లోక్ అదాలత్ రికార్డు | Lok Adalat record | Sakshi
Sakshi News home page

లోక్ అదాలత్ రికార్డు

Published Sun, Dec 7 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

లోక్ అదాలత్ రికార్డు

లోక్ అదాలత్ రికార్డు

కరీంనగర్ లీగల్ : రెండో జాతీయ లోక్‌అదాలత్‌లో భా గంగా శనివారం జిల్లాలో 33 వేలకు పైగా కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి బి.నాగమారుతీశర్మ తెలిపారు. ఇది ఆల్‌టైమ్ రికార్డ్‌గా ప్రకటించారు. 182 మోటార్ వాహన ప్రమాద కేసులలో రూ.3.36 కోట్ల పరిహారాన్ని బాధితులకు ఇప్పించామని, తొలిసారిగా 70 సివిల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కేసులను పరిష్కరించుకోవటం ద్వారా కక్షిదారులకు శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతాయన్నారు.
 
 సివిల్ కేసులో కక్షిదారులు కోర్టుకు చెల్లించిన ఫీజులను కూడా వాపసు తీసుకునేందుకు అవకాశముందన్నారు. ఎస్పీ శివకుమార్‌మాట్లాడుతూ బేషజాలకు పోకుండా కక్షిదారులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవటానికి ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు వాసుదేవరావు, వెంకటకృష్ణంరాజు, న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి బాల భాస్కర్ రావు, సీనియర్ సివిల్ జడ్జిలు రంజన్‌కుమార్, భవానీ చంద్ర, మేజిస్ట్రేట్‌లు అప్రోజ్ ఆఖ్తర్, అజర్ హుస్సేన్, ప్రవీణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోపు మధుసూదన్‌రెడ్డి, బి.రఘునందన్‌రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ శివకుమార్ ప్రసంశపత్రాలను అందజేశారు.
 
 సమస్యలను స్థానికంగా చర్చించుకోవాలి
 గంగాధర: భూతగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని, కోర్టు వరకూ తేవొద్దని జడ్జి బి.నాగమారుతీశర్మ కోరారు. మండలంలోని తాడిజెర్రి గ్రామాన్ని నేరరహితంగా ప్రకటించిన సందర్భంగా గ్రామంలో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. లోక్‌అదాలత్ నిర్వహించి మూడు కేసుల్లో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ పంథాలకుపోయి కోర్టుల చుట్టు తిరిగితే డబ్బులు వృథా అవుతాయన్నారు.
 
  ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ గ్రామం నుంచి పోలీస్‌స్టేషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం మంచి మార్పు అని కొనియాడారు. వివాదాలకు దూరంగా ఉంటామని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. శాంతిసూచకంగా జడ్జి, ఎస్పీలు పావురాలను ఎగురవేశారు. హిమ్మత్‌నగర్, తాడిజెర్రి, బూర్గుపల్లి గ్రామ రక్షక దళాలకు వాలీబాల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు మ్యాక రామమ్మ, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ఎం.భాస్కర్, పెద్దపెల్లి డీఎస్పీ మల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల శ్రీలత, చొప్పదండి సీఐ సత్యనారాయణ, గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
 
 భీంరాజ్‌పల్లి చరిత్రలో నిలవాలి
 గొల్లపల్లి : మండలంలోని మారుమూల పల్లె భీంరాజ్‌పల్లి నేరరహిత గ్రామంగా గుర్తింపు పొందిందని, ఇలాగే కొనసాగిస్తూ.. చరిత్రలో నిలవాలని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. గ్రామంలో రెండు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జడ్జి, ఎస్పీ హాజరయ్యారు. వారికి గ్రామస్తులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. వేదికవద్ద భీంరాజ్‌పల్లికి చెందిన కేసుల్లో కక్షిదారులు రాజీకి ఒప్పుకోవడంతో వాటిని కొట్టివేసి నేరరహిత గ్రామంగా ప్రకటించారు. చెందోళికి చెందిన రెండు కేసుల కక్షిదారులు రాజీపడటంతో అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నచిన్న తగాదాలను కోర్టు వరకు తీసుకెళ్లకుండా స్థానికంగా పరిష్కరించుకోవాలని, లేకుంటే నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘ఓడినవారు కోర్టులో ఏడిస్తే.. గెలిచినవారు ఇంటికెళ్లి ఏడ్చాడట..’ అనే సామెతను గుర్తు చేశారు.
 
 శాంతిమార్గమే బెటర్ : ఎస్పీ
 సమస్యలు వస్తాయని, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ శివకుమార్ అన్నారు. అందరు సహకరిస్తే నేర రహిత జిల్లాగా తప్పక మారుతుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన ఎస్సై నిరంజన్‌రెడ్డి, సీఐ వెంకటరమణను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగారపు ఎల్లవ్వ, ఎంపీటీసీ నాగవ్వ, సింగిల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, జగిత్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్సైలు బిల్లా కోటేశ్వర్, దేవయ్య, నరేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
 
 లీగల్ సెల్ సిబ్బందికి ప్రశంసపత్రాలు
 కరీంనగర్ క్రైం : జాతీయస్థాయి లోక్‌అదాలత్ ముగింపు సందర్భంగా జిల్లాలో ఎక్కువ శాతం కేసుల్లో రాజీ కుదిర్చి పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించిన జిల్లాలోని పోలీస్ విభాగం లీగల్ సెల్ కోర్టు కానిస్టేబుళ్లకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి నాగమారతీశర్మ, ఎస్పీ శివకుమార్, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి బాలభాస్కర్ సీఐ సంపత్, ఎస్సైలు వలీబాబా, కృష్ణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గోవర్ధన్, అనందం, ఎండీ రఫూఫ్,  ప్రకాశ్‌రెడ్డి, సత్తయ్య, కానిస్టేబుళ్లు చేరాలు, తిరుపతి, శ్రీనివాస్, గోపీ, రాజ, వంశీకిరణ్, రవి, సతీష్‌కుమార్, దేవేందర్, సందీప్‌కు ప్రశంసపత్రాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement