
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుంటే.. పలు కంపెనీలు కలుషిత జలాలు చెరువులోకి వదిలి చేపల మృతికి కారణమవుతున్నాయని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అలాంటి కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని శుక్రవారం హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గండిచెరువు లోకి కలుషిత నీటిని వదిలిన కంపెనీలను గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ జిల్లా అధికారులను ఆదేశించారు. 287 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గండిచెరువులో పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు కలవడం వలనే రూ.1.50 కోట్ల విలువైన చేపలు మృతిచెందాయని పేర్కొన్నారు.