gangaputrulu
-
పండు‘గొప్ప’
సాక్షి, మచిలీపట్నం: సముద్ర తీరానికి ఆనుకుని ఉండే మారుమూల పల్లె. 150 ఇళ్లు.. 750 మంది జనాభా గల ఆ గ్రామంలోని గంగపుత్రులు ఒకప్పుడు వేటకు వెళ్తే కాని పూట గడవని పరిస్థితి. వారి జీవితాల్లో ఓ చేప పిల్ల పెనుమార్పు తెచ్చింది. ఆ పల్లె కథేమిటో తెలుసుకోవాలంటే.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి కూతవేటు దూరంలో ఉన్న గరాలదిబ్బ వెళ్లాల్సిందే. సముద్ర చేపల్లో రారాజుగా.. ఆసియా ‘సీ బాస్’గా పేరొందిన పండుగప్ప చేప పిల్లల పెంపకంలో గరాలదిబ్బ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇలా మొదలైంది.. ► సముద్రంలో వేట లేక.. వ్యవసాయం కలసి రాక 20 ఏళ్ల క్రితం ఓ రైతు తన స్నేహితుని సాయంతో తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా సిర్కాలిలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ (ఆర్జీసీఏ) నుంచి 20 రోజుల వయసు గల పండుగప్ప సీడ్ తెచ్చాడు. ► వాటిని నెల రోజుల పాటు పెంచి చుట్టుపక్కల చేపల రైతులకు విక్రయించగా.. మంచి లాభాలొచ్చాయి. ► ఆ తర్వాత గ్రామస్తులంతా అదే బాటలో నడిచారు. బయటి ప్రాంతాల్లో 25 నుంచి 30 శాతానికి మించి బతకని ఈ చేప పిల్లలు ఇక్కడి నేల స్వభావం వల్ల 60 నుంచి 70 శాతం బతికి రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ డిమాండ్ ► గ్రామంలో ప్రస్తుతం 200 ఎకరాల్లో పండుగప్ప పిల్లల పెంపకం సాగుతోంది. 100 మందికి పైగా రైతులు దీనిపై ఆధారపడుతున్నారు. ► ఇంకా కళ్లు కూడా తెరవని చేప పిల్లల్ని తీసుకొచ్చి కనీసం 45 రోజులపాటు చెరువుల్లో పెంచుతారు. వీటికి కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ► ఒక్కో పిల్లను రూ.4 చొప్పున కొంటారు. 4 అంగుళాల సైజు పెరిగిన తర్వాత రూ.25 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తారు. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రూ.35 కూడా ధర పలుకుతుంది. ► ఆ పిల్లల్ని 7 నెలల నుంచి ఏడాది వరకు పెంచితే ఒక్కో చేప ఐదారు కేజీలకు ఎదుగుతుంది. పెరిగిన చేప ధర మార్కెట్లో కిలో రూ.350కి పైగా పలుకుతోంది. 75 శాతం సీడ్ ఇక్కడికే.. ► ఆర్జీసీఏలో ఏటా 35 లక్షల పండుగప్ప సీడ్ ఉత్పత్తి అవుతుంటే.. 75 శాతం అంటే 25 లక్షల సీడ్ గరాలదిబ్బ రైతులే కొనుగోలు చేయడం విశేషం. గరాలదిబ్బకు అంతర్జాతీయ ఖ్యాతి పండుగప్ప చేప పిల్లల పెంపకంలో గరాలదిబ్బకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గ్రామం మొత్తం ఇదే సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ బతికినట్టుగా ఈ చేపపిల్ల ఏపీలో మరెక్కడా బతకడం లేదు. ఉప్పు నీటిలోనే కాదు.. మంచినీటిలో కూడా ఈ చేపల సాగు చేయొచ్చు. రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా పండుగప్పసాగు మేలు. – డాక్టర్ పి.సురేష్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
వేట లేదు...పూట గడవదు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేపలవేటపై నిషేధ వ్యవధిని 45 నుంచి 61 రోజులకు పెంచిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు మత్స్యకారులకు సాయం అందించకుండా కాలయాపన చేస్తోంది. దీంతో గంగపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. చూస్తూండగానే బోట్లకు లంగరేసి 45 రోజులు గడిచిపోయాయి. ‘ఇన్ని రోజులూ అప్పులపై అప్పులు చేసి బతుకుబండి ఈడ్చుకొచ్చాం. మరో 15 రోజులు కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియడంలేదు’ అని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ కోస్తా జిల్లాల్లో ఉన్న మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. వేట నిషేధసమయంలో గతంలో మత్స్యకారులకు కుటుంబానికి 31 కేజీల బియ్యం ఇవ్వగా, ఇప్పుడు దానికి బదులు రూ.4 వేలు సాయం ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంతవరకూ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో 9 జిల్లాల్లో సముద్రంపై ఆధారపడి ఉన్న సుమారు రెండు లక్షల మంది పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే బోటుపై వేటకు వెళ్తే కళాసీ రోజుకు రూ.200, డ్రైవర్ రూ.400 తెచ్చుకునేవారు. నిషేధం అమలుతో వారు ఆ మేరకు ఆదాయం కోల్పోయారు. కూలికి వెళదామన్నా ఏ ఇతర పనీ రాదు. ఎవరూ పనిలో పెట్టుకోని పరిస్థితి. దీంతో ఇంట్లో వస్తువులు తాకట్టుపెట్టి, వడ్డీవ్యాపారులను ఆశ్రయించి పూట గడుపుకోవలసి వస్తోందని వారు వాపోతున్నారు. ముందుగానే తెలిసినా.. సర్కారు అలసత్వం ఏటా నిషేధ సమయం ఏప్రిల్‌లో మొదలవుతుందనే విషయం సర్కార్‌కు తెలియంది కాదు. అలాగే సముద్ర వేటపై ఆధారపడే మత్స్యకార కుటుంబాలు ఎన్ననే విషయం మత్స్యశాఖకూ తెలియంది కాదు. అటువంటప్పుడు ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కూడా ముందుగానే తమకు సాయం ఎందుకు అందించలేరని మత్స్యకారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిషేధ సమయంలో కాకుండా, వేటకు వెళ్లి నాలుగు డబ్బులు తెచ్చుకునే సమయంలో సాయం అందించి ఉపయోగమేమిటని అంటున్నారు. తమిళనాడులో మాదిరి నిషేధ సమయానికి ముందుగానే సాయం అందించాలని చేసిన విజ్ఞప్తులూ బుట్టదాఖలయ్యాయని వారు ఆవేదన చెందుతున్నారు. తలకు మించిన భారంగా పెట్టుబడి ప్రస్తుతం వలల మరమ్మతులు తప్ప వేరే పనిలేని మత్స్యకారులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. 15 రోజుల్లో తిరిగి వేటకు వెళ్లాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టాలి. ఇది తలకు మించిన భారమవుతోందని కాకినాడకు చెందిన మత్స్యకార ప్రతినిధి కామాడి మాతరాజు చెప్పారు. ‘అసలు పొట్ట పోసుకోవడమే గగనమైపోతుంటే వలల మరమ్మతులకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి?’ అని కాకినాడ ఏటిమొగకు చెందిన మత్స్యకారుడు కాటాడి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆహారం, ఇతర ఖర్చులు రూ.30 వేలు, డీజిల్‌కు రూ.40 వేలు, ఐస్‌కు రూ.30 వేలు వెచ్చించాల్సి రావడం మోయలేని భారమవుతోందని మత్స్యకారులు వాపోతున్నారు. మా బాధలేం చెప్పాలి వేట లేకపోతే మాపరిస్థితి నరకమే. మాకు వచ్చేదెంత? రోజుకి రెండు, మూడొందలొస్తాయి. వాటితో కుటుంబాన్ని నెట్టుకొస్తాం. దాంట్లోనే మా ఖర్చులు కూడా. రెండు నెలలు వేట లేక అప్పులు చేసి కడుపు నింపుకున్నాం. గతంలో బియ్యం ఇచ్చేవారు. అవి కూడా సక్రమంగా అందేవి కావు. ఇప్పుడు ఒక్కో మత్స్యకారుడికి రూ.4 వేలు ఇస్తామంటున్నారు. అవి ఎప్పుడొస్తాయో? అసలు వస్తాయో రావో తెలియదు. పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో వేట నిషేధం మొదలవకుండానే ముందుగానే సాయం అందిస్తున్నారు. అలా మాకు కూడా ఇస్తే మా బతుకు మేం బతుకుతాం. - పంతాడి అప్పారావు, మత్స్యకారుడు, కాకినాడ వేట తప్ప వేరే పని రాదు మత్స్యకారులమైన మేం చేపల వేట తప్ప వేరే పని ఏమీ చేయలేం. 45 రోజులు ఉండే వేట నిషేధాన్ని ప్రభుత్వం 61 రోజులకు పెంచింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందక కుటుంబం గడవక అప్పులపాలవుతున్నాం. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని ముందుగానే అందించి ఆదుకోవాలి. - నక్కా పోమయ్య, నాయకర్ కాలనీ, ఉప్పాడ -
జ్వరాలతో విలవిల
బంగారయ్యపేటలో ఇద్దరు మృతి 20 మందికి అస్వస్థత చినదొడ్డిగల్లులో విషజ్వరాలు నక్కపల్లి ఆస్పత్రి రోగులతో కిటకిట భయంతో వణుకుతున్న జనం నక్కపల్లి, న్యూస్‌లైన్: మండలవాసులను జ్వరాలు పీడిస్తున్నాయి. మత్య్సకార గ్రామం బంగారయ్యపేటలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారం రోజుల్లో ఇద్దరు చనిపోవడంతో గంగపుత్రులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన గరికిన సంజన(10) రెండు రోజుల క్రితం జ్వరానికి గరైంది. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన కొవిరి రమణ(40) జ్వర లక్షణాలతో నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయినట్టు అతని సోదరుడు గంగాధర్ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో మరో 20 మంది జ్వరంతో మంచానపడ్డారు. చేపల శివాజీ, కొవిరిపాప, జె. శ్రీను, గరికిన జగ్గ, చేపలగోపిలతోపాటు మరి కొందరు ఇళ్ల వద్దే మగ్గుతున్నారు. కొందరు తునిప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. తీరానికి కూతవేటు దూరంలో ఉన్న బంగారయ్యపేట వాసులకు వైద్యసేవలు నామమాత్రమని సర్పంచ్ మసేనమ్మ తెలిపారు. గ్రామంలో ైవె ద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. చినదొడ్డిగల్లులో విషజ్వరాలు చినదొడ్డిగల్లులోనూ విషజ్వరాల తాకిడి అధికంగా ఉంది. సుమారు 25 మంది ఈ లక్షణాలతో మంచానపడి అల్లాడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో దేవవరపు వాణి, అమలావతి, అజయ్‌కుమార్, ఉమ్మిడి చంటమ్మ,కె. పార్వతి, చొప్పాలోకేష్, తోటవరలక్ష్మిలతోపాటు మరికొందరు తీవ్రమైన జ్వరం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు నక్కపల్లి, తుని ఏరియా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇంటిలో ఒకరికి జ్వరమొస్తే కుటుంబమందరికి సోకుతోందని బాధితులు వాపోతున్నారు. నక్కపల్లి ఆస్పత్రి కిటకిట జ్వరపీడితులు, అతిసారరోగులతో నక్కపల్లి ఆస్పత్రి కిటకిటలాడుతోంది. నక్కపల్లి,ఎస్‌రాయవరం మండలాలకు చెందిన పలువురు జ్వరం, , డయేరియా లక్షణాలతో ఈ ఆస్పత్రిలో చేరుతున్నారు. వార్డులోని బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. ఇక్కడ బెడ్లు ఖాళీలేక కొంతమంది తుని, అడ్డురోడ్డు, నక్కపల్లి,పాయకరావుపేటలలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు