AP Prawns And Fish Are In High Demand In The United States - Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఆక్వా అంటే.. అమెరికాలో లొట్టలు!

Published Fri, Sep 17 2021 2:55 AM | Last Updated on Fri, Sep 17 2021 1:00 PM

Andhra Pradesh prawns and fish are in high demand in the United States - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రా రొయ్యలు, చేపలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎనలేని డిమాండ్‌ ఉందని మరోసారి రుజువైంది. ఇక్కడి మత్స్య ఉత్పత్తులంటే అమెరికా వాసులు లొట్టలేసుకుని తింటారు. విస్తీర్ణంలోనే కాదు.. దిగుబడుల్లోనూ నంబర్‌ 1గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతుల్లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఆంధ్రా నుంచి ఆక్వా ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే జరుగుతున్నాయని ఎంపెడా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఆక్వారంగంపై 2020–21 మొదట్లో కరోనా ప్రభావం కాస్త తీవ్రంగానే చూపినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. దీంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది దేశం నుంచి రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2019–20తో పోలిస్తే పరిమాణంలో 10.81 శాతం, విలువలో 6.31 శాతం తగ్గుదల నమోదైంది. రూ.15,832 కోట్ల విలువైన 2,93,314 టన్నుల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులతో ఏపీ దేశంలోనే నంబర్‌ 1గా నిలిచింది. గతేడాదితో పోలిస్తే పరిమాణంలో 4.54 శాతం, విలువలో 2.15 శాతం తగ్గుదల నమోదైంది. చదవండి: భలే ఫిష్‌.. ఆల్‌ ఫ్రెష్‌

ఎగుమతుల్లో 36 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే 
దేశ ఎగుమతుల పరిమాణంలో 36 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. 13 శాతంతో తమిళనాడు, కేరళ, 10 శాతంతో గుజరాత్‌ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల విలువ పరంగా చూసినా 24 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. 18 శాతంతో గుజరాత్, 14 శాతంతో కేరళ, 10 శాతంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల పరిమాణంలోను, విలువలోను ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో కూడా లేవు. 

ఏపీ ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే
మన దేశం నుంచి జరిగిన ఆక్వా ఎగుమతుల్లో 25 శాతం అమెరికాకు, 19 శాతం చొప్పున చైనా, దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు, 13 శాతం యూరోపియన్‌ దేశాలకు, 8 శాతం జపాన్‌కు, 4 శాతం మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు, 12 శాతం ఇతర దేశాలకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి జరిగిన ఎగుమతుల్లో 70.74 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (యూఎస్‌ఏకు), 12.74 శాతం చైనాకు, 4.54 శాతం యూరోపియన్‌ దేశాలకు, 3.51 శాతం మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు, 2.92 శాతం సౌత్‌ ఈస్ట్‌ ఆసియా దేశాలకు వెళ్లాయి. ఇక ఫ్రోజెన్‌ చేసిన రొయ్యల ఎగుమతుల్లో 97.20 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే జరగడం గమనార్హం. చదవండి: కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను

వనామీలోనే 77 శాతం ఏపీదే
రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోసారి సత్తా చాటుకుంది. 2020–21లో వనామీ రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1,08,526.27 హెక్టార్లలో సాగవుతున్న ఆక్వాకల్చర్‌ ద్వారా 8,15,745 టన్నుల వనామీ రొయ్యల ఉత్పత్తి జరిగింది. మన రాష్ట్రంలో 71,921 హెక్టార్లలో 6,34,672 టన్నుల వనామీ రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో వనామీ రొయ్యల ఉత్పత్తిలో 77.80 శాతం ఏపీ నుంచే జరగడం గమనార్హం.

28 శాతం ఎగుమతి వైజాగ్‌ పోర్టు నుంచే
దేశంలో 10 పోర్టుల ద్వారా రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఎగుమతులు జరిగాయి. వాటిలో రూ.16,124.92 కోట్ల విలువైన 2,80,687 టన్నుల మత్స్య ఎగుమతులు ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల నుంచే జరిగాయి. అంటే మొత్తం ఎగుమతుల్లో 24 శాతం విలువైన 37 శాతం ఆక్వా ఉత్పత్తులు మన రాష్ట్ర పరిధిలోని పోర్టుల నుంచే వెళ్లాయి. ప్రధానంగా రూ.12,362.71 కోట్ల (28.28 శాతం) విలువైన 2,16,457 టన్నుల(18.83 శాతం) ఎగుమతులతో వైజాగ్‌ పోర్టు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రూ.5112.77 కోట్ల (11.70 శాతం) విలువైన 1,16,419 టన్నుల (10.13 శాతం) ఎగుమతితో కోల్‌కతా పోర్టు, రూ.4,994.75 కోట్ల (11.43 శాతం) విలువైన 1,43,552 టన్నుల (12.49 శాతం) ఎగుమతితో కొచ్చి పోర్టు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రూ.3,762.21 కోట్ల (8.61 శాతం) విలువైన  64,230 టన్నుల (5.59 శాతం) ఎగుమతులతో రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టు జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఎగుమతుల్లో మనమే టాప్‌
ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ తిరుగులేని ఆధిక్యతను కొనసాగిస్తోంది. 2020–21 మొదట్లో కరోనా కొంత ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థంలో ఎగుమతులు అనూహ్యంగా పుంజుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు చేయగలిగాం. నంబర్‌ 1గా నిలవగలిగాం.
– కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement