జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో పూర్తయిన బ్రేక్ వాటర్ నిర్మాణం
అదంతా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం.. అపార మత్స్య సంపదకు నిలయం.. కానీ వేటకు అనువుగా లేని వైనం.. ఈ లోపాన్ని సరిదిద్దితే గంగపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగు నింపడం ఖాయం.. ఉపాధి వలసలకు చెక్ పెట్టడం తథ్యం.. గత పాలకులు ఈ విషయాన్ని నిర్లక్ష్యంతో విస్మరిస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాధ్యతగా, ప్రతిష్టగా తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒకటి. ఇది పూర్తయితే మత్స్యకారుల పాలిట ఇది వెలుగులదిన్నెగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో ‘సాక్షి’ అటు వైపు తొంగి చూసింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సముద్ర తీరాన విలువైన మత్స్య సంపద ఉన్నప్పటికీ, అది గంగపుత్రుల దరి చేరడం లేదని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ సంపదను వారి దరికి చేర్చే దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వివిధ పథకాల ద్వారా వారిని ఓ వైపు ఆదుకుంటూనే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగింటిని నిర్మిస్తున్నారు.
ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే నిర్దేశిత గడువుకంటే ముందే ఇది అందుబాటులోకి వచ్చేలా ఉంది. గత ఏడాది మార్చి 19వ తేదీన దీని నిర్మాణం ప్రారంభమైంది. రెండేళ్లలో అంటే 2023 మార్చికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. పెద్ద పడవలు సముద్రంలో నుంచి హార్బర్‌కు వచ్చేందుకు ఉపయోగపడే కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
బ్రేక్ వాటర్ ప్రాంతం పూడిపోకుండా నిర్మించే బ్రేక్ వాటర్ వాల్స్‌ను సుమారు 3 లక్షల టన్నుల రాతితో పటిష్టం చేశారు. ఈ గోడలను సిమెంట్‌తో నిర్మించిన ట్రైపాడ్స్‌తో నింపుతున్నారు. అలల ఉధృతిని తట్టుకోవడానికి నిర్మించే 7 వేల ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉన్న సిమెంట్ దిమ్మెలు)లో 5 వేల ట్రైపాడ్స్ నిర్మాణం పూర్తయ్యింది. పెద్ద బోట్లు రావడానికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 7 లక్షల క్యూబిక్ మీటర్లను వెలికి తీశారు.
1,250 బోట్లు నిలిపే 919 మీటర్ల జెట్టీ పునాదుల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ నాటికి జెట్టీ కాంక్రీట్ పనులు పూర్తి చేసి, బోట్లను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు మార్చిలోగా పూర్తి చేయనున్నారు.
ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద
72 ఎకరాల్లో రూ.260 కోట్లతో నిర్మిస్తున్న ఈ హార్బర్ ద్వారా ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇంతకాలం పెద్ద బోట్లు నిలిచే అవకాశం లేక 25 నాటికల్ మైళ్ల దూరం దాటి, వేట చేపట్టలేకపోయేవాళ్లమని.. ఈ హార్బర్ వస్తే ప్రభుత్వ సహకారంతో పెద్ద మెకనైజ్డ్ బోట్లు కొనవచ్చని స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటిదాకా నష్టం ఇలా..
హార్బర్లు, ఇతర సౌకర్యాలు లేనందున రాష్ట్ర మత్స్యకారులు సాధారణ బోట్లతో తీరంలో కొద్ది దూరంలోనే వేట సాగిస్తున్నారు. దీంతో అనుకున్న రీతిలో మత్స్య సంపద లభించడం లేదు. దీంతో పలువురు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లు రాష్ట్ర తీరంలోని మత్స్య సంపదను తరలించుకుపోతున్నాయి.
60 వేల కుటుంబాలకు ఉపాధి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా రూ.3,622.36 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలిదశ కింద రూ.1,204.56 కోట్లతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, బాపట్ల జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, కాకినాడ జిల్లా ఉప్పాడ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి.
రెండో దశ కింద రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. తొలి దశలోని నాలుగు హార్బర్లను వచ్చే మార్చి నాటికి, రెండో దశలోని ఐదింటిని 2024లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొమ్మిదీ అందుబాటులోకి వస్తే 10,000కు పైగా మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మన సంపద మనకే
ఇంతకాలం సౌకర్యాలు లేకపోవడంతో పెళ్లాం బిడ్డలను ఇక్కడే వదిలేసి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసపోయే వాళ్లం. తమిళనాడుకు చెందిన కడలూరు, నాగపట్నం, తూతుకూడిల మత్స్యకారులు వచ్చి మన తీరంలో చేపలు పట్టుకుపోతున్నారు. జువ్వల దిన్నె హార్బర్ వస్తే తమిళనాడు మత్స్యకారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. మన తీరంలో మత్స్య సంపదను మనమే పొందొచ్చు.
– శీనయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె
ఇక్కడే ఉపాధి..
చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ çహార్బర్ వస్తే నాకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లతో పాటు వాటికి అవసరమైన మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేస్తుండటం చాలా సంతోషం.
– కుందూరు గోవిందయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె
సెప్టెంబర్ నాటికి జెట్టీ నిర్మాణం పూర్తి
రూ.260 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే బ్రేక్‌వాటర్, డ్రెడ్జింగ్, ట్రైపాడ్స్ నిర్మాణం, జెట్టీ పిల్లర్స్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్, శీతల గిడ్డంగి, వేలం కేంద్రం వంటి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. ఈ సెప్టెంబర్ నాటికి జెట్టీని అందుబాటులోకి తెస్తాం.
– కృష్ణమూర్తి, పీఎంయూ, ఏపీ అర్బన్
దేశ చరిత్రలో ఇదే ప్రథమం
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,623 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఉపాధి పొందేలా చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. దీనికి అనుగుణంగా హార్బర్ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నాం.
– మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు
Comments
Please login to add a commentAdd a comment