‘ఆక్వా’కు మంచిరోజులు
డబుల్ డిజిట్‌లో భాగంగా చెరువులు వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు
రైతులను మరింత ప్రోత్సహించాలని మత్స్యశాఖ నిర్ణయం
దాదాపు వెయ్యి హెక్టార్లలో పునరుద్ధరణకు కసరత్తు
ఒంగోలు టౌన్ : ఆక్వాకు ఊపిరిపోయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. గతంలో డాలర్ల వర్షం కురిపించిన పంటకు తిరిగి అదే వైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. డబుల్ డిజిట్‌లో భాగంగా గతంలో తవ్వి వదిలేసిన దాదాపు వెయ్యి హెక్టార్లలోని చెరువులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆక్వా రైతులను ఒక వేదికపైకి తీసుకువచ్చి సాగులో మెళకువలు అందించడంతోపాటు నాణ్యమైన దిగుబడి పొందే విధంగా సలహాలు, సూచనలు అందించి మరింత ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లోని చెరువులతోపాటు మంచినీటి చెరువుల్లో ఆక్వాను సాగుచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
1990 దశకంలో ఆక్వా రంగం నీలి విప్లవంలా వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య పంటలను సాగు చేసేవారికంటే ఆక్వా చెరువులు ఉన్నవారు స్వల్ప కాలంలోనే ఆర్థికంగా బలపడ్డారు. ఆ సమయంలో ఎన్ని ఎకరాల మాగాణి భూమి ఉన్నాగానీ రెండుమూడు ఆక్వా చెరువులు ఉంటే చాలన్నట్లుగా ఆ సాగు ఫరిడవిల్లింది. ఒకరిని చూసి మరొకరు, ఒక గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం..ఇలా అంతా ఆక్వా చెరువుల మయమైంది. ఇబ్బడి ముబ్బడిగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తీరప్రాంత మండలాల్లో మెజార్టీ భాగం ఆక్వా చెరువులు ఉన్నాయి.
చివరకు మంచినీటి వనరులున్నచోట కూడా ఒక్కసారిగా ఆక్వా చెరువులు వెలిశాయి. విదేశాల నుంచి అనూహ్యంగా ఆర్డర్లు రావడంతో ఇక్కడి రైతులకు డాలర్ల వర్షం కురిసింది. ఒకవైపు పెద్దమొత్తంలో ఆదాయం పొందుతున్నప్పటికీ, ఇంకోవైపు ఆక్వా చెరువులకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులు పెద్దగా దృష్టి సారించలేదు. విచ్చలవిడిగా చెరువులు తవ్వడం, ఉత్పత్తి అధికంగా రావాలన్న ఉద్దేశంతో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో ఒక్కసారిగా ఆక్వా రంగం కుదేలైంది.
వైట్‘స్పాట్’...
భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతవుతున్న రొయ్యల్లో వైట్‘స్పాట్’ ఉండటంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. వైట్‌స్పాట్ ఉన్న రొయ్యల్లో అధిక శాతం ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నవి కావడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో కొన్ని దేశాలు భారతదేశం నుంచి రొయ్యలు ఎగుమతి చేసుకునేందుకు పూర్తిగా నిరాకరించాయి. దాంతో ఆక్వా రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనేక మంది రైతులు ఆక్వా చెరువులను ఎక్కడికక్కడే వదిలేశారు.
అనేక ప్రాంతాల్లో చెరువులు కొన్నేళ్లపాటు ఖాళీగా ఉన్నాయి. పరిమిత సంఖ్యలో ఆక్వా చెరువులు సాగుచేస్తూ రావడం, అదే సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో క్రమంగా ఆక్వా రంగం కోలుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో డబుల్ డిజిట్ సాధించాలన్న ఉద్దేశంతో లక్ష్యాలు కేటాయించింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను విస్తృతంగా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో ఆక్వాకు పూర్వ వైభవం రానుంది.
నేడు ఆక్వా రైతులకు అవగాహన సదస్సు
జిల్లాలోని ఆక్వా రైతులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుడు పి.శ్రీహరి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ సదస్సులో కలెక్టర్ సుజాతశర్మ, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ పాల్గొంటారన్నారు. డబుల్ డిజిట్ సాధనలో భాగంగా జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత విస్తరింపజేసేందుకు వీలుగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత పరిధిలో, మంచినీటి చెరువుల పరిధిలో ఆక్వా సాగు చేస్తున్నవారు, గతంలో సాగుచేసి వదిలేసిన రైతులంతా హాజరుకావాలని ఆయన కోరారు.