బియ్యం తరుగు.. | Corruption In Ration Rice Distribution Warangal | Sakshi
Sakshi News home page

బియ్యం తరుగు..

Published Mon, Oct 8 2018 11:51 AM | Last Updated on Mon, Oct 15 2018 1:26 PM

Corruption In Ration Rice Distribution Warangal - Sakshi

తొర్రూరులోని ఓ రేషన్‌ దుకాణంలో 50 కిలోల బియ్యం బస్తాను తూకం వేయగా 48కిలోలే చూపుతున్న వేయింగ్‌ యంత్రం

తొర్రూరు రూరల్‌(పాలకుర్తి): పేదలకు సరఫరా చేస్తు న్న బియ్యం తరుగు రేషన్‌ కార్డుదారులకు శాపంగా మారింది. ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా కార్డుదారులకు ప్రతినెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తోందిది. మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచి పంపిణీ బియ్యం బస్తాల్లో తక్కువ బరువు ఉంటోంది. క్వింటాల్‌పై దాదాపు ఐదారు కిలోల తరుగును భరించాల్సి వస్తోంది. ఈ ప్రభావం పరోక్షంగా రేషన్‌ కార్డుదారులపై పడుతోంది.

జిల్లాలోని 553 రేషన్‌ దుకాణాల ద్వారా మొత్తం 44,726 క్వింటాళ్ల బియ్యాన్ని నెలనెలా పంపిణీ చేస్తున్నారు. 50 కిలోల బస్తాపై రెండు నుంచి మూడు కిలోల తరుగు ఉంటోందని రేషన్‌ డీలర్లు వాపోతున్నారు. జిల్లా మొత్తం రేషన్‌కార్డులకు సరఫరా చేసే బియ్యం కోటాపై 17.89క్వింటాళ్ల వరకు తరుగు ఉన్నట్లు తెలుస్తోంది.
కార్డుదారులకు నష్టం...
మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచే సరఫరా చేసే బియ్యం సంచుల్లో క్వింటాల్‌పై ఐదు కిలోల వరకు తరుగు ఉంటోందని డీలర్లు వాపోతున్నారు. కార్డుదారులకు అందించే బియ్యంలోనూ తరుగు తీస్తున్నారు. జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిల్వ కేంద్రం నుంచి సరఫరా అయ్యే బియ్యంలో వచ్చే తరుగు ఎలా భరిస్తామంటూ కొందరు డీలర్లు బాహటంగానే గోడు వెల్లబోసుకుంటున్నారు.

గోనె సంచితోనే తూకం...
రేషన్‌ దుకాణాల ద్వారా తెలుపు రంగు కార్డుదారులకు సరఫరా చేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసరాల వస్తువుల పంపిణీలో తూకాల్లో మోసం జరుగుతోంది. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల్లో అవకతవకలకు తావు లేకుండా ఎలక్ట్రానిక్‌ కాంటా లను ఏర్పాటు చేసింది. తూకంలో హెచ్చుతగ్గులు లేకుండావీటిని వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచే తరుగుతో వస్తున్న బియ్యాన్ని పంపిణీ చేయడంలో భాగంగా చాలామంది డీలర్లు ఎలక్ట్రానిక్‌ తూకపు యంత్రాలపై గోనె సంచితో సహా బియ్యం తూకం వేస్తున్నారు. ఒక్కో కార్డుపై 30 కిలోల దాకా బియ్యం ఇస్తారు. అంటే కార్డుదారు దాదాపు కిలో వరకు కోల్పోవాల్సి వస్తోంది. కార్డుదారులు అందరికీ ఇలాగే తూకం వేసి పంపిణీ చేస్తే తరుగు కింద 17.89 క్వింటాళ్ల  బియ్యం కోల్పోతున్నారు.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తూకం ఏది?
రేషన్‌ డిపోల్లో సరుకుల తూకంలో డీలర్లు చేతివాటం ప్రదర్శించకుండా ఈ–పాస్‌ విధానం ప్రభుత్వం తీసుకువచ్చింది. డిపోల్లో బియ్యం తూకాన్ని పౌర సరఫరాల శాఖ సెంట్రల్‌ సర్వర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. దీంతో తూకం ఏ మాత్రం తక్కువ వేయడానికి అవకాశం లేదు. ఇదే విధానం డిపోలకు సరుకులిచ్చే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఉండటం లేదన్నది డీలర్ల ఆవేదన. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద కాంటా యంత్రాలతో తూకం కాలయాపనతో కూడుకున్నదని భావిస్తున్నారు.

ప్రతి కేంద్రానికి బియ్యం లోడైన వాహనంతో బరువును తూకం వేసే వేబ్రిడ్జి కాటాలను ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ యోచించింది. దానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు మోక్షం లేదు. సాధారణంగా బియ్యం ఎఫ్‌సీఐ గోదాంలలో బియ్యం ఐదారు నెలలు నిల్వ ఉంటుంది. ఈ కారణంగా అవి ఆరిపోయి కొంత తరుగు ఉండే అవకాశం ఉన్నా అది 50 కిలోల బస్తాకు 300 గ్రాములకు మించి ఉండదని అంటున్నారు. కానీ ప్రతి బస్తాకు రెండు కిలోల వరకు సగటున తరుగు ఉండటంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

పంపిణీపై పకడ్బందీగా చర్యలు
మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచే బియ్యం సంచుల్లో తరుగు వస్తున్నట్లు గమనిస్తే డీలర్లు మా దృష్టికి తీసుకురావాలి. అంతేకాకుండా నిత్యావసర సరుకులు తీసుకుని రేషన్‌ దుకాణం వద్ద బియ్యం తూకంలో తేడా వస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. మా దృష్టికి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి తరుగు లేకుండా బియ్యం పంపిణీ అయ్యేలా చూస్తాం. – జి.నర్సింగరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement