సాక్షి, అమరావతి : స్థానిక మత్స్య వినియోగం పెంచడం, నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పన లక్ష్యంగా ‘ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర’ బ్రాండింగ్‌తో హబ్ అండ్ స్పోక్స్ మోడల్‌లో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థకు ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక ఈనాడు అడ్డగోలుగా బురదజల్లుతోంది. మత్స్యకారులు, ఆక్వా రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నాణ్యమైన, తాజా మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు సరఫరా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ ప్రశంసలు దక్కుతుంటే రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు.
గొంతులో చేపముల్లు గుచ్చుకున్నట్లుగా విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్ర ప్రజల పోషకాహార భద్రత కల్పన, రాష్ట్రవ్యాప్తంగా దేశీయ చేపల వినియోగం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తుంటే ఈనాడు ఎప్పటిలాగే తన క్షుద్ర రాతలతో వారి పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోంది. నిజానికి.. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు ఇప్పటికే హబ్ అండ్ స్పోక్స్ మోడల్‌లో ఏర్పాటుకు ముందుకొస్తుంటే చూసి ఓర్వలేకపోతున్న ఈనాడు ‘చేప చుట్టేశారు’ అంటూ అబద్ధాలతో ఓ రోత కథనం అచ్చేసింది. ఇందులోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే..
స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా..
స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపల విక్రయంలో వ్యవస్థీకృత పద్ధతిలో హబ్–స్పోక్ మోడల్‌లో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాకో ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్‌లెట్స్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్స్ (ఫిష్ కియోస్క్), సూపర్ (లైవ్‌ఫిష్ వెండింగ్ సెంటర్లు), లాంజ్ వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటుచేయాలని సంకల్పించింది.
నిరుద్యోగ యువతకు 40 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మాత్రం 60 శాతం సబ్సిడీపై మంజూరు చేస్తున్నారు. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యతనిచ్చారు. జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు, 4,502 ఫిష్ ఆంధ్ర మినీ అవుట్‌లెట్స్, 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 2,630 మిని, 113 డెయిలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 త్రీ వీలర్, 179 ఫోర్‌వీలర్ యూనిట్లు మంజూరు చేయగా, 2,085 మిని, 42 డెయిలీ, 24 సూపర్, 10 లాంజ్, 69 త్రీ వీలర్, 154 ఫోర్‌వీలర్ యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి.
మరో 621 మినీ, 71 డెయిలీ, 42 సూపర్, 21 లాంజ్, ఏడు త్రీ వీలర్, 25 ఫోర్‌వీలర్ యూనిట్లు నిర్మాణ, ప్రాసెస్ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన యూనిట్స్ ద్వారా ప్రత్యక్షంగా 6,941 మందికి, పరోక్షంగా 13,146 మందికి జీవనోపాధి లభిస్తోంది. ఇక ఈ ఔట్‌లెట్స్ తెరిచి ఉన్నా మూసేసినట్లు.. ఒకవేళ వ్యక్తిగత పనుల కారణంతో మూసివేసినా వాటిని మూతపడిపోయినట్లు పాఠకుల్ని తప్పుదోవ పట్టిస్తోంది.
పెరిగిన సగటు మత్స్య వినియోగం..
ఇక ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో ఆంధ్రఫ్రదేశ్ దేశంలోనే నెం.1 స్థానంలో ఉంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం జాతీయ స్థాయిలో సాలీనా 7.5 కేజీల నుంచి 10 కేజీలుంటే ఏపీలో మాత్రం కేవలం 8.07 కేజీలుగా ఉంది. దీన్ని కనీసం 20 కేజీలకు పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫిష్ ఆంధ్ర ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేసిన అవుట్‌లెట్స్ ద్వారా వారానికి 558 టన్నులకు పైగా విక్రయాలు జరుగుతున్నాయి..
2019–20లో రాష్ట్ర తలసరి చేపల వినియోగం 8.07 కేజీలుండగా, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ కృషి ఫలితంగా 2022–23 నాటికి అది 9.93 కేజీలకు పెరిగింది. అంటే.. జాతీయ సగటు వినియోగం స్థాయికి చేరుకుంది. వీటి ఏర్పాటులో తలెత్తే ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని అధిగమించడం ద్వారా వ్యవస్థను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి అవుట్‌లెట్‌కు ఒక ఉద్యోగిని అనుసంధానించి షాపు యజమానికి వ్యాపార నిర్వహణలో చేయూత అందించి ముందుకు తీసుకెళ్తున్నారు.
సముద్ర మత్స్య ఉత్పత్తులకు క్రేజ్..
నగరాలు, పట్టణాల్లోని చేపల మార్కెట్‌కు వెళ్తే ఎక్కువగా దొరికేవి చెరువు చేపలు, రొయ్యలే. కానీ, ఫిష్ ఆంధ్ర అవుట్‌లెట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. మెత్తళ్ల నుంచి ఖరీదైన పండుగప్పల వరకు.. కాలువ రొయ్యల నుంచి సముద్ర పీతలు, టూనా, కోనాం చేపల వరకు ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి పరిశుభ్రమైన వాతావరణంలో దొరుకుతుండడంతో మాంసప్రియులు క్యూ కడుతున్నారు.
రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలే తప్ప సీఫుడ్ రకాలు చూద్దామన్నా కన్పించేవి కావు. అలాంటిది ఫిష్ ఆంధ్ర అవుట్‌లెట్స్ వచ్చిన తర్వాత అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో రాయలసీమ వాసులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం..
రిటైల్ అవుట్‌లెట్లలో బతికిన, తాజా చేపలు, రొయ్యలతో పాటు రెడీ టు కుక్ పేరిట మసాలాలు అద్దిన (మారినేట్ చేసిన) ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కనీసం వారం రోజులు చెడిపోకుండా ఉండేలా వాక్యూమ్డ్ ప్యాకింగ్‌తో కటింగ్ ఫిష్, ప్రాన్స్‌తో పాటు డ్రై ఫిష్, చేపలు, రొయ్యల పచ్చళ్లను అందుబాటులో తీసుకొస్తున్నారు. అక్కడికక్కడే తయారుచేసిన స్నాక్ ఐటమ్స్‌తో పార్సిల్ కౌంటర్లను ప్రారంభించారు.
అవుట్‌లెట్స్‌తో పాటు స్పోక్స్, ఇతర యూనిట్స్ ద్వారా వారానికి 558 టన్నులు.. ఆదివారం, మంగళవారం రోజుల్లో సగటున 20–30 టన్నుల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటి ఏర్పాటుతో మంగళవారం పూట స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు.. ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్ కోసం డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (డీఎం– సీఆర్‌ఎం)ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలాగే, మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా ఫిష్ ఆంధ్ర వెబ్‌సైట్‌ను తీసుకొచ్చారు. యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాస్తవాలిలా ఉంటే.. ఏదో కావాలని నిరుద్యోగ యువత పొట్టకొట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంతో ఈనాడు కుట్రపూరితంగా విషం కక్కుతూ తప్పుడు కథనం రాసిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment