మత్స్యకారులకు 'కొత్త ఉపాధి' | Andhra Government New employment for fishermen | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు 'కొత్త ఉపాధి'

Published Wed, Jul 21 2021 2:54 AM | Last Updated on Wed, Jul 21 2021 2:54 AM

Andhra Government New employment for fishermen - Sakshi

సాక్షి, అమరావతి: చేపల వేటపైనే ఆధారపడి జీవనోపాధి సాగించే మత్స్యకార కుటుంబాలకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఎలాంటి రిస్క్‌ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే సముద్ర నాచు (సీవీడ్స్‌)సాగులో మత్స్యకార మహిళలను ప్రోత్సహించాలని సంకల్పించింది. సముద్రగర్భంలో సహజసిద్ధంగా పెరిగే నాచుమొక్కల ద్వారా వచ్చే కెర్రాజీనన్, అల్జిన్, అల్జినేట్స్, ఆగర్‌ వంటి ఉప ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వీటిని కొన్ని రకాల పరిశ్రమలతో పాటు మందులు, మద్యం, కాస్మోటిక్స్, బేకరీ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్‌ టన్నుల సముద్ర నాచు ఉత్పత్తి జరుగుతుండగా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మూడు వైపులా సముద్రతీరంతో పాటు అపారమైన మంచినీటి వనరులున్న భారతదేశంలో 10 లక్షల టన్నుల (మిలియన్‌) ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. కానీ సాగుపట్ల అవగాహన లోపం, కొరవడిన ప్రభుత్వ సహకారం వల్ల కేవలం 25వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. దీంట్లో నాల్గోవంతు తమిళనాడులోనే సాగవుతోంది. ఈ నాచుకున్న ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీర ప్రాంత రాష్ట్రాలతో కలిసి సీవీడ్‌ సాగును ప్రోత్సహించాలని సంకల్పించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్‌వై) కింద 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనివ్వనున్నాయి. తద్వారా రానున్న ఐదేళ్లలో దేశంలో 17లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశిస్తే మన రాష్ట్రంలో కనీసం 1.50లక్షల టన్నులు ఉత్పత్తి చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించింది. 

ఆ రెండు రకాలకే డిమాండ్‌ 
970 కిలోమీటర్ల  సముద్ర తీర ప్రాంతమున్న మన రాష్ట్రంలోని సీ వెడ్‌ సాగుకు అపారమైన అవకాశాలున్నాయని 1979–82లో నిర్వహించిన పరిశోధనల్లో సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) గుర్తించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 19 ప్రాంతాలు అనువైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. తీర ప్రాంతంలో 78 రకాల సీవీడ్స్‌ ఉన్నప్పటికీ వాటిలో ‘కప్పాఫైకస్, గ్రాసిలేరియా’కు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది.  

మూడురకాలుగా సాగు .. 
రాప్ట్, ట్యూబ్, మోనోలైన్‌ పద్ధతిలో వైర్లకు ద్రాక్ష తీగల మాదిరిగా మొక్కలను కడతారు.ఒక్కోదానికి 45–60 కేజీల వరకు సీవీడ్స్‌ను కట్టి అలల తాకిడి, పూడిక, చిక్కదనం లేని తీరప్రాంతంలో 6–8 మీటర్ల లోతులో వీటిని అమర్చి సాగు చేస్తారు.   

రూ.1.50లక్షల పెట్టుబడి.. రూ.6లక్షల ఆదాయం 
మార్కెట్‌లో కిలో నాచు రూ.60 పలుకుతోంది. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్‌ పరిధిలో 1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే 6లక్షల వరకు ఆదాయం వస్తుంది. పైగా పెట్టుబడిలో 60 శాతం సబ్సిడీ ఇస్తారు. 

రూ.1.86 కోట్లతో 7,200 యూనిట్లు 
రాష్ట్రానికి ఈ ఏడాది 7,200యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.1.12కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా, 74.40లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ఇప్పటికే జిల్లాలకు 55.80 లక్షలు విడుదల చేశారు. మార్కెటింగ్‌ కోసం పలు కంపెనీలు–సాగు దారుల మధ్య ఒప్పందం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

సముద్ర నాచు సాగు లాభాలెన్నో 
తీర ప్రాంత మండలాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుçపర్చే లక్ష్యంతో సముద్ర నాచుసాగును ప్రోత్సహిస్తున్నాం. రానున్న 5 ఏళ్లలో 1.50లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం.రిస్క్‌ చాలా తక్కువ. పైగా కచ్చితమైన ఆదాయం.  మత్స్యకార మహిళలు ముందుకు రావాలి.      
–కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement