సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కచిడి’.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో, ఖరీదైన వైన్‌ను శుభ్రం చేయ డంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది.
అదృష్టవంతులకే ‘గోల్డ్ ఫిష్’
తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి, అద్దరిపేట నుంచి సఖినేటిపల్లి, పల్లిపాలెం, పశ్చిమగోదావరి జిల్లాలోని పేరుపాలెం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులలో అదృష్టవంతుల వలకే కచిడి చేప చిక్కుతుందంటుంటారు. ఈ కచిడి చేపను బ్లాక్ స్పాటెడ్ (క్రోకర్) లేదా సీగోల్డ్, గోల్ ఫిష్‌గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం.. ప్రోటోనిబియా డియాకాన్తస్. ఇండో ఫసిఫిక్, బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే కచిడీ జీవిస్తోంది. ఈ రకం చేపలకు ప్రకృతి ప్రసాదించిన వాయుకోççశం (ఎయిర్ బ్లాడర్) ఉండటంతో సముద్రాలను ఈదడంలో ఇవి మహా నేర్పరులు.
కచిడీ కోసం ఎగుమతిదారుల క్యూ..
ఈ చేపలను కాకినాడ, ఓడలరేవు, ఉప్పాడ, పల్లిపాలెం తదితర ప్రాంతాల్లో స్థానిక మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఈ చేపలకున్న డిమాండ్ దృష్ట్యా వీటి కొనుగోలుకు అటు ఉత్తరాంధ్ర.. ఇటు నెల్లూరు జిల్లా నుంచి ఎగుమతిదారులు స్థానిక మార్కెట్ల్లకు క్యూ కడుతున్నారు. ఈ చేప 40 కిలోల వరకు బరువు ఉంటోంది. 10 కిలోలు దాటితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. బాగా తక్కువలో తక్కువగా అంటే రూ.50 వేలు ఉంటుంది. 25 కిలోల మగ చేప రూ.4 లక్షలకు అమ్ముడుపోయిందంటే వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
శస్త్రచికిత్సల్లోనూ..
కచిడీ చేపలో కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి రుచి, వాసన ఉండదు కానీ ఘనపదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది. దీనిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే శ్రేష్టమైన జెలాటిన్‌ను ఆహార ఉత్పత్తులు, మందుల తయారీ, కాస్మెటిక్స్, విలువైన పదార్థాల ప్యాకింగ్‌లో వినియోగిస్తున్నారు. అలాగే కాప్యూల్స్ (మందు గొట్టాలు) పైన ఉపయోగించే ప్లాస్టిక్‌లాంటి పదార్థంలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. విదేశాల్లో పొట్ట భాగంలో శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు వినియోగించే దారం తయారీ, ఖరీదైన వైన్‌ను శుభ్రం చేసేందుకు కూడా వినియోగిస్తున్నారు. మగచేప కండ, శరీర భాగాలు, పొట్ట భాగం, పొలుసుకు కూడా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.
చెన్నై, కోల్‌కతాల నుంచి విదేశాలకు ఎగుమతి
కచిడీ చేపలను మన రాష్ట్రం నుంచి చెన్నై, కోల్‌కతా రేవులకు తరలించి.. అక్కడ ప్రాసెసింగ్ చేసి యూరప్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, జపాన్, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఈ చేపల విక్రయాలకు ముందే (ఆడ, మగ) గ్రేడింగ్ చేస్తారు. మగ చేప పొట్ట భాగాలను ఎగుమతికి అనుగుణంగా ప్యాకింగ్ చేస్తారు. మగ చేప చిన్న రెక్కలతో గరుకుగా, బంగారు రంగులో ఉండటంతో వాటిని విదేశాలకు పంపుతారు. పొట్ట భాగం ఆడ చేప కంటే మగ చేపకు గట్టిగా ఉంటుంది. ఈ లక్షణాలున్న చేపలను ఎగుమతి కోసం వేరు చేస్తారు.
ఔషధ గుణాలతోనే డిమాండ్
కచిడీ చేపకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో యూరప్ తదితర దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ చేప సముద్రపు లోతుల్లో ఎక్కువగా ఉంటుంది. కచిడీలో సహజంగా ఉండే కొలాజిన్‌తోపాటు పొట్ట, వాయుకోశాలను పలు ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. మగ చేపల్లో వాయుకోశం పెద్దవిగా ఉండటంతో కచిడీ చేపలకు డిమాండ్ ఎక్కువ.
– చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కోనసీమ
పులసలను మించి..
గోదావరి జిల్లాల్లో వరదలప్పుడు సీజనల్‌గా వచ్చే పులస చేపలను ఈ కచిడి చేప అధిగమిం చేస్తోంది. అద్భుతమైన రుచిని ఇచ్చే కచిడి చేపను ధనవంతులు కూడా కొనలేరంటే అతిశయోక్తి కాదు. ఇక మగ చేప ఖరీదు వింటే గుండె గుభేల్‌మనడం ఖాయం. మగ చేపలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అటువంటివి మరి. అందుకే విదేశాల్లో ఈ చేపకు విపరీతమైన డిమాండ్. ఎన్ని లక్షలైనా లెక్క చేయకుండా మగ చేపను కొనుక్కుపోతున్నారు. మగ, ఆడ చేపల మధ్య ధరల్లో, డిమాండ్‌లో చాలా వ్యత్యాసం ఉంది. సముద్రపు లోతులే కచిడి చేపల ఆవాసం.
Comments
Please login to add a commentAdd a comment