న్యూఢిల్లీ: పండగల సీజన్‌లో వైరస్ వ్యాప్తి ఉధృతిని అడ్డుకునేందుకు పౌరులు తమ వంతు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ హితవు పలికింది. పర్వదినాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలని భావించే వారు ఖచ్చితంగా రెండు డోస్‌లు(ఫుల్ వ్యాక్సినేషన్) తీసుకోవాలని కేంద్రం సూచించింది. మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమనిబంధనలను పాటించాలని సలహా ఇచ్చింది. వారపు పాజిటివిటీ రేటు కాస్తంత తగ్గినా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించింది.
ఆగస్ట్ చివరి రోజుల్లో వారపు పాజిటివిటీ రేటు 39 జిల్లాల్లో ఇంకా ఏకంగా 10 శాతం పైనే నమోదైందని ఆందోళన వ్యక్తంచేసింది. మరో 38 జిల్లాల్లో 5–10 శాతానికి చేరుకుందని పేర్కొంది. ‘వచ్చే పండగల సీజన్‌లో కరోనా మూడో వేవ్ ముంగిట మనం ఉండబోతున్నామనే భయాలు ప్రజల్లో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసందోహం ఉండే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లడాన్ని ప్రజలు మానుకోవాలి. ఖచ్చితంగా వెళ్తామని నిర్ణయించుకునే వారు రెండు డోస్‌లు తీసుకోవాలి. సమూహాలకు ప్రాధాన్యతనివ్వకుండా వారి వారి ఇళ్లల్లోనే పండగలు చేసుకుంటే ఉత్తమం’ అని కేంద్రం హితబోధ చేసింది. దేశంలో దాదాపు 300కుపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా కేంద్రం గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment