చేపలు పట్టడం కాదు, చేపల శాస్త్రం చదవండి, ఉద్యోగాలు కొట్టండి | Dont catch the fish, Catch the certificate in Fisheries Science | Sakshi
Sakshi News home page

చేపలు పట్టడం కాదు, చేపల శాస్త్రం చదవండి, ఉద్యోగాలు కొట్టండి

Published Tue, Apr 4 2023 7:10 AM | Last Updated on Tue, Apr 4 2023 4:56 PM

Sakshi

ముత్తుకూరు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆక్వా రంగంలో బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు సూత్రాలతో ముత్తుకూరులో మత్స్య శాస్త్ర కళాశాల ఏర్పడింది. రాష్ట్రంలోని ఏకైక కళాశాలగా 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నీలి విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని 1991 ఆగస్ట్‌ 31వ తేదీన నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్‌లో బీఎఫ్‌ఎస్సీ (బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌) నాలుగు సంవత్సరాల కోర్సు 20 సీట్లతో ప్రారంభమైంది. 1995 మార్చి 10వ తేదీన ఈ కళాశాలకు నూతన భవనం ఏర్పడింది.

పీహెచ్‌డీ స్థాయికి..

దేశంలో మొత్తం 28 మత్స్య కళాశాలున్నాయి. ముత్తుకూరులోని మత్స్య కళాశాల తొలుత తిరుపతిలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండగా, తర్వాత శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. తొలుత బీఎఫ్‌ఎస్సీ కోర్సులతో మొదలై క్రమంగా ఎంఎఫ్‌ఎస్సీ, పీహెచ్‌డీ స్థాయికి ఎదిగింది.

శాస్త్రవేత్తలుగా..

అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు మత్స్య శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. బోధనతో సరిపెట్టకుండా పరిశోధనలు చేయిస్తూ, సముద్ర ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నారు. ఈ కళాశాలకు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో 73 ఎకరాలు, ఎగువమిట్టలో 47 ఎకరాల భూములున్నాయి. ఎగువమిట్ట భూముల్లో చేపల పెంపకం జరుగుతోంది. విద్యార్థులు ఇక్కడ తరచూ శిక్షణ పొందుతున్నారు. విశాలమైన క్రీడా మైదానం, అనేక దేశ, విదేశీ పుస్తకాలతో లైబ్రరీ, ల్యాబ్‌, సమావేశ మందిరం, హాస్టళ్లు తదితర సౌకర్యాలతో ఈ కళాశాల యూనివర్సిటీ స్థాయిని సంతరించుకుంది.

క్షేత్ర సందర్శన

తరగతి గదుల్లో మత్స్య శాస్త్రాన్ని అభ్యసించడమే కాకుండా ఆక్వా సాగు, రైతుల కష్ట, నష్టాలు స్వయంగా తెలుసుకునే నిమిత్తం BFSc నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులు ‘ఫివెప్‌’ (ఫిషరీస్‌ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 110 రోజులపాటు గ్రామాల్లో నివాసం ఉంటూ రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల యాజమాన్యం, మేత వినియోగం, అనారోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు, పట్టుబడి తదితర అంశాలపై అవగాహన పెంచుకుంటారు. దీనిపై ఒక నివేదిక రూపొందిస్తారు. అలాగే, ‘ELP’ (ఎక్స్‌పీరియన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 12 వారాల ఈ కార్యక్రమంలో ఫైనలియర్‌ విద్యార్థులు రంగు చేపల పెంపకం చేసి, అమ్మకాలు చేస్తారు. చేపలు, రొయ్యల ఊరగాయలు, వడియాలు తయారు చేసి, అమ్మకాలు చేస్తారు. భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది.

కోర్సు సబ్జెక్ట్‌లు

BFMSc - విద్యార్థుల సంఖ్య - 154 8

MFMSc  - విద్యార్థుల సంఖ్య - 12 6

PHd - 7 3

మెండుగా ఉద్యోగావకాశాలు

విద్యార్థులకు బోధనతోపాటు, శిక్షణ, క్షేత్ర సందర్శన చాలా ముఖ్యం. మత్స్య కళాశాలలో చదువు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి కళాశాలలో చదివిన విద్యార్థులు చాలామంది దేశ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.

– డాక్టర్‌ రామలింగయ్య, అసోసియేట్‌ డీన్‌

ప్రతిపాదన ఉంది

మన రాష్ట్రంలో మరో రెండు మత్స్య కళాశాలలు అవసరం. తమిళనాడులో నాలుగు, మహారాష్ట్రలో మూడు మత్స్య కళాశాలలున్నాయి. ఈ కోణంలో మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, నరసాపురంలో రెండు మత్స్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.

– డాక్టర్‌ డి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఫిషరీస్‌ డీన్‌

1
1/5

విద్యార్థులు తయారు చేసిన రొయ్యల పచ్చడి2
2/5

విద్యార్థులు తయారు చేసిన రొయ్యల పచ్చడి

ఆరోగ్యవంతమైన రొయ్య సీడ్‌ 3
3/5

ఆరోగ్యవంతమైన రొయ్య సీడ్‌

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement