కన్నూరులో కన్నాలెన్నో! | Corruption Department Of Fisheries In Warangal | Sakshi
Sakshi News home page

కన్నూరులో కన్నాలెన్నో!

Published Wed, Jun 19 2019 11:36 AM | Last Updated on Wed, Jun 19 2019 11:36 AM

Corruption Department Of Fisheries In Warangal - Sakshi

హన్మకొండ చౌరస్తా: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అక్రమార్కులకు వరంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్‌ చేసుకునేందుకు రాయితీపై వాహనాలను సైతం అందిస్తోంది. అర్హులైన మత్స్యకారులకు మోపెడ్, లగేజీ ఆటోలు, బొలెరో వాహనాలను అందించేందుకు గత ఏడాది వరంగల్‌ జిల్లాకు రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఈక్రమంలో నిబంధనలకు నీళ్లొదిలిన మత్స్యశాఖ అధికారులు ఉమ్మడి వరంగల్‌ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని ఓ పెద్ద మనిషితో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
మత్స్యశాఖలోని అవినీతి చేపలను ఏరివేయాలని కోరుతూ గత సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం కన్నూర్‌ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ సభ్యులు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందన రాకపోవడంతో నేరుగా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను కలిసి అవినీతి జరిగిన తీరును తెలియజేసినట్లు సభ్యులు చెబుతున్నారు. దీనికి తోడు భవిష్యత్‌లో అవినీతి జరగకుండా ఉండేందుకు సొసైటీ సభ్యులు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసేందుకు వెళ్లారు. అంతకుముందు హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు.

ఫోర్జరీ సంతకాలతో తీర్మాణం?
8లక్షల రూపాయలకు పైబడిన వాహనాన్ని మంజూరి చేయాలంటే సొసైటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాణం చేయాల్సి ఉంటుందని, అయితే తమ సొసైటీ సభ్యుడు నూనె శంకర్‌ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశాడని కలెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాల తీర్మాణం తో సదరు వ్యక్తి కి వాహనాన్ని మంజూరి చేసిన మత్స్యశాఖ అధికారులు, అందుకు సహకరించిన మత్స్య సహాకార సంఘం పెద్ద మనిషి పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. సొసైటీలోని సభ్యులందరికీ ఉపయోగపడాల్సిన వాహనం ఒక్క సభ్యుడికి ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు.

దాదాపు రూ.23 కోట్ల నిధులు
వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా 91 పురుష మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 10,24 మంది మత్స్యకారులు సభ్యులుగా కొనసాగుతున్నారు. 23 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 1,414 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది మత్స్య సమీకృత అభివృద్ధి పథకం ద్వారా చేపల విక్రయాలు, చేపల పట్టేందుకు ఉపయోగపడే పరికరాలను రాయితీపై అందించేందుకు ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సొసైటీ సభ్యుడై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న వారికి 75శాతం రాయితీపై వాహనాలను అందించారు.

విచారణ చేపడితే మరిన్ని వెలుగులోకి?
డ్రైవింగ్‌ లైసెన్సు ఉండి సొసైటీ సభ్యుడైతే చాలు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి టీవీఎస్‌ ఎక్సెల్‌(మోపెడ్‌) అందజేశారు. లగేజీ ఆటోల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సొసైటీ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందించారు. ఇక భారీ వాహనాలను సైతం ఇదే పద్ధతిలో అందించామని అధికారులు చెబుతుండగా సొసైటీలు మాత్రం ఏకగ్రీవ తీర్మానం ఆధారంగానే మంజూరు చేశారని చెబుతున్నారు. అయితే, మత్స్యశాఖ అధికారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పెద్దలు కుమ్మక్కై వాహనాల మంజూరులో సిండికేట్‌గా ఏర్పడి అవినీతికి తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే నిజాలు వెలుగు చూస్తామని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు.

రూ.500 నుంచి రూ.లక్ష వరకు వసూలు
టీవీఎస్‌ ఎక్సెల్‌ కోసం వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి 1,987 మంది దరఖాస్తు చేసుకోగా 1673 మందికి, లగేజీ ఆటోల కోసం 656 మంది దరఖాస్తు చేసుకోగా 126 మందికి అందజేసినట్లు తెలుస్తోంది. అలాగే, హైజెనిక్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాల కోసం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది దరకాస్తులు రాగా.. నలుగురు వాహనాలను అందుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మోపెడ్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు, లగేజీ ఆటోలకు రూ.5వేల నుంచి రూ.10వేల రూపాయల వరకు వసూలు చేయగా బొలోరా వాహనాలకు రూ.లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఫోర్జరీకి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి
మా ఊరి సొసైటీ సభ్యులకు తెలియకుండా దొంగతనంగా తీర్మాణంలో మా సంతకాలను ఫోర్జరీ చేసి నూనె శంకర్‌ బొలోరో వాహ నం తీసుకున్నాడు. దీనికి సహకరించిన మత్స్యశాఖ అధికారులు, మత్స్య పారిశ్రామిక సహాకార సంఘం పెద్దలపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సార్‌ను కలిస్తే విచారణ జరిపి వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. –నూనె సంపత్, కన్నూర్, కమలాపూర్‌

ఉద్యోగులకు సభ్యత్వాలు ఇచ్చారు..
మా ఊరి సొసైటీలో ప్రస్తుతం 153 మంది సభ్యులు ఉన్నారు. పాత సభ్యులు 80 మంది కాగా గత ఏడాది కొత్త సభ్యత్వాలను ఇచ్చారు. ఇందులో 18 ఏళ్లు నిండని వ్యక్తులు, ప్రభుత్వం ఉద్యోగులకు సైతం స్థానం కల్పించారు. ఇదేమిటని అడిగితే అధికారులు, సొసైటీ పెద్ద మనుషుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. అనర్హులకు వాహనాలను మంజూరు చేసేందుకే అర్హత లేని వారికి సభ్యత్వాలు ఇచ్చారు. కల్పించారు. సభ్యత్వాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. – కిన్నెర మొగిలి, కన్నూర్, కమలాపూర్‌ 

ఎఫ్‌డీఓ భాస్కర్‌కు నోటీసులు ఇచ్చాం
కమలాపూర్‌ మండలం కన్నూర్‌కుచెందిన అంశంపై ఎఫ్‌డీఓ భాస్కర్‌కు నోటీసులు జారీ చేశాం. ఆ గ్రామ సొసైటీ తీర్మానం చేసిన కాపీని భాస్కర్‌ నాకు అందించారు. తీర్మానం కాపీలో సొసైటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేశారన్న విషయం నాకు తెలియదు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎఫ్‌డీఓను నివేదిక కోరాను. ఆ నివేదిక ఆధారంగానే నూనె శంకర్‌కు బొలోరో వాహనాన్ని మంజూరు చేశాం. అయితే లబ్ధిదారుల ఎంపికలో సొసైటీల తీర్మాణం తప్పనిసరి అనే అంశం ప్రభుత్వం మాకు సూచించిన నిబంధనలలో ఎక్కడా పొందుపర్చలేదు. ఈ విషయం తెలియక కన్నూర్‌ సొసైటీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. – డి.సతీష్, అసిస్టెంట్‌ డైరక్టర్,మత్స్యశాఖ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement