మీనమే వస్తుంది... మన ఇంటికి.. | New trend in the marketing of seafood products | Sakshi
Sakshi News home page

మీనమే వస్తుంది... మన ఇంటికి..

Published Mon, Jul 19 2021 3:32 AM | Last Updated on Mon, Jul 19 2021 3:32 AM

New trend in the marketing of seafood products - Sakshi

సాక్షి, అమరావతి: పోషక విలువలున్న మత్స్యసంపద వినియోగాన్ని రాష్ట్రంలో పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. మత్స్యసంపద ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఆ ఉత్పత్తుల్ని వినియోగించడంలో మాత్రం చివరిస్థానంలో ఉంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక, తలసరి వినియోగాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తోంది. వీటిని ప్రజల ముంగిటకు చేర్చేందుకు రూ.325.15 కోట్లతో ప్రణాళికలు రూపొందించి చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

తోపుడు బండ్లపై తాజా కూరగాయలను విక్రయిస్తున్నట్టుగా మత్స్య ఉత్పత్తులు కూడా ప్రజల ముంగిటకు వచ్చేలా ఆక్వాహబ్‌లు, ఫిష్‌ కియోస్క్‌లు, రిటైల్‌ అవుట్‌లెట్స్, లైవ్‌ ఫిష్‌ వెండింగ్‌ సెంటర్లు, ఫిష్‌ వెండింగ్‌ కమ్‌ ఫుడ్‌ కార్టులు, ఈ–రిక్షాలు, వాల్యూయాడెడ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యసంపదతో వండిన ఆహార ఉత్పత్తులను కూడా ఆన్‌లైన్‌ ద్వారా సరఫరా చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. వీటి ఏర్పాటు ద్వారా ఇటు రైతులకు మంచి ధర లభించడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. 

2025 నాటికి తలసరి వినియోగం 22.88 కిలోలకు పెంచాలని లక్ష్యం
రాష్ట్రంలో 2014–15లో 20 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తులు 2020–21లో 46.23 లక్షల టన్నులకు పెరిగాయి. స్థానిక వినియోగం 4.36 లక్షల టన్నులు (10 శాతంకన్నా తక్కువ) కాగా తలసరి వినియోగం 8.07 కిలోలు. 2025 నాటికి స్థానిక వినియోగాన్ని కనీసం 30 శాతానికి తలసరి వినియోగాన్ని 22.88 కిలోలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకనుగుణంగా రైతు, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో 100 ఆక్వాహబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ హబ్‌ల నుంచి సరఫరా చేసే లైవ్‌ ఫిష్, తాజా, డ్రై, ప్రాసెస్‌ చేసిన చేపలు, రొయ్యలు, పీతలను జనతా బజార్లు, రిటైల్‌ పాయింట్లకు సరఫరా చేసేందుకు సప్లై చైన్‌ను రూపొందించారు. ఒక్కో హబ్‌ పరిధిలో ఒక వాల్యూయాడెడ్‌ యూనిట్, 5 లైవ్‌ ఫిష్‌ వెండింగ్‌ యూనిట్లు, 8 ఫిష్‌ కియోస్క్‌లు, 10 ఫిష్‌ వెండింగ్‌ కార్టులు, 2 ఫిష్‌ అండ్‌ ఫుడ్‌ వెండింగ్‌ కార్టులు, సచివాలయానికి ఒకటి చొప్పున 100 మినీ రిటైల్‌ అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో హబ్‌ పరిధిలో రోజుకు 15 టన్నుల వంతున మత్స్యసంపదను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. తొలివిడతగా ఏర్పాటు చేస్తున్న 25 హబ్‌లు, అనుబంధ యూనిట్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చడమేగాక ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

చురుగ్గా లబ్ధిదారుల ఎంపిక
తొలిదశకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 20 ఆక్వాహబ్‌ల ఏర్పాటుకు ఆక్వా ఫార్మర్‌ సొసైటీలను ఎంపికచేశారు. కడప, కర్నూలు, అనంతపురం, తెనాలి, నంద్యాల ఆక్వాహబ్‌లకు సొసైటీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. రిటైల్‌ అవుట్‌లెట్స్‌ కోసం 621 మందిని, మినీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ కోసం 1,145 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు ఆక్వాహబ్, దాని పరిధిలోని స్పోక్స్, మినీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ను ఈనెలాఖరులో ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తీసుకురానున్నారు. పెనమలూరు, పులివెందుల ఆక్వాహబ్‌లు, వాటి పరిధిలోని స్పోక్స్, మినీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ను ఆగస్టు 15న, మిగిలిన 23 ఆక్వాహబ్‌లు, వాటి పరిధిలోని 3,335 స్పోక్స్, మినీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ను అక్టోబరు 2న ప్రారంభించనున్నారు. ప్రతిపాదించిన మరో 75 ఆక్వాహబ్‌లను వచ్చే జనవరి 26న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement