చేప రెడీ.. చెరువే...!
► చేప పిల్లల ఉచిత పంపిణీ ఈ ఏడాదీ ఆలస్యం?
► చెరువులు, జలాశయాల్లో నీరు లేక పంపిణీ చేయలేని దుస్థితి
► ప్రస్తుత వర్షాలకు చేప విత్తనం వేయలేమంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం ఈసారీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసినప్ప టికీ.. చెరువులు, కుంటల్లో నీరు లేక వదలలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పంపిణీ మొదలెట్టి నెలాఖరులోగా అన్ని చెరువులు, జలాశయాల్లో చేప విత్తనం వేయాలనుకున్నా పరిస్థితి అనుకూలించ కపోవడంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేపలను వదిలే పరిస్థితి లేదని చెబుతున్నారు. చేప పిల్లల పంపిణీ ఈసారీ ఆలస్యమైతే గతేడాదిలానే మత్స్యకారులు సొంతంగా కొని చెరువుల్లో ఉన్న కాసిన్ని నీళ్లలో వేసుకునే అవకాశముందని, అలా జరిగితే పంపిణీ కార్యక్రమంతో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చినట్లవుతుందని విమర్శలొస్తున్నాయి.
70 కోట్ల చేప పిల్లలు రెడీ..
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం గతేడాది ప్రారంభించింది. మత్స్యశాఖ ఆధ్వర్యం లోని 74 జలాశయాలు.. 3,865 చెరువుల్లో 27 కోట్ల చేప పిల్లలను వదిలింది. మత్స్యకార సొసైటీల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీరు లేక ఆలస్యంగా అక్టోబర్ 3 నుంచి చేప పిల్లలను పంపిణీ చేశారు. కానీ అప్పటికే అనేక చోట్ల మత్స్యకారులు చేప పిల్లలను సొంతంగా కొని వదిలారు. దీంతో ఈసారి ఆగస్టు 3 లేదా చివరి వారంలోనే చేప పిల్లలను వదలాలని అధికారులు నిర్ణయించారు. పైగా 70 కోట్ల చేప పిల్లలను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లలను అందుబాటులో ఉంచారు.
మూడో వంతు నీరుండాలి...
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఎక్కువుగా నీరు చేరలేదు. చేప పిల్లలను వదలడానికి జలాశయాలు, చెరువుల్లో కనీసం మూడో వంతు నీరుండాలి. సరైన వర్షాలు లేక.. చెరువులు, జలాశయాలు నిండక వరి నాట్లు వేసుకునే పరిస్థితే లేకుండా పోయింది. అనేకచోట్ల పంటలను కాపాడుకోవడమే గగనంగా మారింది.
జలాశయాల్లోకి నీరు రావాలంటే కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు భారీగా కురవాలి. రాష్ట్రం లోనూ కుండపోత వర్షాలు కురవాలి. ప్రస్తుతం అక్కడక్కడ కొన్నిచోట్ల మాత్రమే చెరువులు, జలాశయాలు నిండినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వీలైనచోట్ల చెరువుల్లో చేప పిల్లలను వదిలేస్తున్నారు. గతేడాది ఇలాగే జరిగిందని, ఈసారి అలా వదలొద్దని చెబుతున్నా మత్స్యకారులు అధికారుల మాట వినే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం అధికారులు మార్గదర్శకాలు ఖరారు చేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వర్షాలు లేక ఈసారి కూడా పంపిణీ ఆలస్యమయ్యే అవకాశముందని చెబుతున్నారు.
చేప పిల్లల నాణ్యత ప్రమాణాలు..
♦ చేప పిల్లలు చురుగ్గా ఈదుతూ ఉండాలి.
♦ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలి.
♦ చేప శరీరంపై మచ్చలు, గాయాలు ఉండకూడదు.
♦ వాటి శరీరంపై పరాన్నజీవులు లేకుండా చూసుకోవాలి.
♦ చేప పిల్లల ఈక, తోకలు చీలికలు లేకుండా సరైన స్థితిలో ఉండాలి.
♦ చేప పిల్ల తల భాగం, మిగతా శరీర భాగానికి సమతూకంగా ఉండాలి.
♦ నాణ్యతలేని చేప పిల్లలను ముందే తిరస్కరించాలి
♦ రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పాలిథిన్ బ్యాగుల్లో సరైన మోతాదులో ఆక్సిజన్ ఉందో లేదో చూసుకోవాలి.
♦ చేప పిల్లలను సరఫరా చేసే ప్రాంతం నుంచి నేరుగా నీటి వనరు దగ్గరకు తీసుకెళ్లాలి.