సాక్షి, హైదరాబాద్: సర్కారు చేప పెరిగి పెద్దదైంది. ప్రభుత్వం ప్రారంభించిన చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం మత్స్యకారులకు లబ్ధి చేకూర్చింది. 2016 వర్షాకాలంలో 27.85 కోట్ల చేప పిల్లలను 3,939 చెరువులు, రిజర్వాయర్లలో ప్రభుత్వం వదిలింది. అందుకు రూ.22 కోట్లు ఖర్చు చేసింది. ఆ చేప పిల్లల ద్వారా 83,552 క్వింటాళ్ల చేపలు ఉత్పత్తి అవుతాయని.. వాటి నుంచి రూ. 501 కోట్లు మత్స్యకారులకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది.
అయితే ఇప్పటి వరకు 55 వేల టన్నుల చేపలను మత్స్యకారులు విక్రయించారని, రూ. 350 కోట్ల ఆదాయం సమకూరిందని మత్స్య శాఖ వర్గాలు తెలిపాయి. 28 వేల టన్నులకుపైగా చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాయని.. వాటి ద్వారా మరో రూ.150 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి మత్స్య శాఖ నివేదిక అందజేసింది.
అందుబాటులోకి 2.83 లక్షల టన్నులు
సర్కారు చేప అందుబాటులోకి రాకముందు రాష్ట్రం లో ఏటా 2 లక్షల టన్నుల చేప ఉత్పత్తి అయ్యేది. రాష్ట్ర జనాభాలో 3 కోట్ల మంది చేపలు తింటారని, వారంతా ఏడాదికి సరాసరి 3 కేజీలు కొనుగోలు చేస్తారని అంచనా. ఆ ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి లక్ష టన్నుల చేపలు వినియోగం అవుతుంటాయి.
మిగిలిన లక్ష టన్నులు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రతీ వ్యక్తి ఏటా 8–10 కేజీల చేపలు తినాలి. ఆ ప్రకారం ఏడాదికి 2.50 లక్షల టన్నుల చేపలు రాష్ట్రా నికి అవసరం అవుతాయని మత్స్య సమాఖ్య జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకా రం 50 వేల టన్నులు కొరత ఉండేదని.. సర్కారు చేపతో 2.83 లక్షల టన్నుల చేప అందుబాటులోకి వచ్చిందన్నారు. పూర్తి స్థాయిలో చేప అందుబాటులోకి వచ్చినా వినియోగం లేదన్నారు.
ముళ్లు తీసే పరిజ్ఞానం ఏదీ..?
చేపల ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి కోల్‌కతాకు ఏటా లక్ష టన్నుల చేపలు ఎగుమతి అవుతుండటంతో ధరలు తగ్గడంలేదని చెబుతున్నారు. మరోవైపు బాయి లర్ కోళ్లు కొనేందుకు వీధివీధినా దుకాణా లుండగా.. రాష్ట్రంలో కేవలం 33 చేపల మార్కెట్లు ఉన్నాయి.
ఔత్సాహిక యువకులు చేపల వ్యాపా రం చేయాలనుకున్నా అవసరమైన రిఫ్రిజిరేటర్లు, సరఫరా వ్యవస్థ లేదు. సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేనేలేదు. పైగా ముళ్లు తీసి విక్రయించే పరిజ్ఞా నం రాష్ట్రంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇటీవల కొచ్చిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సంస్థ చేప ముళ్లు లేకుండా ముక్కలు చేసే యంత్రాన్ని తీసుకొచ్చింది. ఆ యంత్రం ఖరీదు రూ. 2.50 లక్షలని, ప్రయోగాత్మకంగా ఒకటి కొనుగోలు చేస్తామని శ్రీనివాస్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment