్లా అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement