ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి | CM YS Jagan Review Meeting On Animal Husbandry And Fisheries Department | Sakshi
Sakshi News home page

పశువులకు కూడా హెల్త్‌కార్డులు: సీఎం జగన్‌

Published Fri, Sep 20 2019 2:25 PM | Last Updated on Sat, Sep 21 2019 7:53 AM

CM YS Jagan Review Meeting On Animal Husbandry And Fisheries Department - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మూడు మేజర్‌ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మచిలీపట్నాన్ని మేజర్‌ పోర్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాలపై సీఎం అధికారులతో చర్చించారు. వీటి నిర్మాణాలను ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గుజరాత్‌లో 25వేల తెలుగు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారంతా ఉపాధి లేక వలస వెళ్లారన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొనడంతో.. ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. పనుల్లో పారదర్శకత ఉండేలా చూసుకోవాలని సూచించారు. 

సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, మత్సశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ....‘ చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్, రైతులకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాపుల ఏర్పాటు జనవరి నాటికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. సీడ్, ఫీడ్‌ల్లో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఎక్కడా కూడా కల్తీ ఉండకూడదు. కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపండి. ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత రంగానికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి, రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. 

ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి..
‘తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు గతంలో అనుమతి ఇచ్చారు. దీనివల్ల కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తుంది. ఇదే ప్రాంతంగుండా నేను పాదయాత్ర చేశాను. ఒక ప్రాంతాన్ని పలానా జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ వేరే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, కలుషితం చేయడం కరెక్టు కాదు. ఈ అంశంపై పూర్తిగా అధ్యయనం చేసి... ఒక విధానాన్ని రూపొందించండి అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చే సరికి రేటు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి..ఇది మనకు పెద్ద సవాలు.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఈ విషయంపై కూడా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి’ అని సూచించారు.

‘రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత మనదే. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడంలేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సహకారం తీసుకోండి. వారి బ్రాండును వినియోగించుకునేలా ప్రణాళికలు తీసుకురండి. మేనేజ్‌మెంట్‌లో ప్రతిభావంతుల సహకారం తీసుకోండి. దీనివల్ల మార్కెటింగ్‌ సదుపాయాలు పెరుగుతాయి. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. జనవరిని రిక్రూట్‌మెంట్‌ నెలగా చేసుకోండి. ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి. వెటర్నరీ ఆస్పత్రులు, క్లినికులల్లో సదుపాయాలను కల్పించాలి. ఇందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను బాగా వినియోగించుకోండి’ అని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పశువులకూ హెల్త్‌ కార్డులు..
సీఎం జగన్‌ మాట్లాడుతూ... పశువులకు కూడా హెల్త్‌ కార్డులు జారీ చేయాల్సిన ఆవశ్యకవత ఉందన్నారు. దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘పశువుల పెంపకంలో సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేయాలి. ఏ కార్యక్రమం చేపట్టినా వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలి. పశువుల మందుల కొనుగోలులో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలి. ఏపీకార్ల్‌కు నేరుగా నీటిని తెప్పించుకునేలా నీటిపారుదల శాఖతో మాట్లాడాలి. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని పేర్కొన్నారు. ఏపీ కార్ల్‌ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలని ఆదేశించారు. అదే విధంగా....పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికోసం బ్రీడింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కరువు పీడిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దాణా కొరత రాకుండా ఉత్తమ విధానాలు అనుసరించాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి పశువుల వైద్యంకోసం 102 వాహనాలు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement