
ఫిష్ ఆంధ్ర మినీ అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తున్న అధికారులు
పెదగంట్యాడ (గాజువాక): వినియోగదారులకు నాణ్యమైన చేపలను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర మినీ అవుట్‌లెట్ల ఏర్పాటుకు రాష్ట్ర మత్స్యశాఖ శ్రీకారం చుట్టింది. నాణ్యమైన చెరువు చేపలు, సముద్రంలో పెరిగే మత్స్య రాశులను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులోని మార్వెల్ స్కూల్ ఎదుట వినాయక చవితి రోజున దీనిని ప్రారంభించారు. మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ బాలాజీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ కె.కన్నబాబు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు లక్ష్మణరావుమతదితరులు అవుట్ లెట్‌ను ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అందుబాటులోకి తేనున్నారు.
అందుబాటులో ఉండే చేపలివే..
సముద్రంలో పెరిగే వంజరం, చందువా, రొయ్యలు, పీతలు, పండుగొప్ప.. చెరువుల్లో పెరిగే శీలావతు, బొచ్చె, రూప్‌చంద్, మోసు, కొర్రమీను, రాగండి, కట్ల తదితర చేపలు. ప్రభుత్వమే ఈ అవుట్ లెట్లకు చేపలను సరఫరా చేస్తోంది.
నిరుద్యోగ యువతకు ఉపాధి
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా మినీ ఫిష్ ఆంధ్ర అవుట్‌లెట్లను తీసుకువచ్చింది. మన చేప–మన ఆరోగ్యం కింద ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో లబ్ధిదారుడు కేవలం రూ.30 వేలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంకులు అందజేస్తాయి. దీంతో అవుట్‌లెట్ పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment