Suryakumari
-
నేటి అర్ధరాత్రి నుంచి ‘మత్స్య’ వేట నిషేధం అమలు
సాక్షి, అమరావతి: రెండు నెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకోనున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్యసంపదను స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులని తెలిపారు. జరిమానా విధించడమే కాకుండా డీజిల్ ఆయిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపేస్తామని పేర్కొన్నారు. నిబంధనలు అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్‌గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. ఐదేళ్లలో రూ.538 కోట్ల మత్స్యకార భృతి రాష్ట్రంలో తడ మొదలుకుని ఇచ్చాపురం వరకు 974కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కు పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సాంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధ కాలం ముగియకుండానే ప్రతీ ఏటా మే నెలలోనే వారి ఖాతాలకు నేరుగా జమ చేస్తూ గంగపుత్రులకు అండగా నిలిచింది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందిస్తే, గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 5.38లక్షల మందికి రూ.538.01 కోట్ల భృతిని అందించింది. అలాగే డీజిల్ సబ్సిడీ కింద టీడీపీ ఐదేళ్లలో రూ.59.42 కోట్లు అందించగా, ఈ ప్రభుత్వ హయాంలో రూ.148 కోట్లు అందించింది. ఐదేళ్లూ మత్స్యకార భృతినందుకున్నా.. నాకు తెప్పనావ ఉంది. 20 ఏళ్లుగా ఈ నావే జీవనాధారం. గతంలో వేట విరామ çసమయంలో జీవనాధారం లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. కానీ ప్రస్తుతం భృతిని రూ.10వేలకు పెంచడమే కాదు నిషేధ సమయంలోనే అందిస్తున్నారు. ఐదేళ్లుగా మత్స్యకార భృతిని అందుకున్నా. – కోడా లక్ష్మణ్, బోటు యజమాని, దొండవాక, అనకాపల్లి జిల్లా మత్స్యకారులంతా జగన్ వెంటే.. స్వాతం్రత్యానంతరం మరే ప్రభుత్వం చేయలేని రీతిలో మత్స్యకారుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా పాటుపడిన మరో నాయకుడు లేరనే చెప్పాలి. వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా నిషేధ సమయంలోనే అర్హులైన ప్రతీ మత్స్యకారుని అందించి అండగా నిలిచారు. మత్స్యకారులతో పాటు ఆక్వారైతులు జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటారు. – లంకె వెంకటేశ్వరావు, మెకనైజ్డ్ బోటు యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా -
సొంత ఆదాయాల పెంపుపై పంచాయతీలు దృష్టి పెట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు ఉపయోగించుకుంటూనే సొంత ఆదాయాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి సూచించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 27 పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులను కమిషనర్ సన్మానించి అవార్డులను అందజేశారు. పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాల కల్పన, హెల్దీ పంచాయతీ, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్ సఫిషియెంట్ పంచాయతీ, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ, సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైనవారు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్లు సుధాకర్‌రావు, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంద్రబాబూ సిగ్గు.. సిగ్గు ) -
కలెక్టర్ పేరుతో జిల్లా అధికారులకీ మెసేజ్‌లు.. డబ్బులు పంపించాలని ఆదేశాలు
పై చిత్రం చూశారా.. బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి సెల్‌ఫోన్‌కు వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశం. కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఫొటోను డీపీగా వాడి ఫేక్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆమె ఒక్కరికే కాదు జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు, ఎంపీడీఓలకు ఇలాంటి ఫేక్ మెసేజ్‌లే వచ్చాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కలెక్టర్ పేరుతో వివిధ ఫోన్నంబర్లతో జిల్లా అధికారులందరికీ ఒకేసారి మెసేజ్‌లు రావడం సోమవారం కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లు 94391 40791, 94391 40733, 94391 39978, 73812 76244 నంబర్ల నుంచి వాట్సాప్‌లో అధికారులతో చాటింగ్‌ను కొనసాగించారు. విధి నిర్వహణకు సంబంధించిన ప్రశ్నలు వేసిన తర్వాత ఆ నంబర్లను ఫోన్లో పర్సనల్‌గా సేవ్ చేసుకోవాలని సూచించారు. తర్వాత కొద్దిసేపటికే డబ్బులు పంపించాలని ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ వాట్సాప్ మేసెజ్‌లు సోమవారం ఉదయం కలెక్టరేట్లో కాసేపు సంచలనం సృష్టించాయి. వాట్సాప్ మెసేజ్‌లు అందుకున్న అధికారుల్లో చాలామంది గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ సూర్యకుమారి ఎదురుగానే ఉన్నారు. ఆమె చేతిలో సెల్‌ఫోన్ లేదు. చాటింగ్ ఎలా చేస్తున్నారనే అనుమానం వచ్చి వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తానెప్పుడూ వాట్సాప్ గ్రూప్‌లకు తన ఫొటోను డీపీగా ఉంచలేదని, తన ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని అధికారులకు మైక్‌లో సూచించారు. అధికారికంగా ప్రభుత్వం కేటాయించిన నంబరు మినహా ఎలాంటి పర్సనల్ నంబర్లు లేవని, అందరూ గుర్తించి ఫేక్ మెసేజ్‌లతో మోసపోవద్దని సూచిస్తూ జిల్లా యంత్రాంగానికి వెంటనే సందేశం పంపించారు. చదవండి: (మరీ ఇంత దారుణమా: ఆస్తులు రాయించుకుని..) కటక్‌లో ఉన్న కేటుగాళ్లు... ఫేక్ మెసేజ్‌ల విషయాన్ని వెంటనే ఎస్పీ దీపిక దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు. ఫేక్ మెసేజ్‌లు పంపినవారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అభ్యర్థిస్తూ ఆరుగురు ఉద్యోగులు విజయనగరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ ఫోన్ నంబర్లను వాడినవారి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. వారు కటక్‌లో ఉన్నట్టుగా అంచనాకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం కటక్‌కు బయల్దేరినట్లు తెలిసింది. అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ ప్రొఫైల్‌తో జిల్లా ఉన్నతాధికారులకు వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. వాటితో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదు. వాట్సాప్ ద్వారా వచ్చే ఆదేశాలు, సూచనలను ఎవ్వరూ పట్టించుకోవద్దు. ఇలాంటి ఫేక్ నంబర్ల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇంకా ఎవరికైనా అలాంటి మెసేజ్‌లు వస్తే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వండి. ఫేక్ మేసెజ్‌లకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎ.సూర్యకుమారి, కలెక్టర్ -
రెపరెపల దీపానికి కనురెప్పల కావలి
ఈ తల్లీబిడ్డల జీవితంలో పేదల బతుకులున్నాయి. నిరాదరణకు గురైన మహిళల జీవితాలున్నాయి. తండ్రి ఆలన, పాలనకు నోచుకోని పిల్లల కన్నీళ్లున్నాయి. వైద్యం ఆరోగ్యం పేదవాడికి అందని ద్రాక్ష అని చెప్పేందుకు సాక్ష్యాలున్నాయి. అన్నిటినీ మించి నిండు ప్రాణం కళ్లముందే కొట్టుమిట్టాడుతున్నా కనికరం చూపించలేని పాలకుల నిర్లక్ష్యపు నీలి ఛాయలున్నాయి. కష్టం వస్తే నేరుగా ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకోవాల్సిన దయనీయ పరిస్థితులున్నాయి. రెపరెపలాడుతున్న దీపాన్ని కంటిరెప్పల మధ్య పెట్టి బతికించుకుంటున్న ఓ తల్లి వ్యథ ఇది. అజయ్‌కి పన్నెండేళ్లు. ‘గాచర్స్’ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. కోటి మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి ఏటా కోటి రూపాయలు ఉంటే తప్ప వైద్యం దొరకదు. మందులు, ఇంజెక్షన్లు కూడా విదేశాల నుంచే తెప్పించాలి! సూర్యకుమారి.. అజయ్ తల్లి.ఉపాధి పనులకు వెళుతూ వచ్చిన కూలీ డబ్బులతో బిడ్డను పోషిస్తోంది. కిడ్నీ వ్యాధి కబళిస్తున్నా, కట్టుకున్నవాడు కలిసిరాకపోయినా కన్నబిడ్డను కంటికి రెప్పలా కాసుకుంటోంది. మూడేళ్ల క్రితమే గుర్తించారు విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి వెళితే 2116 మంది జనాభా కనిపిస్తారు. వీరిలో ఐదేళ్ల వయసులోపు పిల్లలు 96 మంది ఉంటే ఆరేళ్ల నుండి 14 ఏళ్ల లోపు వయసు పిల్లలు 62 మంది వున్నారు. అరవై రెండు మందిలో ఒకడు పన్నెండేళ్ల వయసున్న పెదపూడి అజయ్. దేవరాపల్లి మండలం కాశీపురంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. పుట్టుకతోనే ఎంజైమ్ లోపంతో వచ్చే గాచర్స్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అజయ్‌కు మూడో ఏటా నుండే ఆరోగ్యం సమస్యలు తలెత్తినప్పటికీ మూడేళ్ల క్రితమే ఆ సమస్యలకు గాచర్స్ కారణమని వైద్యులు గుర్తించారు. తనకు కడుపులో కాయ వచ్చిందని, ఎప్పుడుపడితే అప్పుడు అది కదులుతుంటుంటే నొప్పి వస్తోందని అంటున్న అజయ్ బాధను తల్లి సూర్యకుమారి కన్నీటిపర్యంతం అవుతూ సాక్షి ప్రతినిధికి చెప్పుకుంది. ఐదో నెల నుంచీ దగ్గు, జ్వరం ‘‘విశాఖ నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన సన్యాసిరావుతో 2005లో నా పెళ్లి జరిగింది. 2006లో బాబు, 2008లో పాప పుట్టారు. ఐదు నెలల వరకు బాబు బాగానే ఉన్నాడు. తరువాత నుంచి దగ్గు రావడంతో పాటు జ్వరమూ వస్తుండేది. అప్పుడు అనకాపల్లిలో ఉమామహేశ్వరరావు అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. రెండుమూడేళ్లు ఆయన దగ్గరే వైద్యం చేయించాం. తర్వాత కొత్తవలసలో శ్రీకాంత్ అనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాం. అప్పటికీ ఫలితం లేకపోయింది. బాబుకి 8 ఏళ్లు వచ్చిన తరువాత విశాఖ కేజీహెచ్ దగ్గర ప్రేమ్‌కుమార్ దగ్గరకు తీసుకెళ్లాము. అక్కడ ఆస్మా తగ్గింది. కానీ అక్కడ నుంచి వాంతులు అవ్వడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఊపిరి పీల్చుతుంటే బాబుకి బాగా నొప్పి వచ్చింది. ఆ సంగతి మాకు చెప్పకుండా అలాగే రెండురోజులు స్కూల్‌కి కూడావెళ్లాడు. అన్నం తినమంటే ఆకలిగా లేదని అన్నం తినేవాడుకాదు. ఏం తిన్నా, పాలు తాగిన బాబుకి వాంతులు అయిపోయేది. ఏడాదికి కోటి రూపాయలు! బాబుకి ఇలా అయిన దగ్గర నుంచి మా ఆయన బాబుని పూర్తిగా పట్టించుకోవడం మానేసాడు. ఆయన వైజాగ్ మద్దిలపాలెంలో వెల్డింగ్ చేస్తుంటాడు. బాబుకి నొప్పి వస్తే నాతో పాటు అమ్మ, తమ్ముడే హాస్పిటల్‌కు తీసుకెళుతుంటారు. నాక్కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. చెరువు పనులు ఉంటే వెళ్తుంటాను. నాకు ఒంట్లో బాగోదని ఆ పనికి కూడా తమ్ముడు నన్ను పంపించేవాడు కాదు. నాకు, నా బిడ్డకు ఇంత కష్టం వచ్చిందని ఎవరినైనా సాయం అడగాలనుకున్నా.. అందరం పనులు చేసుకునే వాళ్లమేగా అని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా. తర్వాత బాబును విశాఖ కె.జి.హెచ్.కు తీసుకెళ్లి ఆరునెలలపాటు చికిత్స చేయించాము. చివరికి అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ లేదన్నారు. బెంగళూరు వెళ్లమన్నారు. బాబు ట్రీట్మెంట్కు మెడిసిన్ ఉంది కానీ ఒక్క ఇంజక్షను సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు. డాక్టర్‌ను అడిగితే మీరు లోకల్ ఎమ్మెల్యేను గానీ, లేదా ఇంకెవరినైనా ధన సాయం అడిగి చూడండి అన్నారు. హైదరాబాద్‌లో జెనిటిక్స్ మేడమ్ రాధా రమాదేవి గారిని కలిశాం. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందని అయితే అది చాలా ఖరీదైనదని ఆమె ద్వారానే తెలిసింది. ఒక హాస్పిటల్లో ఈ వ్యాధికి అయ్యే ఖర్చు ఎంతో అంచనా వేసి ఏడాదికి కోటి రూపాయలు అవుతుందని చెప్పారు. అప్పులు తప్ప ఏమీ మిగల్లేదు బాబుకు పదిహేను రోజులకోసారి ఉదయంపూట నొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో ఏం తిన్నా వాంతులు అవుతుంటాయి. తిన్నగా కూర్చోలేడు. పడుకోలేడు. అప్పుడే డాక్టరు రాసిచ్చిన టానిక్ వేసేవాళ్లం.కేజీహెచ్ హాస్పిటల్లో మేడమ్ మమ్మల్ని ఇక హాస్పిటల్‌కి రానవసరం లేదన్నారు. ఎందుకంటే ఈ వ్యాధికి వైద్యం అందించే మందులు అక్కడ లేవు. పదేళ్ల పాప రిషిత, నా బాబు, వాడి కోసం చేసిన అప్పులు తప్ప నాకు ఇంకేమి లే దు. అజయ్ అమ్మమ్మ, తాతయ్య, మేనమామ అరిపాక సరోజిని, విశ్వనాథం, సతీష్‌లు నాకు తోడుగా ఉన్నారు. అజయ్‌కు అనారోగ్యం ఉందని తెలిసినప్పటి నుంచీ నా భర్త సన్యాసినాయుడు తాగుడుకు బాగా అలవాటు పడి మమ్మల్ని పట్టించుకోవటం మానేశాడు. కోర్టును కూడా ఆశ్రయించాం రిపోర్టుల ఆధారంగా అజయ్ వ్యాధి అరుదైనదని తెలిసింది. దానికి వైద్యం కేజీహెచ్‌లో అందించలేమని బెంగళూరు, సీఎంసీలో మందులు దొరికే అవకాశముందని వైద్యులు చెప్పారు. ఆరునెలలు పాటు అక్కడి సీఎంసీలో అనేక టెస్టులు చేయించి వైద్యసేవలు అందించారు. ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.1.24 లక్షలన్నారు. అంత ఆర్థిక స్తోమత లేకపోవటంతో అక్కడి నుంచి వచ్చేశాం. అప్పుడే.. సీఎంసీ వైద్యులు సుమిత హైదరాబాద్ వెళ్లమంటే బంజారాహిల్స్‌లో డాక్టర్ రాధారమాదేవిని కలిశాం. అంత డబ్బంటే ఎలా! ప్రభుత్వం నుండి సహాయం చేయమని అడగడానికి అమరావతి వెళ్లాం. అక్కడ సిఎమ్ అందుబాటులో లేకపోవటంతో మా గోడు వినిపించలేక వెనుదిరిగాం. అప్పుడే నాకూ కిడ్నీలో రాళ్లున్న విషయం బయటపడింది. కిడ్నీ సమస్యతో ఏ పనిచేయలేకపోతున్నా. ఆరోగ్యం బాగున్నప్పుడు గ్రామంలో ఉపాధి పనికి వెళుతుంటాను. కోటాబియ్యం, కట్టెల పొయ్యితోనే జీవనం సాగిస్తున్నాను. ఇలాంటి స్థితిలో బాబుకి ఇంత ఖరీదైన వైద్యం చేయించలేను. అలాగని వాడిని అలా వదిలేయలేనని బాధపడుతున్న సమయంలో తెలిసిన వ్యక్తి సలహా మేరకు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాం. నా బిడ్డ ప్రాణాలను నిలిపేందుకు అవసరమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఆ ఖర్చును భరించాలని పిటిషన్ వేశాం. ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందన లేదు’’ అని చెబుతూ సూర్యకుమారి బోరున విలపించింది. వ్యాధి లక్షణాలు గాచర్స్ వ్యాధినే గ్లూకోసెరిబ్రో సైడస్ అని కూడా అంటారు. ఎంజైము లోపం వల్ల కాలేయం పెరుగుతూ ఉంటుంది. ప్లేట్లెట్స్ ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉంటాయి. ఎర్రరక్త కణాలను గాచర్స్ వ్యాధి ధ్వంసం చేస్తూ ఉంటుంది. గాయమైతే రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూనే ఉంటుంది. గాచర్స్ కణాలు ఎముకల్లో మూలుగను కూడా పీల్చేస్తూ ఉంటాయి. ఎర్రరక్త కణాలు తక్కువ కావడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇనుప ధాతువు మోతాదు రోజు రోజుకూ పడిపోతూ ఉంటుంది. రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎముకలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధిని బెటా – గ్లూకోసైడస్ లుకోసైట్ (బీజీఎల్) అనే రక్తపరీక్ష ద్వారా గుర్తిస్తారు. సాయం అందించాలనుకున్నవారు... అజయ్ మేనమామ సతీష్‌ను 8500637917, 8374145443 నెంబర్లలో సంప్రదించవచ్చు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడు
సాక్షి, విజయవాడ : విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి విషాదానికి కారణం మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌రావు అని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. తదుపరి విచారణ అనంతరం అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన సూర్యకుమారి శనివారం రైవస్ కాలువలో శవమై కనిపించింది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కాలువలో ఓ ముళ్లకంపలో చిక్కుకొని ఆమె మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను చూస్తున్న జాయింట్ కమిషనర్ రమణ కుమార్ రైవస్ కాలువ వద్ద మృతదేహం బయటకు తీసిన సమయంలో ఉండగా సాక్షి మీడియా ఆయనను సంప్రదించి వివరాలు కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడని అన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి అతడే కారణం అని తెలిపారు. తమ పరిశోధనలో ఇదే విషయం తెలిసిందని, అయితే, స్నేహితులు, బంధువులను ప్రశ్నించి పూర్తి పరిశోధన చేయాల్సి ఉందని, అది పూర్తయ్యాక విద్యాసాగర్‌పై సంబంధిత సెక్షన్లు నమోదు చేస్తామన్నారు. తమ విచారణలో వారిద్దరి ఏడేళ్ల నుంచే సంబంధం ఉందని తెలిసిందన్నారు. ఈ కేసును చేధించేందుకు ఆరు బృందాలు పెట్టినట్లు తెలిపారు. -
సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడు
-
సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం
-
సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం
విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. రైవస్ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆమె మృతదేహం వెలికితీశాయి. గత నాలుగు రోజులుగా కనిపించకుండాపోయిన సూర్యకుమారి కేసులో శనివారమే పోలీసులకు ఆధారం దొరికింది. ఆమె నడిపే బైక్ రైవస్ కాల్వ వద్ద లభించింది. దీంతో సూర్యకుమారి కాలువలో దూకి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. ఆమె నడిపే మోపెడ్ బైక్ లభించిన కాల్వలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాల్వమొత్తం ప్రత్యేక బోటులతో గాలించడంతో ఓ రైల్వేగేటుకు సమీపంలోని రైవస్ కాలువలో ముళ్ల కంపలోచిక్కుకొని ఉన్న ఆమె మృతదేహం గుర్తించి వెలికి తీశారు. నాలుగు రోజులు కావడంతో ఆమె మృతదేహం దాదాపు కుళ్లిన స్థితిలోకి వచ్చింది. -
సూర్యకుమారి కాలువలో దూకిందా?
విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసులో పోలీసులకు ఆధారం దొరికింది. ఆమె నడిపే బైక్ రైవస్ కాల్వలో లభించింది. దీంతో సూర్యకుమారి కాలువలో దూకి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. ఆమె నడిపే మోపెడ్ బైక్ లభించిన కాల్వలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాల్వమొత్తం ప్రత్యేక బోటులతో గాలిస్తున్నారు. సూర్యకుమారి అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. సూర్యకుమారి మిస్టరీ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్‌కుమార్, మేరిలు పలు అనుమానాలు విద్యాసాగర్పైనే అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఇప్పటికే అతడిని ప్రశ్నించి వదిలేశారు. అయితే, అతడిపై పూర్తిగా అనుమానాలు తొలగినట్లేనా లేక పోలీసులు పరిశీలనలో పెట్టారా అనే విషయం తేలాల్సి ఉంది. ఒక వేళ సూర్యకుమారి కాలువలో దూకితే అందుకుగల కారణాలు కూడా పోలీసులు శోధించాల్సి ఉంది. ఎవరైనా ఆత్మహత్యకు పురికొల్పారా లేక ఆమెనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందా.. అసలు ఆమె నిజంగానే ఆత్మహత్యకు పాల్పడిందా అనే తదితర ప్రశ్నలకు ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది. -
‘సూర్యకుమారి ఫ్రెండే.. ఏ సంబంధం లేదు’
-
‘సూర్యకుమారి ఫ్రెండే.. ఏ సంబంధం లేదు’
విజయవాడ: విజయవాడ నగరంలో కలకలం సృష్టించిన డాక్టర్ కొర్లపాటి సూర్యకుమారి అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌పై సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్‌కుమార్, మేరిలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అదృశ్యానికి విద్యాసాగర్ బాధ్యత వహించాలన్నారు. తనకు వివాహం కాలేదని విద్యాసాగర్ సూర్యకుమారిని మభ్యపెట్టాడని, రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆమెతో విద్యాసాగర్ కుటుంబీకులు మాట్లాడారని చెప్పారు. ఆమె ఎక్కడ ఉందో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ ఫోన్‌కు సూర్యకుమారి ఫోన్ నుంచి వచ్చినట్లు చెబుతున్న మెసేజ్‌లు విద్యాసాగర్ సృష్టించాడని తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. తమ కుమార్తె వివాహ సంబంధాలు కూడా చెడగొట్టడంలో విద్యాసాగర్ హస్తం ఉందన్నారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని వారు వేడుకుంటున్నారు. ఆమెతో ఎలాంటి సంబంధం లేదు: విద్యాసాగర్ సూర్యకుమారి మిస్సింగ్ కేసులో ఆమె తల్లిదండ్రులు విద్యాసాగర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని విద్యాసాగర్ చెప్పారు. పొరపాటున తనకు మెస్సేజ్ పంపించి ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. ఢిల్లీ వెళ్లి క్రాష్ కోర్స్ చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు సూర్యకుమారి తనతో చెప్పిందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదని, తమ మధ్య ఉంది స్నేహం మాత్రమేనని ఇంకా ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. -
‘అమ్మ’ లడ్డూ ఆరగింపు
⇒ లడ్డూ ప్రసాదాల్లో సిబ్బంది చేతివాటం ⇒ తెల్లవారేలోగానే గుట్టుగా లడ్డూలు విక్రయాలు ⇒ ఇద్దరు ఉద్యోగుల తొలగింపుతో బయట పడిన వ్యవహారం ⇒ దేవస్థానం సిబ్బంది, ప్రైవేటు సిబ్బంది మిలాఖత్ ⇒ రూ.లక్షల్లో అమ్మ సొమ్ముకు ఎసరు ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని దుర్గగుడిలో మరోసారి రుజువైంది. సాక్షాత్తు దుర్గమ్మ సొమ్మును ఆలయ ఉద్యోగులు కొంత మంది ప్రైవేటు సిబ్బందితో కలిసి కొంతకాలంగా దిగమింగుతున్నారు. గట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంలో నెలకు లక్షల రూపాయలు అమ్మ సొమ్ము స్వాహా అవుతున్నట్లు ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. సాక్షి, విజయవాడ : దుర్గమ్మ లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో గోల్మాల్ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలోని సిబ్బందితో పాటు ప్రసాదాలు విక్రయించే కౌంటర్లోని ప్రైవేటు సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డబ్బుల వ్యవహారంలో ప్రసాదాల కౌంటర్ల సూపర్వైజర్లుగా వ్యవహరించే ఇద్దరు వ్యక్తులను విధుల నుంచి తొలగించడం, వారు తిరిగి విధులకు హాజరు కావాలంటే కాంట్రాక్టర్ లక్షలాది రూపాయలు డిమాండ్ చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ప్రసాదాల విక్రయించే కౌంటర్‌ను ఒక బ్యాంకు నిర్వహిస్తున్నా అందులో పనిచేసేందుకు సిబ్బందిని మాత్రం కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. అందువల్ల కాంట్రాక్టు సిబ్బంది, దేవస్థానం సిబ్బంది మిలాకత్ అయి లడ్డూలను దారిమళ్లిస్తున్నారు. రోజుకు 5 గంపలు.. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అర్జున వీధిలోని బుద్దా వారి సత్రంలో తయారు చేస్తారు. ఈ లడ్డూలను దేవస్థాన వాహనాల్లోనే కొండపై ఉన్న కౌంటర్లకు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో నిత్యం ఉదయం 9 గంటలలోపు వెళ్లే లడ్డూ ప్రసాదం గంపలతో పాటు అదనంగా 5 గంపలను కౌంటర్లకు పంపుతున్నట్లు తేలింది. ఈవో, ఇతర విభాగాల అధికారులు విధులకు వచ్చే లోగానే ఈ 5 గంపల లడ్డూలను విక్రయించి డబ్బులను ప్రసాదాల కౌంటర్ల నుంచి పక్కకు తప్పిస్తున్నారు. ఒక్కొక్క గంపలో 300 లడ్డూల చొప్పున రోజుకు 5 గంపల్లో మొత్తం 15 వందల లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఒక్కొక్క లడ్డూ రూ.10 చొప్పున రూ.15 వేల విలువైన లడ్డూలు ప్రతి రోజూ దారిమళ్లిస్తున్నారు. ఇక శుక్రవారం, ఆదివారాల్లో పది నుంచి పదిహేను గంపలు సైతం దారి మళ్లిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. లడ్డూలు దారి మళ్లింపునకు సహకరించేందుకు ఆయా బీట్లలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది మొదలు కొని ప్రసాదాల కౌంటర్ల వద్ద ఉండే హోంగార్డుల వరకు వాటాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక లడ్డూలను విక్రయించగా వచ్చిన మొత్తంలో రూ.10 వేలు లడ్డూ తయారీ కేంద్రంలోని సిబ్బందికి, రూ.5 వేలు కౌంటర్లోని సిబ్బంది, సూపర్వైజర్లు పంచుకుంటున్నట్లు సమాచారం. త్వరలో ట్రైలోక్ కంపెనీకి అప్పగిస్తాం లడ్డూలు దారిమళ్లుతున్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తాం. త్వరలోనే ట్రైలోక్ కంపెనీకి అప్పగిస్తాం. వారు యాక్సిస్ కార్డు భక్తులకు ఇస్తారు. వాటి ద్వారా దర్శనంతో పాటు ప్రసాదాలు ఎన్ని కావాలో భక్తులకు ఒకేసారి ఇస్తారు. దీనివల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉండదు. – సూర్యకుమారి,ఈవో, దుర్గగుడి -
'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు'
విజయవాడ : దుర్గ గుడి వద్ద పోలీసులు శనివారం అత్యుత్సహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రి కొండపైకి అనుమతి లేదంటూ దేవాలయ ఈవో సూర్యకుమారి, ప్రధాన అర్చకులు శివప్రసాద్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కొండపైకి నడిచి వెళ్లాలని వారికి పోలీసులు సూచించారు. తాను దేవాలయం ఈవోనని సూర్యకుమారి పోలీసులకు చెప్పింది. అయినా ఆమె మాటలను వారు పట్టించుకోలేదు. అయితే దేవాలయం ఆధికారుల సమక్షంలోనే వీఐపీల వాహనాలకు కొండపైకి అనుమతించారు. పోలీసుల తీరుపై ఆలయ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈవో సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సమయత్తమయ్యారు. -
కోర్టుకు హాజరైన ప్రేమజంట
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు జిల్లా పూసానిమేడు ప్రాంతానికి చెందిన వినాయకం కుమార్తె సూర్యకుమారి(23) పదవ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం వెంగల్ సమీపంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వెంగల్ సమీపంలోని పనపాక్కం గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు కార్తీక్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరిది వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఈ నెల 23న ఇంటి నుంచి పారిపోయి రాయపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. సూర్యకుమారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆమె తమ్ముడు శంకర్ వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సూర్యకుమారి, కార్తీక్ బుధవారం తిరువళ్లూరు కోర్టులో న్యాయమూర్తి తమిళ్‌సెల్వి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి తమిళ్‌సెల్వి సూర్యకుమారిని ప్రత్యేకంగా విచారించారు. తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, తాను మూడేళ్ల నుంచి కార్తీక్‌ను ప్రేమిస్తున్నానని పేర్కొంది. తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నట్టు చెప్పింది. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని తెలిపింది. దీంతో న్యాయమూర్తి తమిళ్ సెల్వి తీర్పు వెలువరిస్తూ సూర్యకుమారి కార్తీక్‌తో వెళ్లవచ్చని పేర్కొన్నారు. ప్రేమ వివాహానికి మద్దతుగా, వ్యతిరే కంగా పెద్ద ఎత్తున యువకులు కోర్టుకు హాజరుకావడంతో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.