నిషేధకాలంలో ఏటా మత్స్యకార భృతి అందించిన ప్రభుత్వం
ఏటా సగటున 1.16 లక్షల మందికి ఐదేళ్లలో రూ.538 కోట్ల భృతి
డీజిల్ ఆయిల్ సబ్సిడీ రూపంలో ఐదేళ్లలో రూ.148 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: రెండు నెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకోనున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.
ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్యసంపదను స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులని తెలిపారు.
జరిమానా విధించడమే కాకుండా డీజిల్ ఆయిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపేస్తామని పేర్కొన్నారు. నిబంధనలు అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్‌గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తారని తెలిపారు.
ఐదేళ్లలో రూ.538 కోట్ల మత్స్యకార భృతి
రాష్ట్రంలో తడ మొదలుకుని ఇచ్చాపురం వరకు 974కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కు పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది.
వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సాంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధ కాలం ముగియకుండానే ప్రతీ ఏటా మే నెలలోనే వారి ఖాతాలకు నేరుగా జమ చేస్తూ గంగపుత్రులకు అండగా నిలిచింది.
టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందిస్తే, గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 5.38లక్షల మందికి రూ.538.01 కోట్ల భృతిని అందించింది. అలాగే డీజిల్ సబ్సిడీ కింద టీడీపీ ఐదేళ్లలో రూ.59.42 కోట్లు అందించగా, ఈ ప్రభుత్వ హయాంలో రూ.148 కోట్లు అందించింది.
ఐదేళ్లూ మత్స్యకార భృతినందుకున్నా..
నాకు తెప్పనావ ఉంది. 20 ఏళ్లుగా ఈ నావే జీవనాధారం. గతంలో వేట విరామ çసమయంలో జీవనాధారం లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. కానీ ప్రస్తుతం భృతిని రూ.10వేలకు పెంచడమే కాదు నిషేధ సమయంలోనే అందిస్తున్నారు. ఐదేళ్లుగా మత్స్యకార భృతిని అందుకున్నా. – కోడా లక్ష్మణ్, బోటు యజమాని, దొండవాక, అనకాపల్లి జిల్లా
మత్స్యకారులంతా జగన్ వెంటే..
స్వాతం్రత్యానంతరం మరే ప్రభుత్వం చేయలేని రీతిలో మత్స్యకారుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా పాటుపడిన మరో నాయకుడు లేరనే చెప్పాలి. వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా నిషేధ సమయంలోనే అర్హులైన ప్రతీ మత్స్యకారుని అందించి అండగా నిలిచారు. మత్స్యకారులతో పాటు ఆక్వారైతులు జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటారు. – లంకె వెంకటేశ్వరావు, మెకనైజ్డ్ బోటు యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment