Virus increase
-
Covid-19: దేశవ్యాప్తంగా 63 కరోనా జేఎన్1 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వైరస్ వ్యాప్తి దేశంలో పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈ ఉపవేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు ఈ రకం కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. కేరళలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
కరోనా వేరియంట్ భయం.. గాంధీ ఆసుపత్రి రాజారాం కీలక వ్యాఖ్యలు
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రూపం మార్చుకుని మళ్లీ వచ్చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృభిస్తోంది. రెండురోజులుగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏకంగా మళ్లీ కరోనా మరణాలను గుర్తుచేస్తోంది. అసలు జెఎన్–వన్ వెరియంట్ ఎంటీ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కొత్త వెరియంట్ ఎంత వరకు ప్రమాదకరం.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బారినపడి ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వెరియంట్ వేగంగా విస్తరించింది. చాలా మందిని ఇబ్బందిని పెట్టింది. అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వెరియంటే JN-1. ఒమిక్రాన్ రూపం మార్చుకుని జెఎన్-1 గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డ్‌లో బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్‌గా మారనుంది. సో.. బీ కేర్ ఫుల్.. బీ అలెర్ట్. ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
చైనాలో మళ్లీ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తర చైనాలో కొవిడ్ తొలిరోజుల్లో ఉన్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. చాలా స్కూళ్లలో చిన్నపిల్లల్లో న్యుమోనియా తరహ లక్షణాలు బయటపడుతున్నాయి. అంతేగాక ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, బెడ్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, రీ ఏజెంట్స్ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనేదానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది. ఇవేగాక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలనుఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా ఎప్పటికప్పుడు జిల్లా, స్టేట్ సర్విలెన్స్ యూనిట్లలో అప్లోడ్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. డేటా కరక్టుగా ఉంటే పరిస్థితిని పక్కాగా పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపింది. కొవిడ్ మహమ్మారితో ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట బాధపడుతున్న చైనా తాజాగా నమోదవుతున్న ఎనీమాటిక్ నుమోనియా కేసులతో బెంబేలెత్తుతోంది. స్కూలు పిల్లల్లో నమోదవుతున్న ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్ కారణం కాదని చైనా హెల్త్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషేన్(డబ్ల్యూహెచ్‌వో) చైనా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. ఇదీచదవండి..ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్ -
COVID-19: చైనాలో కరోనా కేసులు ఏకంగా 90 కోట్లు!
బీజింగ్: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్–19 వైరస్ బారినపడ్డారు. పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు వర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్ సోకిందని వెల్లడించింది. అత్యధికంగా గాన్సూ ప్రావిన్స్‌లో 91 శాతం మందికి కరోనా సోకింది. యునాన్ ప్రావిన్స్‌లో 84 శాతం మంది, కింఘాయ్ ప్రావిన్స్‌లో 80 శాతం మంది వైరస్ ప్రభావానికి గురయ్యారు. చైనాలో కొత్త సంవత్సరం ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది జనం పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అంటువ్యాధుల నిపుణుడొకరు హెచ్చరించారు. కరోనా కొత్త వేవ్ ఉధృతి రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ అధిపతి జెంగ్ గువాంగ్ తెలిపారు. -
తప్పదనుకుంటే టీకాలూ తప్పనిసరే
న్యూఢిల్లీ: పండగల సీజన్లో వైరస్ వ్యాప్తి ఉధృతిని అడ్డుకునేందుకు పౌరులు తమ వంతు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ హితవు పలికింది. పర్వదినాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలని భావించే వారు ఖచ్చితంగా రెండు డోస్‌లు(ఫుల్ వ్యాక్సినేషన్) తీసుకోవాలని కేంద్రం సూచించింది. మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమనిబంధనలను పాటించాలని సలహా ఇచ్చింది. వారపు పాజిటివిటీ రేటు కాస్తంత తగ్గినా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించింది. ఆగస్ట్ చివరి రోజుల్లో వారపు పాజిటివిటీ రేటు 39 జిల్లాల్లో ఇంకా ఏకంగా 10 శాతం పైనే నమోదైందని ఆందోళన వ్యక్తంచేసింది. మరో 38 జిల్లాల్లో 5–10 శాతానికి చేరుకుందని పేర్కొంది. ‘వచ్చే పండగల సీజన్లో కరోనా మూడో వేవ్ ముంగిట మనం ఉండబోతున్నామనే భయాలు ప్రజల్లో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసందోహం ఉండే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లడాన్ని ప్రజలు మానుకోవాలి. ఖచ్చితంగా వెళ్తామని నిర్ణయించుకునే వారు రెండు డోస్‌లు తీసుకోవాలి. సమూహాలకు ప్రాధాన్యతనివ్వకుండా వారి వారి ఇళ్లల్లోనే పండగలు చేసుకుంటే ఉత్తమం’ అని కేంద్రం హితబోధ చేసింది. దేశంలో దాదాపు 300కుపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా కేంద్రం గుర్తుచేసింది. -
కోవిడ్ మృతులు 1,665
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక ‘కోవిడ్–19’ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్‌ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోనే చోటు చేసుకున్నాయి. శనివారం చనిపోయిన 142 మందిలో 139 మంది ఆ రాష్ట్రంలోనే మరణించారు. అలాగే, మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 68,500కు పెరగగా, వాటిలో 56,249 కేసులు హుబే ప్రావిన్స్‌లోనివే. వీటిలో శనివారం ఒక్కరోజే నిర్ధారించిన కేసుల సంఖ్య 1,843. అయితే, కొత్తగా వైరస్ సోకుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకగా ఆరుగురు చనిపోయారు. కరెన్సీ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో.. నోట్లు, నాణేలను కొన్ని రోజుల పాటు వాడకుండా పక్కనబెట్టి, వాటిపై అతినీలలోహిత కిరణాలను ప్రసరింపచేసి, ఆ తరువాత మళ్లీ సర్క్యులేషన్లోకి పంపిస్తున్నారు. పాన్ తీరంలో నిలిపేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలో కోవిడ్–19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కోవిడ్–19పై పోరులో చైనాకు అన్ని రకాలుగా సహకరిస్తామని భారత్ మరోసారి చెప్పింది. భారత్ త్వరలో ఔషధాలను పంపించనుందని చైనాలో భారతీయ రాయబారి విక్రమ్ మిస్రీ తెలిపారు. -
కేరళకు ‘నిపా’ దెబ్బ
కొజికోడ్: నిపా అనే అరుదైన వైరస్ కారణంగా కేరళలోని కొజికోడ్ జిల్లాలో గత పక్షం రోజుల్లో ముగ్గురు మరణించారు. ఈ వైరస్ సోకిన ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తుండగా, మరో 8 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అధిక జ్వరంతో మరో ఇద్దరు నర్సులు కూడా ఆసుపత్రిలో చేరారు. చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారే. నిపా వైరస్ కారణంగా మొదట మే 5న ఈ కుటుంబంలోని ఓ యువకుడు (23), మే 18న అతని అన్న (25), మే 19న ఆ కుటుంబంలోని 50 ఏళ్ల మహిళ మరణించారు. ఆ యువకుల తండ్రికి కూడా ఈ వ్యాధి సోకడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చికిత్స పొందుతున్న సమయంలో వారి బాగోగులు చూసుకున్న నర్సు లినీ కూడా సోమవారం మరణించారు. అయితే ఆమె కూడా నిపా వైరస్ సోకడం వల్లే చనిపోయారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అటు కొజికోడ్ పొరుగు జిల్లా మలప్పురంలోనూ నిపా వైరస్ సోకిన లక్షణాలతోనే ఐదుగురు చనిపోయారు. అయితే వీరికి కూడా కచ్చితంగా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కొజికోడ్‌లో ముగ్గురు చనిపోయిన ఇంటిలోని బావిలో గబ్బిలం కనిపించడంతో ఆ బావిని మూసివేశామని అధికారులు తెలిపారు. కేరళలో హై అలర్ట్.. నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సీఎం పినరయి విజయన్ కేరళ అధికారులను అప్రమత్తం చేశారు. మరిన్ని ప్రాణాలు పోకుండా చూసేందుకు అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ కొజికోడ్ జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని శైలజ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా శైలజతో మాట్లాడి జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం నుంచి ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని కొజికోడ్కు పంపారు. గబ్బిలాలను పట్టుకుంటున్న సిబ్బంది 1998లో తొలిసారి.. నిపా వైరస్‌ను తొలిసారిగా 1998లో గుర్తించారు. మలేసియాలోని కాంపుంగ్ సుంగై నిపా అనే ప్రాంతంలో ఈ వైరస్‌ను మొదట గుర్తించటంతో దానికి ఆ పేరు పెట్టారు. నిఫాలో ఇది పందుల ద్వారా వ్యాపించింది. ఈ సూక్ష్మక్రిమిని నిరోధించే వ్యాక్సిన్ లేదు. పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తోంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులకి దగ్గరగా మసలడం వల్ల, నిపా వ్యాధి ఉన్న పక్షులు, జంతువులు కొరికి వదిలేసిన పండ్లను తినడం, వైరస్ బారిన పడిన వ్యక్తులను నేరుగా తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినవారిలో సగటున 70 శాతం మంది వరకు మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిపా వైరస్ భారతదేశంలో తొలిసారిగా 2001 సంవత్సరంలో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 66 కేసులు నమోదైతే 45 మంది (68 శాతం) మరణించారు. ఆ తర్వాత 2007 సంవత్సరం పశ్చిమ బెంగాల్లోనే నాడియాలోనూ నిపా వైరస్ కనిపించింది. కేరళలో ఈ వైరస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. లక్షణాలు ఇవీ: నిపా వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు చూసినా నిద్రమత్తుగా ఉండడం, మానసికంగా గందరగోళానికి గురవడం కూడా ఈవ్యాధి లక్షణమే. ఒక్కోసారి ఈ మానసిక ఆందోళన మెదడువాపునకు కూడా దారితీస్తుంది. వైరస్ సోకిన అయిదు నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకొస్తాయి. గబ్బిలాలున్న బావిని మూసేస్తున్న దృశ్యం – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రాష్ట్రానికి జ్వరమొచ్చింది
* మూడు నెలల్లో 8.7 లక్షల మంది జ్వరబాధితులు.. వీరిలో 3.59 లక్షలు టైఫాయిడ్ రోగులే * కామెర్లు, డయేరియా ప్రభావమూ ఎక్కువే * ఇవి ప్రభుత్వాస్పత్రుల లెక్కలే.. * ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 3 లక్షల కేసులు * ఎన్నికలు, విభజన పనుల్లో అధికారులు సాక్షి, హైదరాబాద్: ఎండవేడిమి పెరగడంతో రాష్ట్రం జబ్బుల బారిన పడుతోంది. ఎక్కడ చూసినా జ్వరపీడితులే. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతమంది ఇప్పుడు జ్వరాల బారిన పడుతున్నట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. అధికారులంతా ఎన్నికలు, రాష్ట్ర విభజన విధుల్లో నిమగ్నమవడంతో ప్రజారోగ్యం గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో క్లోరినేషన్, శానిటేషన్ పనులతో పాటు, ఆస్పత్రుల్లో వసతులు, ముందు జాగ్రత్త పనులను అధికారులు విస్మరించారు. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి గత నెల 31 వరకు మూడు నెలల్లో ప్రభుత్వాస్పత్రులకు 8.70 లక్షల మందికి పైగా జ్వరపీడితులు వైద్యం కోసం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 3 లక్షల కేసులు నమోదై ఉండవచ్చని అధికారులు అంటున్నారు. చిత్తూరు, ఆదిలాబాద్, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువగా జ్వర పీడితులు వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో నమోదు చేసుకున్న జ్వర పీడితుల్లో టైఫాయిడ్ బాధితులే 3.59 లక్షల మంది ఉన్నారు. వైరల్ హెపటైటిస్ (కామెర్లు) కూడా ఎప్పుడూ లేనంతగా నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వేసవిలో సర్వసాధారణంగా వచ్చే డయేరియా (విరేచనాలు) కేసులూ ఎక్కువయ్యాయి. అయితే, బాధితులు లక్షల్లో వస్తున్నా, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో కలిసి 60 వేల పడకలు కూడా లేవు. జ్వరాలకు కారణాలివే.. - వేసవిలో నీటిలో మలమూత్రాలు కలుషితమవుతుంటాయి. వీటివల్ల టెఫాయిడ్, ఇతర జ్వరాలు వస్తాయి. అందుకే క్లోరిన్ వేసిన నీటినే తాగాలి. - వేసవిలో గాలి కలుషితమై వైరస్ అభివృద్ధి తీవ్రంగా ఉండటంవల్ల వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తాయి. ఉదాహరణకు జ్వరబాధితుడు తుమ్మడం వల్ల ఆ తుంపర గాలిలో కలిసి ఇతరులకు సోకుతుంది. ఇలాంటి వారిని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచి సాధారణ వైద్యం చేస్తే సరిపోతుంది. - డయేరియా కూడా కలుషిత నీరు వల్లనే వస్తుంది. అందుకే ప్రతి వెయ్యి లీటర్ల నీటిలో కనీసం 3 గ్రాముల క్లోరిన్ కలపాలి. డయేరియా బాధితులను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. - కామెర్లు కూడా కలుషిత నీటి వల్లే వస్తాయి. అందుకే కాచి చల్లార్చిన నీరు తాగాలి. కామెర్లు సోకినప్పుడు చికిత్స అందించి, త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి.