Fish Andhra
-
పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్‌కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్‌కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్‌ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్‌ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్‌లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్‌ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్‌తో ఈ యూనిట్‌ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్‌టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్‌ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్‌కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్‌లు, ఆస్పత్రి మెటీరియల్స్‌ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్‌ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్‌గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి. -
Fact Check: రామోజీ గొంతులో చేప ముల్లు
సాక్షి, అమరావతి : స్థానిక మత్స్య వినియోగం పెంచడం, నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పన లక్ష్యంగా ‘ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర’ బ్రాండింగ్‌తో హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థకు ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక ఈనాడు అడ్డగోలుగా బురదజల్లుతోంది. మత్స్యకారులు, ఆక్వా రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నాణ్యమైన, తాజా మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు సరఫరా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ ప్రశంసలు దక్కుతుంటే రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. గొంతులో చేపముల్లు గుచ్చుకున్నట్లుగా విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్ర ప్రజల పోషకాహార భద్రత కల్పన, రాష్ట్రవ్యాప్తంగా దేశీయ చేపల వినియోగం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తుంటే ఈనాడు ఎప్పటిలాగే తన క్షుద్ర రాతలతో వారి పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోంది. నిజానికి.. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు ఇప్పటికే హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో ఏర్పాటుకు ముందుకొస్తుంటే చూసి ఓర్వలేకపోతున్న ఈనాడు ‘చేప చుట్టేశారు’ అంటూ అబద్ధాలతో ఓ రోత కథనం అచ్చేసింది. ఇందులోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా.. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపల విక్రయంలో వ్యవస్థీకృత పద్ధతిలో హబ్–స్పోక్ మోడల్లో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాకో ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్‌లెట్స్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్స్ (ఫిష్ కియోస్క్), సూపర్ (లైవ్‌ఫిష్ వెండింగ్ సెంటర్లు), లాంజ్ వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. నిరుద్యోగ యువతకు 40 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మాత్రం 60 శాతం సబ్సిడీపై మంజూరు చేస్తున్నారు. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యతనిచ్చారు. జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు, 4,502 ఫిష్ ఆంధ్ర మినీ అవుట్‌లెట్స్, 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 2,630 మిని, 113 డెయిలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 త్రీ వీలర్, 179 ఫోర్‌వీలర్ యూనిట్లు మంజూరు చేయగా, 2,085 మిని, 42 డెయిలీ, 24 సూపర్, 10 లాంజ్, 69 త్రీ వీలర్, 154 ఫోర్‌వీలర్ యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. మరో 621 మినీ, 71 డెయిలీ, 42 సూపర్, 21 లాంజ్, ఏడు త్రీ వీలర్, 25 ఫోర్‌వీలర్ యూనిట్లు నిర్మాణ, ప్రాసెస్ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన యూనిట్స్ ద్వారా ప్రత్యక్షంగా 6,941 మందికి, పరోక్షంగా 13,146 మందికి జీవనోపాధి లభిస్తోంది. ఇక ఈ ఔట్లెట్స్ తెరిచి ఉన్నా మూసేసినట్లు.. ఒకవేళ వ్యక్తిగత పనుల కారణంతో మూసివేసినా వాటిని మూతపడిపోయినట్లు పాఠకుల్ని తప్పుదోవ పట్టిస్తోంది. పెరిగిన సగటు మత్స్య వినియోగం.. ఇక ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో ఆంధ్రఫ్రదేశ్ దేశంలోనే నెం.1 స్థానంలో ఉంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం జాతీయ స్థాయిలో సాలీనా 7.5 కేజీల నుంచి 10 కేజీలుంటే ఏపీలో మాత్రం కేవలం 8.07 కేజీలుగా ఉంది. దీన్ని కనీసం 20 కేజీలకు పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫిష్ ఆంధ్ర ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేసిన అవుట్‌లెట్స్ ద్వారా వారానికి 558 టన్నులకు పైగా విక్రయాలు జరుగుతున్నాయి.. 2019–20లో రాష్ట్ర తలసరి చేపల వినియోగం 8.07 కేజీలుండగా, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ కృషి ఫలితంగా 2022–23 నాటికి అది 9.93 కేజీలకు పెరిగింది. అంటే.. జాతీయ సగటు వినియోగం స్థాయికి చేరుకుంది. వీటి ఏర్పాటులో తలెత్తే ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని అధిగమించడం ద్వారా వ్యవస్థను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి అవుట్లెట్కు ఒక ఉద్యోగిని అనుసంధానించి షాపు యజమానికి వ్యాపార నిర్వహణలో చేయూత అందించి ముందుకు తీసుకెళ్తున్నారు. సముద్ర మత్స్య ఉత్పత్తులకు క్రేజ్.. నగరాలు, పట్టణాల్లోని చేపల మార్కెట్‌కు వెళ్తే ఎక్కువగా దొరికేవి చెరువు చేపలు, రొయ్యలే. కానీ, ఫిష్ ఆంధ్ర అవుట్‌లెట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. మెత్తళ్ల నుంచి ఖరీదైన పండుగప్పల వరకు.. కాలువ రొయ్యల నుంచి సముద్ర పీతలు, టూనా, కోనాం చేపల వరకు ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి పరిశుభ్రమైన వాతావరణంలో దొరుకుతుండడంతో మాంసప్రియులు క్యూ కడుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలే తప్ప సీఫుడ్ రకాలు చూద్దామన్నా కన్పించేవి కావు. అలాంటిది ఫిష్ ఆంధ్ర అవుట్‌లెట్స్ వచ్చిన తర్వాత అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో రాయలసీమ వాసులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం.. రిటైల్ అవుట్లెట్లలో బతికిన, తాజా చేపలు, రొయ్యలతో పాటు రెడీ టు కుక్ పేరిట మసాలాలు అద్దిన (మారినేట్ చేసిన) ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కనీసం వారం రోజులు చెడిపోకుండా ఉండేలా వాక్యూమ్డ్ ప్యాకింగ్‌తో కటింగ్ ఫిష్, ప్రాన్స్‌తో పాటు డ్రై ఫిష్, చేపలు, రొయ్యల పచ్చళ్లను అందుబాటులో తీసుకొస్తున్నారు. అక్కడికక్కడే తయారుచేసిన స్నాక్ ఐటమ్స్‌తో పార్సిల్ కౌంటర్లను ప్రారంభించారు. అవుట్‌లెట్స్‌తో పాటు స్పోక్స్, ఇతర యూనిట్స్ ద్వారా వారానికి 558 టన్నులు.. ఆదివారం, మంగళవారం రోజుల్లో సగటున 20–30 టన్నుల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటి ఏర్పాటుతో మంగళవారం పూట స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు.. ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్ కోసం డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (డీఎం– సీఆర్ఎం)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా ఫిష్ ఆంధ్ర వెబ్‌సైట్‌ను తీసుకొచ్చారు. యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాస్తవాలిలా ఉంటే.. ఏదో కావాలని నిరుద్యోగ యువత పొట్టకొట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంతో ఈనాడు కుట్రపూరితంగా విషం కక్కుతూ తప్పుడు కథనం రాసిపారేసింది. -
ఒక్క క్లిక్... రెడీ టు కుక్
బతికిన చెరువు చేపలు, రొయ్యలు... తాజా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు... ఎండుచేపలు, రొయ్యల పచ్చళ్లు... నేరుగా వండుకుని తినేలా స్నాక్ ఐటమ్స్‌తోపాటు ‘రెడీ టు కుక్’ పేరిట మసాలా అద్దిన (మారినేట్) మత్స్య ఉత్పత్తులు... కనీసం వారం రోజులు నిల్వ చేసుకునేలా వ్యాక్యూమ్డ్ ప్యాకింగ్‌తో ఐస్‌లో భద్రపర్చిన కటింగ్ ఫిష్, రొయ్యలు... ఇలా 60 రకాల మత్స్య ఉత్పత్తులలో ఏది కావాలన్నా ఇక నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు క్షణాల్లో డోర్ డెలివరీ ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర’ బ్రాండింగ్‌తో హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను విస్తరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... మరో అడుగు ముందుకేసి స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా మత్స్య ఉత్పత్తులను డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏటా 50లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం... తలసరి వినియోగంలో కేవలం 8.07 కేజీలు మాత్రమే ఉంది. దీనిని వచ్చే ఐదేళ్లలో కనీసం 30 శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లాకు ఒక ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్లెట్లతోపాటు ఈ–మొబైల్ 3 వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ వెహికల్స్ డెయిలీ (ఫిష్ కియోస్‌్క), సూపర్ (లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్), లాంజ్ (వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా 1,826 స్టోర్స్ అందుబాటులోకి రాగా, మరో 2వేల యూనిట్లను త్వరలో ప్రారంభించనుంది. తాజాగా ఒక్కో కేటగిరీలో 20 చొప్పున ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ కేటగిరీల్లో 60కి పైగా మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న రకాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే కూడా చేస్తున్నారు. తొలి దశలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో, రెండో దశలో రాష్ట్రమంతా అమలు చేయాలని నిర్ణయించారు. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ వారు సొంతంగా డోర్ డెలివరీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (డీఎం–సీఆర్ఎం)ను అందుబాటులోకి తెచ్చారు. యూ ట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విస్తృత ప్రచారానికి ప్రణాళిక సిద్ధంచేశారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్రత్యేకంగా వెబ్సైట్ మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ‘ఫిష్ ఆంధ్ర’ ఆన్లైన్ అమ్మకాలకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ఇటీవల రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆవిష్కరించారు. రిటైల్ అవుట్‌లెట్స్, ఇతర యూనిట్లను ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయడానికి మ్యాపింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్విగ్గీ, జొమాటో తరహాలో ఫిష్ ఆంధ్ర వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారు. త్వరలో డోర్ డెలివరీకి శ్రీకారం ఫిష్ ఆంధ్ర పేరిట దాదాపు 2వేల అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశాం. ఇంత పెద్దఎత్తున చైన్ వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. మరో అడుగు ముందుకేసి కోరుకున్న మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం. – కూనపురెడ్డి కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
మృగశిర కార్తెలో ‘మీనం‘ దివ్యౌషధం
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు, పండుగొప్ప ఇగురు, కొర్రమేను కూర, కొయ్యింగల పులుసు, గుమ్మడి చుక్క, కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో పచ్చి మెత్తళ్ల మామిడి, ఎండు మెత్తళ్ల వేపుడు, కట్టి చేపలు, బొమ్మిడాయిల పులుసు, రామల ఇగురు, చింతకాయ చిన్న చేపలు, చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు ► చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ► ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. ► మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. ► వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ► టైప్–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ► చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. ► గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. ► చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూంటాయి. -
చేపలు పట్టడం కాదు, చేపల శాస్త్రం చదవండి, ఉద్యోగాలు కొట్టండి
