న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్‌వేవ్‌తో పోలిస్తే ప్రస్తుత థర్డ్ వేవ్ వల్ల మరణాలు, ఆస్పత్రిపాలవడం తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత వేవ్‌లో కేసులు పెరుగుతున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడందుకోవడంతో భారీగా అనారోగ్యాలపాలవడం, చావులు పెరగడం కనిపించడంలేదని తెలిపింది. ఈ మేరకు రెండు, మూడు వేవ్స్‌ను పోల్చిచెప్పే కీలక సూచీలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో గురువారం ప్రదర్శించారు.
దేశంలో 2021 ఏప్రిల్ చివరకు 3.86 లక్షల కొత్త కేసులు, 3,059 మరణాలు, 31.70 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఆ సమయంలో దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 2 శాతమని చెప్పారు. 2022 జనవరి 20న దేశంలో 3.17 లక్షల కొత్త కేసులు, 380 మరణాలు, 19.24 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఈ సమయానికి పూర్తిడోసులందుకున్న వారి సంఖ్య 72 శాతానికి చేరిందని వివరించారు.
టీకా కార్యక్రమం వల్ల థర్డ్ వేవ్‌లో మరణాలు తగ్గాయన్నారు. 18ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం మంది రెండు డోసులు, 94 శాతం మంది తొలిడోసు అందుకున్నారని చెప్పారు. 15– 18 ఏళ్ల కేటగిరీ ప్రజల్లో 52 శాతం మంది తొలిడోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ కేటగిరీలో టీకాలందుకున్నవారిలో ఏపీ టాప్‌లో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment