విరివిగా మత్స్యసంపద | Fastest growing fisheries industry in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విరివిగా మత్స్యసంపద

Published Wed, Feb 9 2022 5:23 AM | Last Updated on Wed, Feb 9 2022 5:23 AM

Fastest growing fisheries industry in Andhra Pradesh - Sakshi

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో 974 కి.మీ. తీర ప్రాంతం విస్తరించి ఉండటంతో మత్స్య సంపద విరివిగా ఉత్పత్తి అవుతోంది. వెనామీ రొయ్యలు, పండుగప్ప వంటి ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మత్స్య పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. మత్స్య పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనివ్వడంతో పాటు దానికి మరింత భద్రత కల్పించేలా ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏపీఎస్‌ఏడీఏ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది.

ఆక్వా పరిశ్రమకు గుర్తింపునిచ్చి రైతులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ఈ చట్టం చేసింది. దీని ప్రకారం ఆక్వా సాగు కోసం చెరువులు, ఉత్పత్తికి, విక్రయానికి, ఐస్‌ ఫ్యాక్టరీల ఏర్పాటుకు తప్పనిసరిగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మత్స్యశాఖా ధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. లైసెన్స్‌లు పొందితే.. బినామీలు, నకిలీల బెడద తప్పుతుంది. నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే.. ఇప్పటి వరకు 90 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్‌లు చేసి లైసెన్స్‌లు జారీచేశారు. 

మరింత పెంచేలా..
గతం కంటే బాగా మత్స్యసాగు పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే దీనికి కారణం. వేట నిషేధ భృతి, సబ్సిడీ డీజిల్‌ తీర ప్రాంత మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మత్స్య సంపదను మరింత పెంచేలా అధికారులు, సిబ్బంది  సమన్వయంతో పనిచేస్తున్నారు. 
– లాల్‌ మహమ్మద్, జాయింట్‌ డైరెక్టర్, మత్స్యశాఖ

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. పెద్ద బోట్లు(మెకనైజ్డ్‌)కు నెలకు 3,000, చిన్న బోట్లు(మోటరైజ్డ్‌)కు నెలకు 300 లీటర్ల డీజిల్‌ను సబ్సిడీపై అందిస్తున్నారు. టీడీపీ హయాంలో లీటర్‌కు రూ.6.03 పైసలే సబ్సిడీ ఇచ్చేవారు. ఆ డబ్బులూ సకాలంలో వచ్చేవి కావు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక లీటరుకు రూ.9 సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారుగా రూ.7.12 కోట్లను  సబ్సిడీ రూపంలో ప్రభుత్వం బోటు యజమానులకు అందిస్తోంది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇస్తోంది. ఏటా వేసవిలో 60 రోజుల పాటు సముద్రంపై వేట నిషేధాన్ని అమలు చేస్తారు.

ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే జీవన భృతిగా ఇచ్చారు. ఆ పంపిణీ విధానం కూడా సరిగా లేకపోవడంతో వాటిని దాదాపుగా దళారులే మింగేసేవారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక జీవన భృతిని రూ.10 వేలకు పెంచి.. మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేస్తోంది. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం సాయం చేయడం వల్ల  రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తి పెరిగింది. 2014–15 నాటికి రాష్ట్రంలో 103 లక్షల మెట్రిక్‌ టన్నులుంటే.. 2020–21 నాటికి 150 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మత్స్య సంపదలతో పోలిస్తే.. ప్రస్తుతం 31 శాతం వాటా మన రాష్ట్రానిదే కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని మత్స్యకారులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement