Children fish distribution
-
ఉచిత చేప పిల్లల పంపిణీ భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ మత్స్యశాఖ మంత్రి మెర్సికుట్టి అమ్మ ప్రశంసించారు. మంగళవారం ఆమె సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మెర్సికుట్టి అమ్మ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని, కేరళలో కూడా వీటి అమలును పరిశీలిస్తామన్నారు. తలసాని ఆమెకు తెలంగాణ ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం కేరళ మంత్రి మెర్సికుట్టి అమ్మకు తలసాని మెమెంటో అందజేసి సత్కరించారు. -
మత్స్యకారులకు చేపల పంట
సాక్షి, హైదరాబాద్: సర్కారు చేప పెరిగి పెద్దదైంది. ప్రభుత్వం ప్రారంభించిన చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం మత్స్యకారులకు లబ్ధి చేకూర్చింది. 2016 వర్షాకాలంలో 27.85 కోట్ల చేప పిల్లలను 3,939 చెరువులు, రిజర్వాయర్లలో ప్రభుత్వం వదిలింది. అందుకు రూ.22 కోట్లు ఖర్చు చేసింది. ఆ చేప పిల్లల ద్వారా 83,552 క్వింటాళ్ల చేపలు ఉత్పత్తి అవుతాయని.. వాటి నుంచి రూ. 501 కోట్లు మత్స్యకారులకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 55 వేల టన్నుల చేపలను మత్స్యకారులు విక్రయించారని, రూ. 350 కోట్ల ఆదాయం సమకూరిందని మత్స్య శాఖ వర్గాలు తెలిపాయి. 28 వేల టన్నులకుపైగా చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాయని.. వాటి ద్వారా మరో రూ.150 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి మత్స్య శాఖ నివేదిక అందజేసింది. అందుబాటులోకి 2.83 లక్షల టన్నులు సర్కారు చేప అందుబాటులోకి రాకముందు రాష్ట్రం లో ఏటా 2 లక్షల టన్నుల చేప ఉత్పత్తి అయ్యేది. రాష్ట్ర జనాభాలో 3 కోట్ల మంది చేపలు తింటారని, వారంతా ఏడాదికి సరాసరి 3 కేజీలు కొనుగోలు చేస్తారని అంచనా. ఆ ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి లక్ష టన్నుల చేపలు వినియోగం అవుతుంటాయి. మిగిలిన లక్ష టన్నులు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రతీ వ్యక్తి ఏటా 8–10 కేజీల చేపలు తినాలి. ఆ ప్రకారం ఏడాదికి 2.50 లక్షల టన్నుల చేపలు రాష్ట్రా నికి అవసరం అవుతాయని మత్స్య సమాఖ్య జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకా రం 50 వేల టన్నులు కొరత ఉండేదని.. సర్కారు చేపతో 2.83 లక్షల టన్నుల చేప అందుబాటులోకి వచ్చిందన్నారు. పూర్తి స్థాయిలో చేప అందుబాటులోకి వచ్చినా వినియోగం లేదన్నారు. ముళ్లు తీసే పరిజ్ఞానం ఏదీ..? చేపల ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి కోల్‌కతాకు ఏటా లక్ష టన్నుల చేపలు ఎగుమతి అవుతుండటంతో ధరలు తగ్గడంలేదని చెబుతున్నారు. మరోవైపు బాయి లర్ కోళ్లు కొనేందుకు వీధివీధినా దుకాణా లుండగా.. రాష్ట్రంలో కేవలం 33 చేపల మార్కెట్లు ఉన్నాయి. ఔత్సాహిక యువకులు చేపల వ్యాపా రం చేయాలనుకున్నా అవసరమైన రిఫ్రిజిరేటర్లు, సరఫరా వ్యవస్థ లేదు. సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేనేలేదు. పైగా ముళ్లు తీసి విక్రయించే పరిజ్ఞా నం రాష్ట్రంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇటీవల కొచ్చిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సంస్థ చేప ముళ్లు లేకుండా ముక్కలు చేసే యంత్రాన్ని తీసుకొచ్చింది. ఆ యంత్రం ఖరీదు రూ. 2.50 లక్షలని, ప్రయోగాత్మకంగా ఒకటి కొనుగోలు చేస్తామని శ్రీనివాస్ చెబుతున్నారు. -
చేప పిల్లల పంపిణీ వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘నీరొచ్చింది... చేప పిల్లలేవి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన మంత్రి సోమవారం సచివాలయంలో రెండో విడత చేపపిల్లల పంపిణీపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. 2017–18 సంవత్సరానికి రాష్ట్రంలోని 24,831 నీటి వనరులలో 68.32 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 6,537 నీటి వనరులలో 29.52 కోట్ల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. ప్రస్తుతం 11,605 నీటి వనరుల్లోకి సరిపడ నీరు చేరిందని, ఇందుకు 44.17 కోట్ల చేపపిల్లలు అవసరమవుతాయని చెప్పారు. చేప పిల్లల సరఫరాదారులతో సమన్వయం చేసుకొని సకాలంలో చేపపిల్లలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, వనపర్తి, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాల్లో 50 శాతం కన్నా ఎక్కువ చేప పిల్లల పంపిణీ జరిగిందన్నారు. 670 కేజ్‌కల్చర్ యూనిట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 250 యూనిట్లు మంజూరు చేశామన్నారు. కేజ్‌కల్చర్ యూనిట్‌కు 80 శాతం ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలలో కేజ్‌కల్చర్ యూనిట్లకు పేద మత్స్యకారులకు సంబంధించిన లబ్ధిదారుల వాటా 20 శాతంలో 10 శాతం నిధులను జిల్లా కలెక్టర్లు వారి వద్ద ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ నిధుల నుంచి చెల్లించారన్నారు. మిగతా జిల్లాల్లోనూ 10 శాతం నిధులు ఇచ్చేలా జిల్లా కలెక్టర్లకు లేఖలను పంపించాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. రద్దీ ప్రాంతాలలో చేపల విక్రయాలు జరుపుకునేందుకు వీలుగా రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్టాల్స్ తరహాలో ప్రత్యేక వాహనాలను రూపొందించి సబ్సిడీపై అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. చేపలతో వివిధ రకాల వంటకాలు చేసి విక్రయించేలా హైదరాబాద్ నగరంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కనీసం 100 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
చేప రెడీ.. చెరువే...!
► చేప పిల్లల ఉచిత పంపిణీ ఈ ఏడాదీ ఆలస్యం? ► చెరువులు, జలాశయాల్లో నీరు లేక పంపిణీ చేయలేని దుస్థితి ► ప్రస్తుత వర్షాలకు చేప విత్తనం వేయలేమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం ఈసారీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసినప్ప టికీ.. చెరువులు, కుంటల్లో నీరు లేక వదలలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పంపిణీ మొదలెట్టి నెలాఖరులోగా అన్ని చెరువులు, జలాశయాల్లో చేప విత్తనం వేయాలనుకున్నా పరిస్థితి అనుకూలించ కపోవడంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేపలను వదిలే పరిస్థితి లేదని చెబుతున్నారు. చేప పిల్లల పంపిణీ ఈసారీ ఆలస్యమైతే గతేడాదిలానే మత్స్యకారులు సొంతంగా కొని చెరువుల్లో ఉన్న కాసిన్ని నీళ్లలో వేసుకునే అవకాశముందని, అలా జరిగితే పంపిణీ కార్యక్రమంతో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చినట్లవుతుందని విమర్శలొస్తున్నాయి. 70 కోట్ల చేప పిల్లలు రెడీ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం గతేడాది ప్రారంభించింది. మత్స్యశాఖ ఆధ్వర్యం లోని 74 జలాశయాలు.. 3,865 చెరువుల్లో 27 కోట్ల చేప పిల్లలను వదిలింది. మత్స్యకార సొసైటీల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీరు లేక ఆలస్యంగా అక్టోబర్ 3 నుంచి చేప పిల్లలను పంపిణీ చేశారు. కానీ అప్పటికే అనేక చోట్ల మత్స్యకారులు చేప పిల్లలను సొంతంగా కొని వదిలారు. దీంతో ఈసారి ఆగస్టు 3 లేదా చివరి వారంలోనే చేప పిల్లలను వదలాలని అధికారులు నిర్ణయించారు. పైగా 70 కోట్ల చేప పిల్లలను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. మూడో వంతు నీరుండాలి... ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఎక్కువుగా నీరు చేరలేదు. చేప పిల్లలను వదలడానికి జలాశయాలు, చెరువుల్లో కనీసం మూడో వంతు నీరుండాలి. సరైన వర్షాలు లేక.. చెరువులు, జలాశయాలు నిండక వరి నాట్లు వేసుకునే పరిస్థితే లేకుండా పోయింది. అనేకచోట్ల పంటలను కాపాడుకోవడమే గగనంగా మారింది. జలాశయాల్లోకి నీరు రావాలంటే కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు భారీగా కురవాలి. రాష్ట్రం లోనూ కుండపోత వర్షాలు కురవాలి. ప్రస్తుతం అక్కడక్కడ కొన్నిచోట్ల మాత్రమే చెరువులు, జలాశయాలు నిండినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వీలైనచోట్ల చెరువుల్లో చేప పిల్లలను వదిలేస్తున్నారు. గతేడాది ఇలాగే జరిగిందని, ఈసారి అలా వదలొద్దని చెబుతున్నా మత్స్యకారులు అధికారుల మాట వినే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం అధికారులు మార్గదర్శకాలు ఖరారు చేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వర్షాలు లేక ఈసారి కూడా పంపిణీ ఆలస్యమయ్యే అవకాశముందని చెబుతున్నారు. చేప పిల్లల నాణ్యత ప్రమాణాలు.. ♦ చేప పిల్లలు చురుగ్గా ఈదుతూ ఉండాలి. ♦ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలి. ♦ చేప శరీరంపై మచ్చలు, గాయాలు ఉండకూడదు. ♦ వాటి శరీరంపై పరాన్నజీవులు లేకుండా చూసుకోవాలి. ♦ చేప పిల్లల ఈక, తోకలు చీలికలు లేకుండా సరైన స్థితిలో ఉండాలి. ♦ చేప పిల్ల తల భాగం, మిగతా శరీర భాగానికి సమతూకంగా ఉండాలి. ♦ నాణ్యతలేని చేప పిల్లలను ముందే తిరస్కరించాలి ♦ రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పాలిథిన్ బ్యాగుల్లో సరైన మోతాదులో ఆక్సిజన్ ఉందో లేదో చూసుకోవాలి. ♦ చేప పిల్లలను సరఫరా చేసే ప్రాంతం నుంచి నేరుగా నీటి వనరు దగ్గరకు తీసుకెళ్లాలి.