సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘నీరొచ్చింది... చేప పిల్లలేవి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన మంత్రి సోమవారం సచివాలయంలో రెండో విడత చేపపిల్లల పంపిణీపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. 2017–18 సంవత్సరానికి రాష్ట్రంలోని 24,831 నీటి వనరులలో 68.32 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 6,537 నీటి వనరులలో 29.52 కోట్ల చేప పిల్లలను విడుదల చేశామన్నారు.
ప్రస్తుతం 11,605 నీటి వనరుల్లోకి సరిపడ నీరు చేరిందని, ఇందుకు 44.17 కోట్ల చేపపిల్లలు అవసరమవుతాయని చెప్పారు. చేప పిల్లల సరఫరాదారులతో సమన్వయం చేసుకొని సకాలంలో చేపపిల్లలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, వనపర్తి, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాల్లో 50 శాతం కన్నా ఎక్కువ చేప పిల్లల పంపిణీ జరిగిందన్నారు. 670 కేజ్‌కల్చర్ యూనిట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 250 యూనిట్లు మంజూరు చేశామన్నారు.
కేజ్‌కల్చర్ యూనిట్‌కు 80 శాతం ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలలో కేజ్‌కల్చర్ యూనిట్లకు పేద మత్స్యకారులకు సంబంధించిన లబ్ధిదారుల వాటా 20 శాతంలో 10 శాతం నిధులను జిల్లా కలెక్టర్లు వారి వద్ద ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ నిధుల నుంచి చెల్లించారన్నారు. మిగతా జిల్లాల్లోనూ 10 శాతం నిధులు ఇచ్చేలా జిల్లా కలెక్టర్లకు లేఖలను పంపించాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
రద్దీ ప్రాంతాలలో చేపల విక్రయాలు జరుపుకునేందుకు వీలుగా రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్టాల్స్ తరహాలో ప్రత్యేక వాహనాలను రూపొందించి సబ్సిడీపై అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. చేపలతో వివిధ రకాల వంటకాలు చేసి విక్రయించేలా హైదరాబాద్ నగరంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కనీసం 100 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment