జ్వరాలతో విలవిల
- బంగారయ్యపేటలో ఇద్దరు మృతి
- 20 మందికి అస్వస్థత
- చినదొడ్డిగల్లులో విషజ్వరాలు
- నక్కపల్లి ఆస్పత్రి రోగులతో కిటకిట
- భయంతో వణుకుతున్న జనం
నక్కపల్లి, న్యూస్‌లైన్: మండలవాసులను జ్వరాలు పీడిస్తున్నాయి. మత్య్సకార గ్రామం బంగారయ్యపేటలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారం రోజుల్లో ఇద్దరు చనిపోవడంతో గంగపుత్రులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన గరికిన సంజన(10) రెండు రోజుల క్రితం జ్వరానికి గరైంది.
పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన కొవిరి రమణ(40) జ్వర లక్షణాలతో నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయినట్టు అతని సోదరుడు గంగాధర్ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో మరో 20 మంది జ్వరంతో మంచానపడ్డారు.
చేపల శివాజీ, కొవిరిపాప, జె. శ్రీను, గరికిన జగ్గ, చేపలగోపిలతోపాటు మరి కొందరు ఇళ్ల వద్దే మగ్గుతున్నారు. కొందరు తునిప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. తీరానికి కూతవేటు దూరంలో ఉన్న బంగారయ్యపేట వాసులకు వైద్యసేవలు నామమాత్రమని సర్పంచ్ మసేనమ్మ తెలిపారు. గ్రామంలో ైవె ద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరారు.
చినదొడ్డిగల్లులో విషజ్వరాలు
చినదొడ్డిగల్లులోనూ విషజ్వరాల తాకిడి అధికంగా ఉంది. సుమారు 25 మంది ఈ లక్షణాలతో మంచానపడి అల్లాడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో దేవవరపు వాణి, అమలావతి, అజయ్‌కుమార్, ఉమ్మిడి చంటమ్మ,కె. పార్వతి, చొప్పాలోకేష్, తోటవరలక్ష్మిలతోపాటు మరికొందరు తీవ్రమైన జ్వరం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు నక్కపల్లి, తుని ఏరియా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇంటిలో ఒకరికి జ్వరమొస్తే కుటుంబమందరికి సోకుతోందని బాధితులు వాపోతున్నారు.
నక్కపల్లి ఆస్పత్రి కిటకిట
జ్వరపీడితులు, అతిసారరోగులతో నక్కపల్లి ఆస్పత్రి కిటకిటలాడుతోంది. నక్కపల్లి,ఎస్‌రాయవరం మండలాలకు చెందిన పలువురు జ్వరం, , డయేరియా లక్షణాలతో ఈ ఆస్పత్రిలో చేరుతున్నారు. వార్డులోని బెడ్‌లన్నీ రోగులతో నిండిపోయాయి. ఇక్కడ బెడ్‌లు ఖాళీలేక కొంతమంది తుని, అడ్డురోడ్డు, నక్కపల్లి,పాయకరావుపేటలలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు