
'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు'
విజయవాడ : దుర్గ గుడి వద్ద పోలీసులు శనివారం అత్యుత్సహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రి కొండపైకి అనుమతి లేదంటూ దేవాలయ ఈవో సూర్యకుమారి, ప్రధాన అర్చకులు శివప్రసాద్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కొండపైకి నడిచి వెళ్లాలని వారికి పోలీసులు సూచించారు. తాను దేవాలయం ఈవోనని సూర్యకుమారి పోలీసులకు చెప్పింది.
అయినా ఆమె మాటలను వారు పట్టించుకోలేదు. అయితే దేవాలయం ఆధికారుల సమక్షంలోనే వీఐపీల వాహనాలకు కొండపైకి అనుమతించారు. పోలీసుల తీరుపై ఆలయ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈవో సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సమయత్తమయ్యారు.