ముత్తుకూరు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆక్వా రంగంలో బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు సూత్రాలతో ముత్తుకూరులో మత్స్య శాస్త్ర కళాశాల ఏర్పడింది. రాష్ట్రంలోని ఏకైక కళాశాలగా 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నీలి విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని 1991 ఆగస్ట్ 31వ తేదీన నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్లో బీఎఫ్ఎస్సీ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్) నాలుగు సంవత్సరాల కోర్సు 20 సీట్లతో ప్రారంభమైంది. 1995 మార్చి 10వ తేదీన ఈ కళాశాలకు నూతన భవనం ఏర్పడింది. పీహెచ్డీ స్థాయికి.. దేశంలో మొత్తం 28 మత్స్య కళాశాలున్నాయి. ముత్తుకూరులోని మత్స్య కళాశాల తొలుత తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండగా, తర్వాత శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. తొలుత బీఎఫ్ఎస్సీ కోర్సులతో మొదలై క్రమంగా ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ స్థాయికి ఎదిగింది. శాస్త్రవేత్తలుగా.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు మత్స్య శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. బోధనతో సరిపెట్టకుండా పరిశోధనలు చేయిస్తూ, సముద్ర ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నారు. ఈ కళాశాలకు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో 73 ఎకరాలు, ఎగువమిట్టలో 47 ఎకరాల భూములున్నాయి. ఎగువమిట్ట భూముల్లో చేపల పెంపకం జరుగుతోంది. విద్యార్థులు ఇక్కడ తరచూ శిక్షణ పొందుతున్నారు. విశాలమైన క్రీడా మైదానం, అనేక దేశ, విదేశీ పుస్తకాలతో లైబ్రరీ, ల్యాబ్, సమావేశ మందిరం, హాస్టళ్లు తదితర సౌకర్యాలతో ఈ కళాశాల యూనివర్సిటీ స్థాయిని సంతరించుకుంది. క్షేత్ర సందర్శన తరగతి గదుల్లో మత్స్య శాస్త్రాన్ని అభ్యసించడమే కాకుండా ఆక్వా సాగు, రైతుల కష్ట, నష్టాలు స్వయంగా తెలుసుకునే నిమిత్తం BFSc నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులు ‘ఫివెప్’ (ఫిషరీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 110 రోజులపాటు గ్రామాల్లో నివాసం ఉంటూ రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల యాజమాన్యం, మేత వినియోగం, అనారోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు, పట్టుబడి తదితర అంశాలపై అవగాహన పెంచుకుంటారు. దీనిపై ఒక నివేదిక రూపొందిస్తారు. అలాగే, ‘ELP’ (ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 12 వారాల ఈ కార్యక్రమంలో ఫైనలియర్ విద్యార్థులు రంగు చేపల పెంపకం చేసి, అమ్మకాలు చేస్తారు. చేపలు, రొయ్యల ఊరగాయలు, వడియాలు తయారు చేసి, అమ్మకాలు చేస్తారు. భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. కోర్సు సబ్జెక్ట్‌లు BFMSc - విద్యార్థుల సంఖ్య - 154 8 MFMSc - విద్యార్థుల సంఖ్య - 12 6 PHd - 7 3 మెండుగా ఉద్యోగావకాశాలు విద్యార్థులకు బోధనతోపాటు, శిక్షణ, క్షేత్ర సందర్శన చాలా ముఖ్యం. మత్స్య కళాశాలలో చదువు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి కళాశాలలో చదివిన విద్యార్థులు చాలామంది దేశ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. – డాక్టర్ రామలింగయ్య, అసోసియేట్ డీన్ ప్రతిపాదన ఉంది మన రాష్ట్రంలో మరో రెండు మత్స్య కళాశాలలు అవసరం. తమిళనాడులో నాలుగు, మహారాష్ట్రలో మూడు మత్స్య కళాశాలలున్నాయి. ఈ కోణంలో మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, నరసాపురంలో రెండు మత్స్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. – డాక్టర్ డి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఫిషరీస్ డీన్ -
‘ఫిష్ ఆంధ్రా’తో ఇంటి ముంగిటకే మత్స్య ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: వినియోగదారుల ముంగిటకే చేపలు, రొయ్యల విక్రయ వాహనాలు (ఫిష్ వెండింగ్ వెహికల్స్) రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై వాటిని ప్రజల ముంగిటకే చేర్చే ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు 40 నుంచి 60 శాతం సబ్సిడీపై మొబైల్ త్రీ వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, ఫోర్ వీలర్ మొబైల్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్ అందజేస్తోంది. మూడు చక్రాల వాహనం ధర రూ.4 లక్షలు కాగా.. నాలుగు చక్రాల వాహనం ధర సైజును బట్టి రూ.12 లక్షల నుంచి రూ.23 లక్షలుగా నిర్ణయించారు. వీటిపై ఎస్సీ, ఎస్టీతోపాటు మహిళా లబ్ధిదారులకు 60 శాతం చొప్పున, ఇతరులకు 40 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారులు చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా సమకూరుస్తారు. తొలి విడతగా 450 వాహనాలు ఈ వాహనాలను సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేస్తుండగా.. తొలి విడతలో 300 త్రీ వీలర్, 150 ఫోర్ వీలర్ వాహనాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. తొలి వాహనాన్ని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఉప్పుల సుందరరావు అనే ఎస్సీ లబ్ధిదారునికి సోమవారం అందజేశారు. వాహనాల్లో ప్రత్యేకతలివే.. మూడు చక్రాల వాహనంలో 200 కేజీల మత్స్య ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 20 లీటర్ల సామర్థ్యం గల రెండు ఐస్ బాక్స్‌లు, వేయింగ్ మెషిన్, మైక్ సౌకర్యం, మత్స్య ఉత్పత్తులను డ్రెస్సింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. నాలుగు చక్రాల వాహనంలో అయితే.. వాహన రకాన్ని బట్టి 2 నుంచి 8 టన్నుల వరకు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. అత్యాధునిక డ్రెస్సింగ్, రెడీ టూ ఈట్ కుకింగ్ చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటిద్వారా లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటెడ్ అండ్ కుక్డ్ ప్రొడక్టŠస్ను రిటైల్, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా అమ్ముతారు. స్నాక్స్, ఇన్స్టెంట్ కుకింగ్ ఫుడ్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఏపీ
సాక్షి, అమరావతి: ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సాగు, దిగుబడులు, ఎగుమతుల్లోనే కాకుండా స్థానికంగా వినియోగంలో సైతం రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులతో కలిసి ఆక్వా హబ్‌లు, రిటైల్ ఔట్లెట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోందని చెప్పారు. వీటిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి పేటీఎంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం మంత్రి సమక్షంలో పేటీఎం, రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఆఫ్కాఫ్ చైర్మన్ కె.అనిల్ బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం రిటైల్ ఔట్లెట్ నిర్వాహకులకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్ (పోస్), క్యూఆర్ కోడ్, తదితరాలను పేటీఏం సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ ఔట్లెట్లను తీసుకొస్తున్నామని చెప్పారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా పోషక విలువలు ఉన్న తాజా చేపలు, సముద్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామన్నారు. వీటి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్ శర్మ మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిలో పేటీఏంను భాగస్వామిని చేయడం గర్వకారణంగా ఉందన్నారు. -
ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లలో డిజిటల్ పేమెంట్లు
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తోన్న రిటైల్ అవుట్లెట్లలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో పేటీఎం సంస్థతో రాష్ట్ర మత్స్యసహకార సంస్థ మంగళవారం ఒప్పందం చేసుకోనుంది. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు సమక్షంలో మత్స్యసహకార సంస్థ చైర్మన్ కె.అనిల్‌బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్‌శర్మ ఒప్పందం చేసుకోనున్నారు. ఒప్పందం మేరకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్, క్యూ ఆర్ కోడ్‌తో కూడిన పేమెంట్ ఆడియో సౌండ్ బాక్సులను పేటీఎం సంస్థ ఉచితంగా సమకూర్చనుంది. వీటిని ఫిష్ ఆంధ్ర యాప్‌తో అనుసంధానం చేస్తారు. ఒప్పందం మేరకు ఈ నెలాఖరుకల్లా 2వేల రిటైల్ అవుట్లెట్లలో పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన వాటికి కూడా అందజేస్తారు. -
‘డిజిటల్’ ఫిష్: ‘ఫిష్ ఆంధ్ర’కు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: పోషక విలువలతో కూడిన తాజా మత్స్య ఉత్పత్తుల విక్రయాలకు ‘ఫిష్ ఆంధ్ర’ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విస్త్రృత ప్రచారం కల్పించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (డీఎం–సీఆర్ఎం)ను అందుబాటులోకి తెస్తోంది. తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా ఆక్వా హబ్‌లు, రిటైల్ అవుట్లెట్ల ద్వారా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. లైవ్ ఫిష్‌లే కాకుండా ఐస్‌లో భద్రపర్చిన వ్యాక్యూమ్ ప్యాక్డ్ ఫిష్‌లను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నారు. వంద ఆక్వాహబ్‌లు లక్ష్యం దాదాపు 48.13 లక్షల టన్నుల మత్స్య దిగుబడులతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వీటి తలసరి వినియోగం కేవలం 8.07 కిలోలు మాత్రమే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో వంద ఆక్వా హబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తొలి విడతగా డిసెంబర్ నెలాఖరులోగా రూ.325.15 కోట్ల అంచనాతో 25 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పులివెందుల, పెనమలూరు ఆక్వా హబ్‌లు అందుబాటులోకి రాగా తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరులలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, తాడేపల్లిగూడెం, మంగళగిరి, గుంటూరులో ఆక్వాహబ్‌ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మిగిలిన జిల్లాల్లో ప్రాథమిక దశలో ఉన్నాయి. వారానికి 50 వేల కిలోల విక్రయాలు హబ్‌ల పరిధిలో రిటైల్ అవుట్‌లెట్స్ కోసం 10,427 మంది దరఖాస్తు చేయగా, 2724 మంది అర్హులను గుర్తించారు. ఇప్పటి వరకు 398 రిటైల్ అవుట్‌లెట్స్ గ్రౌండింగ్ చేయగా 355 అవుట్‌లెట్స్ ట్రయిల్‌రన్ ప్రారంభించాయి. మరోవైపు అందుబాటులో ఉన్న 81 ఫిష్‌మార్ట్ తరహా దుకాణాలను రిటైల్ అవుట్‌లెట్స్‌గా ఆధునికీకరిస్తున్నారు. పులివెందుల, విశాఖపట్నం, వినుకొండల్లో సూపర్ ఫార్మట్స్టోర్స్ (రూ.20 లక్షల యూనిట్) అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రిటైల్ అవుట్లెట్ పరిధిలో 138 కిలోల చొప్పున వారానికి 50 వేల కిలోల మత్స్య విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి అవుట్‌లెట్‌లో పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం పేటీఎం సంస్థతో ఆప్కాఫ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తొలి విడతగా 2 వేల రిటైల్ షాపులకు పేటీఎం డివైజ్‌లు సరఫరా చేయనున్నారు. పీఓఎస్‌తో పాటు రూ.22 వేల విలువైన ఇతర సపోర్టింగ్ పరికరాలను రిటైల్ అవుట్‌లెట్స్‌కు సమకూర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2వేల రిటైల్ అవుట్‌లెట్స్‌లో పేటీఎం, ఇతర డిజిటల్ పరికరాలను ఆగస్టు నాలుగో వారం నుంచి అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కంటైనర్ తరహా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో 150, అర్బన్ ప్రాంతాల్లో 191 చోట్ల స్థలాలను గుర్తించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్ హబ్‌ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న రిటైల్ అవుట్‌లెట్స్, కియోస్క్‌లు, సూపర్ఫార్మెట్, వాల్యూ యాడెడ్ యూనిట్ల ద్వారా మత్స్య ఉత్పత్తుల అమ్మకాలను ఫిష్ ఆంధ్ర పేరిట బ్రాండింగ్ చేస్తున్నారు. హోర్డింగ్‌లు, పేపర్లలో ప్రకటనల కంటే ప్రజలు ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. వారికి మరింత చేరువయ్యేలా ఫిష్ ఆంధ్ర పేరిట యూట్యూబ్ చానల్‌తో పాటు గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ప్రచారం చేయనున్నారు. ఆక్వా, మత్స్య ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వినియోగదారుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ముందుకెళ్లనున్నారు. ఇందుకోసం కాల్ సెంటర్ ఏరా>్పటు యోచన కూడా ఉంది. వినియోగదారుల నుంచి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని వారు కోరుకునే తాజా మత్స్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ డిజిటల్ కంటెంట్ కార్పొరేషన్ సహకారం తీసుకుంటూ ఇతర మార్గాలను అందిపుచ్చుకొని ఫిష్ ఆంధ్రను ప్రమోట్ చేస్తారు. ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ఏర్పాటు కూడా చేస్తున్నారు.