వలేసి పట్టేద్దాం! | AP Govt Support to Fishermans | Sakshi
Sakshi News home page

వలేసి పట్టేద్దాం!

Published Sun, Jul 12 2020 3:03 AM | Last Updated on Sun, Jul 12 2020 5:11 AM

AP Govt Support to Fishermans - Sakshi

మానికొండ గణేశ్, సాక్షి, అమరావతి: పది గ్రాముల పిత్తపరిగి మొదలు 25 కేజీల ట్యూనా చేపలను వేటాడేందుకు, ఉప్పాడ వంటి మారుమూల గ్రామం నుంచి ఉత్తర అమెరికా వరకు సముద్ర మత్స్య సంపద ఎగుమతికి ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడి సముద్ర జలాల సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు చిక్కి బాధలు పడిన మత్స్యకారుల పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీటిని నిర్మించనుంది. హార్బర్ల ద్వారా ఇకపై కోస్తా తీరాన్ని సంపదలకు నెలవుగా, ఉపాధి అవకాశాలు కల్పించే కల్పతరువుగా రూపు మార్చనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం కానున్నాయి.  

► దాదాపు రూ.2,639 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేయనుంది. వీటిలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాలకు నాబార్డు రూ.450 కోట్లను ఫిషరీస్‌ అండ్‌ ఆక్వాకల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద (ఎఫ్‌ఐడిఎఫ్‌) రుణం ఇవ్వనుంది. 
► ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నాబార్డుకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, మచిలీపట్నం, నిజాంపట్నాల్లోని ఫిషింగ్‌ హార్బర్ల రెండో దశ నిర్మాణాలకు, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బరు నిర్మాణాలకు రూ.1,015.219 కోట్లతో అంచనాలు తయారు చేసింది. ఇందులో నిజాంపట్నం హార్బరు నిర్మాణానికి రూ.379.17 కోట్లు, మచిలీపట్నం హార్బరు నిర్మాణానికి రూ.285.609 కోట్లు, ఉప్పాడ నిర్మాణానికి రూ.350.440 కోట్లు అవసరవవుతాయని అంచనా.  
► వీటిల్లో ఒక్కోదానికి ఎఫ్‌ఐడీఎఫ్‌ కింద లభించే రూ.150 కోట్ల రుణం పోను మిగిలిన ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 90% నిధులను ఎన్‌ఐడీఐ (నాబార్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌) రుణం ద్వారా సమకూర్చనుంది. మిగిలిన 10% నిధులను రాష్ట్రం ఖర్చు చేయనుంది.
నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ 

రూ.288.80 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్‌
► నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బరు నిర్మాణానికి రూ.288.80 కోట్లతో అంచనాలు తయారు చేయగా, సాగరమాలలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్‌ఎస్, బీఆర్‌) కింద కేంద్రం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించనున్నాయి. 
► మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.18 కోట్లు విడుదల చేశాయి. ఇటీవల అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి, ఆ జిల్లా శాసన సభ్యులు రేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. 
► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం హార్బరుకు రూ.332.09 కోట్లు, విశాఖ జిల్లా పూడిమడక హార్బరుకు రూ.353.10 కోట్లు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం హార్బరుకు రూ.325.16 కోట్లతో అంచనాలు తయారయ్యాయి.
► ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద ఒక్కో హార్బరుకు రూ.120 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప హార్బరు నిర్మాణానికి అవసరమైన నివేదికను బెంగళూరుకు చెందిన సీఐసీఈఎఫ్‌ (సైసెఫ్‌) ఇవ్వాల్సింది. 
► మొదట్లో దీనిని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటరుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, హార్బరుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.300 కోట్లతో అంచనాలు రూపొందించారు.

హార్బర్ల నిర్మాణాలతో ఎన్నో ప్రయోజనాలు 
►  కొత్తగా నిర్మించనున్న హార్బర్ల వల్ల అదనంగా 11,280 ఫిషింగ్‌ బోట్లకు లంగరు వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా ట్యునా చేపలు శుభ్రం చేయడానికి, నిల్వ చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
► వీటి ద్వారా 76,230 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే ఐస్‌ప్లాంట్లు, ప్రీప్రాసెసింగ్‌ సెంటర్లు, చేపల రవాణా, మార్కెటింగ్‌ ఇతర అనుబంధ సంస్థల్లో పనులు చేయడానికి మత్స్యకారులకు అవకాశం ఏర్పడుతుంది.
► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హార్బర్లలోని పనుల నిర్వహణకు మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా వినియోగ రుసుములను వసూలు చేసి హార్బర్ల నిర్వహణ ప్రభుత్వానికి భారం కాకుండా చూస్తాయి.
► రొయ్యలు, చేపలకు మంచి రేటు వచ్చే వరకు హార్బరులోనే నిర్మించే కోల్డు స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల మత్స్యకారులు, మర పడవల నిర్వాహకులకు లబ్ధి చేకూరడమే కాకుండా విదేశీ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది.
► సాలీనా 4.22 లక్షల టన్నుల చేపలు, రొయ్యల పట్టుబడి అదనంగా జరుగుతుంది.
► తుపానులు, ప్రకృతి వైపరీత్య సమయాల్లో మర పడవలు సురక్షితంగా హార్బర్లలో లంగరు వేసుకునే సౌకర్యం లభిస్తుంది.
► వేట విరామ సమయాల్లో మత్స్య కార్మికులు హార్బరులో నిర్మించే భవనాల్లో వలలు, ఇతర పరికరాల మరమ్మతులు చేసుకునే సౌకర్యం ఏర్పడుతుంది.

మొగ వద్ద ఇసుక మేటలతో ఇక్కట్లు
మొగ (సముద్ర ముఖ ద్వారం) దగ్గర ఇసుక మేటలు వేస్తోంది. సముద్ర అలల వేగం వల్ల మా ఊళ్లో అనేక బోట్లు దెబ్బ తిన్నాయి. వాటిని బాగు చేయించుకోవాలంటే ఓనర్లు లక్షలు పోయాల్సిందే. ఇక్కడి హార్బర్‌ నుంచి మొగ దగ్గరకు వెళ్లే కాల్వ లోతు పెంచక పోవడం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇందువల్లే చేపల వేట కోసం ఇతర  రాష్ట్రాలకు పోతున్నాం. ఇన్నాళ్లూ మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ మా సమస్యపై దృష్టి పెట్టారు. మొగ వద్ద ఇసుక మేటలు తొలగించాకే మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
 – మల్లికార్జునరావు, గిలకలదిండి, కృష్ణా జిల్లా

బోట్లు పెరుగుతుంటే లంగరుకు చోటేదీ?
హార్బరులో బోట్లు పెరుగుతున్నాయి. మంచి సీజనులో గిలకలదిండి, నరసాపురం నుంచి బోట్లు వస్తాయి. అప్పుడు ఒడ్డుకు ఎవరు ముందు వస్తే వాళ్లు జట్టీలకు బోట్లు కట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా తీరానికి దగ్గరలోని చెట్లకు తాళ్లతో కట్టుకుంటున్నారు. భారీ వర్షాలు, గాలులు వచ్చినప్పుడు చెట్లకు కట్టిన తాళ్లు తెగి బోట్లు గల్లంతవుతుంటాయి. అలలకు  కొట్టుకుపోతాయి. కొన్నిసార్లు వలలు, ఇంజన్లను దొంగలెత్తుకెళ్తారు. వాటిని కొనుక్కుని వేటకు వెళ్లాలంటే నెల పడుతుంది. ఈ సమస్యలన్నీ తీరాలంటే జట్టీల సంఖ్య పెంచాలి.  
– ఆర్‌.రాము, నిజాంపట్నం, గుంటూరు జిల్లా

విస్తారమైన అవకాశాలు  
హార్బర్ల ద్వారా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విస్తారమైన అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద బోట్ల  ద్వారా సముద్రలోతుల్లో మత్స్య సంపదను పట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాలు లేక రాష్ట్రంలోని పెద్ద పడవల నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వానికి సముద్ర సంపద ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. పోషక విలువలు కలిగిన సముద్ర జాతి వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోడానికి ప్రణాళికలు రూపొందిస్తాం.
– కన్నబాబు, ఫిషరీస్‌ కమిషనర్‌ 

ఫిషింగ్‌ హార్బర్లు
► పెద్ద పెద్ద పడవలు మత్స్య సంపదను సముద్ర ఒడ్డుకు తేవడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. సముద్రపు ఒడ్డున లోతు ఎక్కువగా ఉండేలా వీటిని నిర్మించడం వల్ల మత్స్యకారులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎగుమతులకు వీలుంటుంది.
► జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్త పట్నం, బియ్యపుతిప్పలో ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నారు.

ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు
► వేటాడి తెచ్చిన చేపలను అన్‌లోడ్‌ చేయడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. విక్రయాలకూ అవకాశం ఉంటుంది. 
► మంచినీళ్లపేట, బీమిలీ, నక్కపల్లి, చింత పల్లిలో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీళ్లపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.11.95 కోట్లు కేటాయించింది. పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేసింది.

మాకు కష్టాలు తప్పుతాయి..
మా జువ్వలదిన్నెలో చేపలరేవు కడతామని చంద్రబాబు అనేకసార్లు చెప్పాడు. మాట నిలుపుకోలేదు. సీఎం జగన్‌ మా జిల్లాకు వచ్చినప్పుడు మా రేవు నిర్మాణం గురించి హామీ ఇచ్చారు. మొన్నీమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మా ఊరొచ్చి రేవు కట్టడానికి అనువైన ప్రాంతాన్ని చూశారు. వెంటనే రేవు కడతారంట. నిధులు కూడా వచ్చేశాయని మా ఓనర్లు చెబుతున్నారు. ఇక్కడ రేవు కడితే మద్రాసు, గుజరాత్‌ వెళ్లక్కర్లేదు. బాధలు తప్పుతాయి. ఇక్కడి నుంచే చేపల వేటకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది.    
– కొమరిరాజు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement