బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక ‘కోవిడ్–19’ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్‌ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోనే చోటు చేసుకున్నాయి. శనివారం చనిపోయిన 142 మందిలో 139 మంది ఆ రాష్ట్రంలోనే మరణించారు. అలాగే, మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 68,500కు పెరగగా, వాటిలో 56,249 కేసులు హుబే ప్రావిన్స్‌లోనివే. వీటిలో శనివారం ఒక్కరోజే నిర్ధారించిన కేసుల సంఖ్య 1,843. అయితే, కొత్తగా వైరస్ సోకుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని అధికారులు చెప్పారు.
ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకగా ఆరుగురు చనిపోయారు. కరెన్సీ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో.. నోట్లు, నాణేలను కొన్ని రోజుల పాటు వాడకుండా పక్కనబెట్టి, వాటిపై అతినీలలోహిత కిరణాలను ప్రసరింపచేసి, ఆ తరువాత మళ్లీ సర్క్యులేషన్‌లోకి పంపిస్తున్నారు. పాన్ తీరంలో నిలిపేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలో కోవిడ్–19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కోవిడ్–19పై పోరులో చైనాకు అన్ని రకాలుగా సహకరిస్తామని భారత్ మరోసారి చెప్పింది. భారత్ త్వరలో ఔషధాలను పంపించనుందని చైనాలో భారతీయ రాయబారి విక్రమ్ మిస్రీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment