కలెక్టర్‌ పేరుతో జిల్లా అధికారులకీ మెసేజ్‌లు.. డబ్బులు పంపించాలని ఆదేశాలు | Messages to all Employees on WhatsApp Name of Vizianagaram Collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ పేరుతో జిల్లా అధికారులకీ ఒకేసారి మెసేజ్‌లు.. డబ్బులు పంపించాలని ఆదేశాలు

Published Tue, Mar 22 2022 12:10 PM | Last Updated on Tue, Mar 22 2022 3:34 PM

Messages to all Employees on WhatsApp Name of Vizianagaram Collector - Sakshi

పై చిత్రం  చూశారా.. బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా వచ్చిన సందేశం. కలెక్టర్‌  ఎ.సూర్యకుమారి ఫొటోను డీపీగా వాడి ఫేక్‌ నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ఆమె ఒక్కరికే కాదు జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు, ఎంపీడీఓలకు ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌లే వచ్చాయి.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: కలెక్టర్‌ పేరుతో వివిధ ఫోన్‌నంబర్లతో జిల్లా అధికారులందరికీ ఒకేసారి మెసేజ్‌లు రావడం సోమవారం కలకలం రేపింది. సైబర్‌ నేరగాళ్లు 94391 40791, 94391 40733, 94391 39978, 73812 76244 నంబర్ల నుంచి వాట్సాప్‌లో అధికారులతో చాటింగ్‌ను కొనసాగించారు. విధి నిర్వహణకు సంబంధించిన ప్రశ్నలు వేసిన తర్వాత ఆ నంబర్లను ఫోన్‌లో పర్సనల్‌గా సేవ్‌ చేసుకోవాలని సూచించారు. తర్వాత కొద్దిసేపటికే డబ్బులు పంపించాలని ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ వాట్సాప్‌ మేసెజ్‌లు సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో కాసేపు సంచలనం సృష్టించాయి.

వాట్సాప్‌ మెసేజ్‌లు అందుకున్న అధికారుల్లో చాలామంది గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్‌ సూర్యకుమారి ఎదురుగానే ఉన్నారు. ఆమె చేతిలో సెల్‌ఫోన్‌ లేదు. చాటింగ్‌ ఎలా చేస్తున్నారనే అనుమానం వచ్చి వెంటనే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తానెప్పుడూ వాట్సాప్‌ గ్రూప్‌లకు తన ఫొటోను డీపీగా ఉంచలేదని, తన ఫొటోతో ఉన్న వాట్సాప్‌ నంబర్లను వెంటనే బ్లాక్‌ చేయాలని అధికారులకు మైక్‌లో సూచించారు. అధికారికంగా ప్రభుత్వం కేటాయించిన నంబరు మినహా ఎలాంటి పర్సనల్‌ నంబర్లు లేవని, అందరూ గుర్తించి ఫేక్‌ మెసేజ్‌లతో మోసపోవద్దని సూచిస్తూ జిల్లా యంత్రాంగానికి వెంటనే సందేశం పంపించారు. 

చదవండి: (మరీ ఇంత దారుణమా: ఆస్తులు రాయించుకుని..)

కటక్‌లో ఉన్న కేటుగాళ్లు... 
ఫేక్‌ మెసేజ్‌ల విషయాన్ని వెంటనే ఎస్పీ దీపిక దృష్టికి కలెక్టర్‌ తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు. ఫేక్‌ మెసేజ్‌లు పంపినవారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని అభ్యర్థిస్తూ ఆరుగురు ఉద్యోగులు విజయనగరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆ ఫోన్‌ నంబర్లను వాడినవారి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. వారు కటక్‌లో ఉన్నట్టుగా అంచనాకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందం కటక్‌కు బయల్దేరినట్లు తెలిసింది. 

అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్‌ ప్రొఫైల్‌తో జిల్లా ఉన్నతాధికారులకు వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చాయి. వాటితో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదు. వాట్సాప్‌ ద్వారా వచ్చే ఆదేశాలు, సూచనలను ఎవ్వరూ పట్టించుకోవద్దు. ఇలాంటి ఫేక్‌ నంబర్ల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇంకా ఎవరికైనా అలాంటి మెసేజ్‌లు వస్తే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వండి. ఫేక్‌ మేసెజ్‌లకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 
– ఎ.సూర్యకుమారి, కలెక్టర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement