University education
-
చేపలు పట్టడం కాదు, చేపల శాస్త్రం చదవండి, ఉద్యోగాలు కొట్టండి
ముత్తుకూరు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆక్వా రంగంలో బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు సూత్రాలతో ముత్తుకూరులో మత్స్య శాస్త్ర కళాశాల ఏర్పడింది. రాష్ట్రంలోని ఏకైక కళాశాలగా 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నీలి విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని 1991 ఆగస్ట్ 31వ తేదీన నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్లో బీఎఫ్ఎస్సీ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్) నాలుగు సంవత్సరాల కోర్సు 20 సీట్లతో ప్రారంభమైంది. 1995 మార్చి 10వ తేదీన ఈ కళాశాలకు నూతన భవనం ఏర్పడింది. పీహెచ్డీ స్థాయికి.. దేశంలో మొత్తం 28 మత్స్య కళాశాలున్నాయి. ముత్తుకూరులోని మత్స్య కళాశాల తొలుత తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండగా, తర్వాత శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. తొలుత బీఎఫ్ఎస్సీ కోర్సులతో మొదలై క్రమంగా ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ స్థాయికి ఎదిగింది. శాస్త్రవేత్తలుగా.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు మత్స్య శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. బోధనతో సరిపెట్టకుండా పరిశోధనలు చేయిస్తూ, సముద్ర ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నారు. ఈ కళాశాలకు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో 73 ఎకరాలు, ఎగువమిట్టలో 47 ఎకరాల భూములున్నాయి. ఎగువమిట్ట భూముల్లో చేపల పెంపకం జరుగుతోంది. విద్యార్థులు ఇక్కడ తరచూ శిక్షణ పొందుతున్నారు. విశాలమైన క్రీడా మైదానం, అనేక దేశ, విదేశీ పుస్తకాలతో లైబ్రరీ, ల్యాబ్, సమావేశ మందిరం, హాస్టళ్లు తదితర సౌకర్యాలతో ఈ కళాశాల యూనివర్సిటీ స్థాయిని సంతరించుకుంది. క్షేత్ర సందర్శన తరగతి గదుల్లో మత్స్య శాస్త్రాన్ని అభ్యసించడమే కాకుండా ఆక్వా సాగు, రైతుల కష్ట, నష్టాలు స్వయంగా తెలుసుకునే నిమిత్తం BFSc నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులు ‘ఫివెప్’ (ఫిషరీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 110 రోజులపాటు గ్రామాల్లో నివాసం ఉంటూ రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల యాజమాన్యం, మేత వినియోగం, అనారోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు, పట్టుబడి తదితర అంశాలపై అవగాహన పెంచుకుంటారు. దీనిపై ఒక నివేదిక రూపొందిస్తారు. అలాగే, ‘ELP’ (ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 12 వారాల ఈ కార్యక్రమంలో ఫైనలియర్ విద్యార్థులు రంగు చేపల పెంపకం చేసి, అమ్మకాలు చేస్తారు. చేపలు, రొయ్యల ఊరగాయలు, వడియాలు తయారు చేసి, అమ్మకాలు చేస్తారు. భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. కోర్సు సబ్జెక్ట్‌లు BFMSc - విద్యార్థుల సంఖ్య - 154 8 MFMSc - విద్యార్థుల సంఖ్య - 12 6 PHd - 7 3 మెండుగా ఉద్యోగావకాశాలు విద్యార్థులకు బోధనతోపాటు, శిక్షణ, క్షేత్ర సందర్శన చాలా ముఖ్యం. మత్స్య కళాశాలలో చదువు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి కళాశాలలో చదివిన విద్యార్థులు చాలామంది దేశ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. – డాక్టర్ రామలింగయ్య, అసోసియేట్ డీన్ ప్రతిపాదన ఉంది మన రాష్ట్రంలో మరో రెండు మత్స్య కళాశాలలు అవసరం. తమిళనాడులో నాలుగు, మహారాష్ట్రలో మూడు మత్స్య కళాశాలలున్నాయి. ఈ కోణంలో మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, నరసాపురంలో రెండు మత్స్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. – డాక్టర్ డి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఫిషరీస్ డీన్ -
తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. యూనివర్సిటీ విద్యపై నిషేధం
కాబూల్: అఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వంలో మహిళా లోకంపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. అధికారాన్ని చేజిక్కుంచుకునే ముందు మహిళ హక్కుల కోసం పోరాడుతామని, ప్రజలకు స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామయ్య పాలన అందిస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు.. తరువాత తమ అనాలోచిత నిర్ణయాలు, అరాచక పాలనతో దేశంలోని పౌరుల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలికల స్వేచ్చను హరిస్తూ.. వారిని ఇప్పటికే ఉన్నత విద్యకు దూరం చేశారు. అనేక ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు విధించారు. దేశ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధిరంచాల్సిందేనని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు మరో సంచలన నిబంధన తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ(విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. మహిళా విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలుపుతూ మేరకు ట్వీట్ చేశారు. న్యూయర్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై.. తాలిబన్లు నిర్భంధించిన ఇద్దరు అమెరికన్లు విడుదల చేస్తున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తునఆనయి. మహిళలను ఆంక్షలకు గురిచేస్తున్న తాలిబన్లను.. ఆప్గనిస్థాన్‌లోని అందరి హక్కులను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా ఉండేందుకు ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. చీకట్లో వేల మంది.. -
చీవినింగ్తో లైఫ్ చిల్!
సాక్షి, హైదరాబాద్: నేర్చుకోవడం జీవితాంతం సాగే ప్రక్రియ. ఒకసారి ఉద్యోగం అనే బతుకు యుద్ధంలోకి ప్రవేశించాక చదివే తీరిక ఎక్కడుంటుంది. అవకాశాలూ అంతంత మాత్రమే! ఇదీ మనలో చాలామంది అనుకునేది. కానీ వాస్తవం వేరు అంటున్నారు పరకాల ప్రత్యూష, భరత్‌కుమార్‌లు. బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే చీవినింగ్ స్కాలర్‌షిప్‌నకు తెలుగు రాష్ట్రాల నుంచి వీరు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో స్థిరపడినా కూడా నేర్చుకోవాలన్న ఆసక్తితో ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లండన్‌లో చదువు ఎలా ఉంటుంది? యూనివర్సిటీల తీరు తెన్నులేంటి? చీవినింగ్ స్కాలర్లుగా తమ ప్రాథమ్యాలేమిటి? భవిష్యత్ ప్రణాళికలేంటి.. తదితర విషయాలను వారు ఇలా పంచుకున్నారు. పర్యావరణ కోసం: పరకాల ప్రత్యూష ‘చీవినింగ్ స్కాలర్షిప్ మన జీవితాన్ని మార్చే అరుదైన అవకాశం. 2018లో అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న ఏకైక తెలుగు మహిళగా రికార్డు సృష్టించా. చీవినింగ్ స్కాలర్‌గా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ పాలిటిక్స్‌పై బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్నా. సుస్థిరాభివృద్ధి, విధాన రూపకల్పన వంటి అంశాల్లో పనిచేస్తుంటాను. 2021లో కోర్సు పూర్తయిన కొంత సమయానికే బ్రిటన్‌లో జరగనున్న కాప్–26 కోసం పనిచేయాలని భావిస్తున్నాను. భారత్ తిరిగి వచ్చాక పర్యావరణ, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా’అని పరకాల ప్రత్యూష పేర్కొన్నారు. వర్సిటీల గురించి.. ‘బ్రిటన్‌లో విశ్వవిద్యాలయాల వ్యవస్థ చాలా వినూత్నమైంది. ఎంపిక చేసుకునేందుకు బోలెడన్ని కోర్సులు ఉన్నాయి. నా కోసం కూడా ఓ ప్రత్యేకమైన కోర్సు సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడి సిబ్బంది ఆయా రంగాల్లో నిష్ణాతులైనా కూడా చాలా కలుపుగోలుగా ఉంటారు. ఓపికతో, మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ఈ లక్షణాలన్నింటి వల్ల ఇక్కడి చదువు సంతృప్తినిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ అందరినీ గౌరవిస్తారు. ఎవరినీ చులకన చేసి మాట్లాడరు. విద్యార్థులందరి అభిప్రాయాలు, ఆలోచనలకు విలువ ఉంటుంది. దేశవిదేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలసి చదువుకోవడం వల్ల వారి సంస్కృతులు తెలుస్తాయి. చీవినింగ్ స్కాలర్షిప్ అనేది జీవితకాలంలో దొరికే అద్భుత అవకాశం. ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే మీరిచ్చే సమాధానాలు వీలైనంత నిజాయితీగా ఉండేలా జాగ్రత్త పడండి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యేక గుర్తింపు కోసం: భరత్‌కుమార్ ‘ప్రజారోగ్య రంగంలో నాదైన గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. విశాఖపట్నంలో కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ చదివాను. సంజీవని వంటి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. గిరిజన సమాజాల అభివృద్ధికి నా వంతు సాయం చేశాను. విశాఖ జిల్లా గిరిజనులపై నేను జరిపిన అధ్యయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చేరేలా చేసింది. అక్కడే ఎంఏ పూర్తి చేశా. వేర్వేరు స్థాయిల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పని చేయడం ప్రజారోగ్యం ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. అందుకే చీవినింగ్ స్కాలర్షిప్లో భాగంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ఉన్నత చదువు అభ్యసించేందుకు ఎంపిక కావడం సంతోషాన్నిస్తోంది. ప్రజా రోగ్య రంగంలో తాజా పరిశోధనలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వచ్చింది. జాతీయస్థాయిలో వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రజారోగ్యాన్ని మానవాభివృద్ధి సూచీలో భాగమయ్యేలా చేసేందుకు కృషి చేస్తా’అని భరత్ కుమార్ వివరించారు. ఏమిటీ చీవినింగ్ స్కాలర్షిప్? బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో అమలు చేస్తున్న స్కాలర్షిప్ పథకం ఇది. బ్రిటన్‌లోని సుమారు 150 యూనివర్సిటీల్లో సుమారు 12 వేల కోర్సుల్లో మీకు నచ్చిన దానిలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైతే బ్రిటన్‌లో ఏడాది కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఖర్చులను ఆ దేశ ప్రభుత్వమే భరిస్తుంది. చీవినింగ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారికి రెండేళ్ల వృత్తి అనుభవం ఉండాలి. దరఖాస్తుకు గడువు ఈ ఏడాది నవంబర్ 3వ తేదీ. 1983లో ప్రారంభమైన చీవినింగ్ స్కాలర్షిప్, ఫెలోషిప్‌ల ద్వారా ఇప్పటివరకు సుమారు 3,200 మంది స్కాలర్లు బ్రిటన్‌లో విద్యను అభ్యసించారు. -
ఉన్నత విద్య.. ఉద్యోగం
⇒డిగ్రీ తర్వాత ఎన్నో అవకాశాలు ⇒అందుబాటులో యూనివర్సిటీ విద్య ⇒ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అత్యున్నత విద్య.. ఉపాధి పొందే కోర్సులు అభ్యసించవచ్చు. పోటీ పరీక్షలు రాసి మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఉద్యో గం చేస్తూ కూడా ఆసక్తి ఉన్న ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల చివరికి పరీక్షలు పూర్తికానున్నాయి. ఈనేపధ్యంలో ఏంచేయాలని విద్యార్థులు ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో 136 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70వేలమంది డిగ్రీ చదువుతున్నారు. చివరి సంవత్సరం చదువుతున్న వారి సంఖ్య దాదాపు 25వేలు ఉంది. వీరిలో కొంతమంది డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాల వైపు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్నారు. దూరవిద్య రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లి చదవలేని వారికి ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వివిధ పీజీ కోర్సులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. ప్రస్తుతం ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మిగతా యూనివర్సిటీలకు నోటిఫికేష న్ రావాల్సి ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రవేశానికి నాగార్జున యూనివర్సిటీ నిర్వహించే పీసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్వీయూ, మహిళా వర్సిటీతో పాటు ఐదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. జాబ్ ఓరియంటెడ్ కోర్సు డిగ్రీ తర్వాత హాస్పిటాలిటీ, జర్నలిజం, ఫ్యాషన్ అండ్ డిజైనింగ్, ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మహిళా వర్సిటీల్లో మరికొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకేషనల్ కళాశాలలు, ఇతర సంస్థలు కూడా కొన్ని అందిస్తున్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డిగ్రీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కాని, ఉన్నత విద్యకాని అవసరం లేదనుకునేవారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వివిధ రకాల చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్వీయూ, మహిళా విశ్వవిద్యాలయాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తరగతులు అప్పుడప్పుడూ నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీ పూర్తయిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో విజయం సా«ధిస్తే మంచి ఉద్యోగాలు లభిస్తాయి. యూపీఎస్సీ ద్వారా ప్రతి ఏడాది నిర్వహించే ఉద్యోగాలకు దరఖాస్తు చేసి వాటిని పొందవచ్చు. బ్యాంకింగ్, డిఫెన్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పలు ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఇవి కాకుండా ఉన్నత విద్య పొందేవారికి రెగ్యులర్, దూరవిద్య ద్వారా అనేక విశ్వవిద్యాలయాలు పీజీ కోర్సులు అందిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ కోర్సులు చదవాలనుకునేవారికి ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయాలు పలు రకాల సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అందిస్తున్నాయి. ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులు సీటు పొందవచ్చు. ఇక్కడ అడ్మిషన్ పొందినవారికి హాస్టల్ వసతి కూడా అందుబాటులో ఉంది. అంతేగాకుండా క్యాంపస్‌లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. మహిళా వర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మే 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21న ప్రవేశ పరీక్ష నిర్వహించి జూన్‌లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పీజీ ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10 నుంచి 16వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 5 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. న్యాయవాద కోర్సులు డిగ్రీ పూర్తిచేసిన వారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించే లాసెట్ ప్రవేశ పరీక్ష రాసి మూడు సంవత్సరాల లా కోర్సులో చేరవచ్చు. జిల్లాలో మహిళా వర్సిటీతో పాటు ఏడు లా కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.