మత్స్య సంపదకు డ్రై ప్లాట్ ఫారమ్స్
మత్స్య సంపదకు డ్రై ప్లాట్ ఫారమ్స్
Published Thu, Jul 6 2017 10:51 PM | Last Updated on Fri, May 25 2018 2:20 PM
డ్వామా పీడీ రాజకుమారి
అల్లవరం (అమలాపురం) : మత్స్య సంపదను ఆరబెట్టేందుకు డ్రై ప్లాట్ ఫారమ్స్ ఉపాధి నిధులతో నిర్మిస్తున్నామని డ్వామా పీడీ రాజకుమారి అన్నారు. బెండమూర్లంక, బోడసకుర్రు, ఎస్.పల్లిపాలెం, ఓడలరేవు, గుండెపూడి గ్రామాల్లో ఏడుచోట్ల డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి రూ.22.73 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం బోడసకుర్రులో డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావుతో కలసి పరిశీలించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ డ్రై ప్లాట్‌ఫారమ్స్ నిర్మాణానికి 48 మత్స్యకార గ్రామాలకు రూ.80 లక్షల చొప్పున ఉపాధి నిధులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకూ 20 పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు బండ్ ప్లాంటేషన్, హోమ్ ప్లాంటేషన్, పట్టు పురుగుల పెంపకం, వన సంరక్షణ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం ఉపాధి హామీ నిధులతో చేపడుతున్నామన్నారు. జిల్లాలో 400 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్మాణాలు చేపట్టామని, 46 పూర్తయ్యాయని, 141 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510 కిలోమీటర్ల పొడవునా సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఉపాధి కూలీలకు వేతనాలు బ్యాంకు ఆకౌంట్‌లో జమ కాకపోవడానికి ఆధార్ లింక్ చేయకపోవడమే కారణమన్నారు. ఆధార్ లింక్ కాని ఉపాధి కూలీలకు బ్యాంకు అకౌంట్‌లో జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. పీడీ వెంట ఏపీడీ భానుప్రకాష్, ఎంపీడీఓ వి.శాంతామణి, సర్పంచ్ దొమ్మేటి శ్యాంప్రకాష్ ఉన్నారు.
డిసెంబర్ నాటికి మినీ హార్బర్
అంతర్వేదిలో రూ. 30 కోట్లతో నిర్మిస్తున్న మినీ హార్బర్ డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు అన్నారు. బోడసకుర్రులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఓడలరేవులో రూ.5.3 కోట్లతో జెట్టీ నిర్మాణం జరుగుతోందన్నారు.
Advertisement
Advertisement