సాక్షి, మచిలీపట్నం: సముద్ర తీరానికి ఆనుకుని ఉండే మారుమూల పల్లె. 150 ఇళ్లు.. 750 మంది జనాభా గల ఆ గ్రామంలోని గంగపుత్రులు ఒకప్పుడు వేటకు వెళ్తే కాని పూట గడవని పరిస్థితి. వారి జీవితాల్లో ఓ చేప పిల్ల పెనుమార్పు తెచ్చింది.
ఆ పల్లె కథేమిటో తెలుసుకోవాలంటే.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి కూతవేటు దూరంలో ఉన్న గరాలదిబ్బ వెళ్లాల్సిందే. సముద్ర చేపల్లో రారాజుగా.. ఆసియా ‘సీ బాస్’గా పేరొందిన పండుగప్ప చేప పిల్లల పెంపకంలో గరాలదిబ్బ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
ఇలా మొదలైంది..
► సముద్రంలో వేట లేక.. వ్యవసాయం కలసి రాక 20 ఏళ్ల క్రితం ఓ రైతు తన స్నేహితుని సాయంతో తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా సిర్కాలిలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ (ఆర్‌జీసీఏ) నుంచి 20 రోజుల వయసు గల పండుగప్ప సీడ్ తెచ్చాడు.
► వాటిని నెల రోజుల పాటు పెంచి చుట్టుపక్కల చేపల రైతులకు విక్రయించగా.. మంచి లాభాలొచ్చాయి.
► ఆ తర్వాత గ్రామస్తులంతా అదే బాటలో నడిచారు. బయటి ప్రాంతాల్లో 25 నుంచి 30 శాతానికి మించి బతకని ఈ చేప పిల్లలు ఇక్కడి నేల స్వభావం వల్ల 60 నుంచి 70 శాతం బతికి రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లోనూ డిమాండ్
► గ్రామంలో ప్రస్తుతం 200 ఎకరాల్లో పండుగప్ప పిల్లల పెంపకం సాగుతోంది. 100 మందికి పైగా రైతులు దీనిపై ఆధారపడుతున్నారు.
► ఇంకా కళ్లు కూడా తెరవని చేప పిల్లల్ని తీసుకొచ్చి కనీసం 45 రోజులపాటు చెరువుల్లో పెంచుతారు. వీటికి కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.
► ఒక్కో పిల్లను రూ.4 చొప్పున కొంటారు. 4 అంగుళాల సైజు పెరిగిన తర్వాత రూ.25 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తారు. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రూ.35 కూడా ధర పలుకుతుంది.
► ఆ పిల్లల్ని 7 నెలల నుంచి ఏడాది వరకు పెంచితే ఒక్కో చేప ఐదారు కేజీలకు ఎదుగుతుంది. పెరిగిన చేప ధర మార్కెట్‌లో కిలో రూ.350కి పైగా పలుకుతోంది.
75 శాతం సీడ్ ఇక్కడికే..
► ఆర్‌జీసీఏలో ఏటా 35 లక్షల పండుగప్ప సీడ్ ఉత్పత్తి అవుతుంటే.. 75 శాతం అంటే 25 లక్షల సీడ్ గరాలదిబ్బ రైతులే కొనుగోలు చేయడం విశేషం.
గరాలదిబ్బకు అంతర్జాతీయ ఖ్యాతి
పండుగప్ప చేప పిల్లల పెంపకంలో గరాలదిబ్బకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గ్రామం మొత్తం ఇదే సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ బతికినట్టుగా ఈ చేపపిల్ల ఏపీలో మరెక్కడా బతకడం లేదు. ఉప్పు నీటిలోనే కాదు.. మంచినీటిలో కూడా ఈ చేపల సాగు చేయొచ్చు. రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా పండుగప్పసాగు మేలు.
– డాక్టర్ పి.సురేష్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment