సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర సింహ గర్జన విజయవంతం తర్వాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. మంత్రులు రోజా, విడుదల రజనీ, జోగి రమేష్‌తోపాటు వైవీ సుబ్బారెడ్డిపై దాడి చేయటానికే పవన్ వైజాగ్ వచ్చాడని మండిపడ్డారు. గర్జన స్ఫూర్తిని దెబ్బతీయటానికి ప్లాన్ వేశారని విమర్శించారు. ప్యాకేజీలు ఇచ్చి విడాకులు తీసుకున్నానని పవన్ చెప్తున్నాడని, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని ఆ డబ్బును వారికి ఇచ్చాడని మంత్రి ఆరోపించారు. విడిపోయిన చంద్రబాబుతో మళ్ళీ కలవటానికి పవన్ ఇప్పుడు ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్రకు రాజధాని వద్దంటూ చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నాడని, దీనికి పవన్ లాంటి ఊరకుక్కలు మద్దతు తెలపటం సిగ్గుచేటని అన్నారు. పవన్ హద్దుమీరి మాట్లాడుతుంటే ఎల్లోమీడియా బాకాలు ఊదిందని, ఇంతకంటే నీచమైన మీడియా సంస్థలు ఏ రాష్ట్రంలోనూ లేవని అన్నారు. పవన్ చేసే పనులను చూస్తుంటే ప్యాకేజీ స్టార్ అనే అంటారని గుర్తు చేశారు. ప్యాకేజీ స్టార్ కాదని నిరూపించుకోవాలంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. సినిమాల్లో లాగనే రాజకీయాలలో కూడా పవన్ ప్యాకేజీ తీసుకుంటాడని విమర్శించారు.
చదవండి: చిలకలూరిపేటలో చంద్రబాబుకు చేదు అనుభవం..
‘విశాఖలో మూడు రోజులు ఉండి హడావుడి చేసి వెళ్లిపోయాడు. తిరిగి ఎప్పుడు వస్తాడో తెలీదు. యుద్ధానికి సిద్ధం అంటూ పవన్ అంటున్నాడు. ఫామ్‌హౌజ్‌లో చేసే యుద్దానికేనని మీ కార్యకర్తలకు చెప్పు. రాత్రిపూట యుద్దాలే తప్ప ప్రజల కోసం ఏ యుద్దమూ చేయలేవు. తాగి, పిచ్చికుక్కల్లాగ మంత్రుల మీద దాడి చేసిన వారికి చంద్రబాబు పరామర్శ అంట. ఇదేనా చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం? 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం, రోజాని సంవత్సరంపాటు సస్పెండ్ చేయటమా ప్రజాస్వామ్యం అంటే? అసెంబ్లీలో నోరెత్తనీయకుండా చేయటమేనా ప్రజాస్వామ్యం అంటే?
పవన్ ఓ రాజకీయ వ్యభిచారి. పైకి బీజేపీతో పొత్తు ఉన్నట్టు నటిస్తూ చంద్రబాబుతో పవన్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇవి చూసిన వారందరికీ పవన్ నైతికత ఎలాంటిదో తెలిసింది. అభివృద్ధి, పరిపాలనని వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. సీఎం జగన్ అదే చేస్తుంటే వీరికి కడుపుమంటగా ఉంది. అమరావతిని వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ ఇప్పుడు ప్యాకేజీ తీసుకుని మళ్ళీ అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొని వెళ్తున్న వారిపై దౌర్జన్యం చేశారు. దాడి చేసిన వ్యక్తులను పరామర్శించటం సిగ్గుచేటు.
పది కోట్లు ఇచ్చి చంద్రబాబు తన తల్లిని తిట్టించాడని పవన్ అన్నారు. చంద్రబాబుని అంతం చేయటమే తన లక్ష్యం అన్నారు కదా? అమరావతి కొందరికే చంద్రబాబు పరిమితం చేశాడని పవన్ అన్నాడు. మరి ఈరోజు ఏ లక్ష్యం కోసం అదే చంద్రబాబుని పవన్ కలిశాడు? ఏదో సమ్మోహన శక్తి పవన్‌ను రారమ్మని పిలిచింది. అందుకే ఎగురుకుంటూ వెళ్లి చంద్రబాబును కలిశారు. పని పూర్తయ్యాక తిరిగి ఫామ్‌హౌస్‌లో యుద్ధం చేయటానికి హైదరాబాద్ వెళ్లిపోయాడు’ అని మంత్రి సీదిరి అప్పలరాజు పవన్ కల్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment