న్యూఢిల్లీ: దేశ ప్రధాన ఆర్థిక రంగం ఇంకా సవాళ్లలోనే కొనసాగుతోందని తాజాగా విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెల్లడించాయి. కరోనా మూడవ వేవ్ (ఒమిక్రాన్) సవాళ్ల నేపథ్యంలో మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. ఇక సామాన్యునికి ఆందోళన కలిగించే స్థాయిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా 7.79 శాతానికి ఎగసింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 7.79 శాతం పెరిగిందన్నమాట.
2021 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే వరుసగా నాలుగు నెలల నుంచి ఆపై స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. కరోనా సవాళ్లతో నెలకొన్న సరఫరాల సమస్యలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మరింత పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి కనిష్ట స్థాయి పతనం ధరా భారాన్ని మరింత పెంచుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గురువారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతానికి చేరింది. అటు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రేటును చూడ్డం ఇదే తొలిసారి.
► ఆహార, ఇంధన ధరల భారీ పెరుగుదల తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది.
► 2021 ఏప్రిల్‌లో ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 1.96% అయితే, 2022 మార్చితో 7.68%గా ఉంది. ఏప్రిల్‌లో ఈ రేటు ఏకంగా 8.38%కి పెరిగింది. ఫుడ్ బాస్కెట్‌లో ఒక్క కూరగాయల ధరలు ఏకంగా 15.41% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల 11.64 %.
► ఇంధనం, లైట్ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 7.52 శాతం ఉంటే, ఏప్రిల్‌లో 10.80 శాతానికి ఎగసింది.
► వంట నూనెలు, ఫ్యాట్స్ విభాగంలో ధరల భారం మార్చితో పోల్చితే (18.79 శాతం) స్వల్పంగా 17.28 శాతానికి తగ్గినా సామాన్యునికి ఈ స్థాయి ధరల పెరుగుదలే చాలా తీవ్రమైనది కావడం గమనార్హం. ఎరువులతోపాటు భారత్ వంట నూనెల అవసరాలకు ఉక్రెయిన్ ప్రధాన వనరుగా ఉంది. యుద్ధంతో ఆ దేశం అతలాకుతలం నేపథ్యంలో సరఫరాల సమస్యలు తీవ్రమయ్యాయి.
జూన్‌లో మరో దఫా రేటు పెంపు!
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమీక్షా నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్‌బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది.
దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపు ఇది.
కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.5%కి చేర్చింది.
మేలోనూ పైపైనే...
గతవారం అనూహ్యంగా జరిగిన ఆర్‌బీఐ రేటు పెంపు నిర్ణయం సమర్థనీయమేనని వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తాజా స్పీడ్ (7.79 శాతం) స్పష్టం చేస్తోంది. అలాగే జూన్ 2022లో మరో దఫా రేటు పెంపు ఖాయమన్న అంచనాలను ఈ గణాంకాలు పెంచుతున్నాయి. 2021 మేలో అధిక బేస్ వల్ల (6.3 శాతం) 2022 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గవచ్చని భావిస్తున్నాం. హై బేస్ ప్రాతిపదిక కొంత తగ్గినా, ఆర్‌బీఐకి నిర్దేశిస్తున్న లక్ష్యానికి ఎగవనే 6.5 శాతంగా మేలో ద్రవ్యోల్బణం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము
– అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్.
పారిశ్రామికోత్పత్తికి హైబేస్, ఒమిక్రాన్ తలనొప్పులు
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2022 మార్చిలో కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. కరోనా మూడవ వేవ్ ఒమిక్రాన్ సవాళ్లతో పాటు 2021 మార్చి నెల హై బేస్ (అప్పట్లో వృద్ధి రేటు ఏకంగా 24.2 శాతం) దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్.
మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. జనవరి, ఫిబ్రవరిలో కూడా ఐఐపీపై (వృద్ధి రేటు కేవలం 1.5 శాతం) ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు అన్ని కీలక రంగాలపై హై బేస్ ప్రభావం కనిపించింది.
► తయారీ: మార్చిలో కేవలం 0.9 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రేటు ఏకంగా 28.4 శాతం.
► మైనింగ్: వృద్ధి రేటు 6.1% నుంచి 4 శాతానికి తగ్గింది.
► విద్యుత్: 22.5 శాతం వృద్ధి రేటు 6.1 శాతానికి దిగివచ్చింది
► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన ఈ విభాగంలో వృద్ధి రేటు 50.4 శాతం నుంచి ఏకంగా 0.7 శాతానికి తగ్గింది.
►కన్జూమర్ డ్యూరబుల్స్: 2021 మార్చిలో 59.9 శాతం వృద్ధి నమోదయితే, తాజా సమీక్షా నెల్లో అసలు వృద్ధి లేకపోగా 3.2 శాతం క్షీణించింది.
2021–22లో 8.4 శాతం పురోగతి
కాగా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ది నమోదుకాకపోగా 8.4 శాతం క్షీణతలో ఉంది.
2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట...
మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్ అమలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకు క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది.
Comments
Please login to add a commentAdd a comment