రాష్ట్రానికి జ్వరమొచ్చింది
* మూడు నెలల్లో 8.7 లక్షల మంది జ్వరబాధితులు.. వీరిలో 3.59 లక్షలు టైఫాయిడ్ రోగులే
* కామెర్లు, డయేరియా ప్రభావమూ ఎక్కువే
* ఇవి ప్రభుత్వాస్పత్రుల లెక్కలే..
* ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 3 లక్షల కేసులు
* ఎన్నికలు, విభజన పనుల్లో అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఎండవేడిమి పెరగడంతో రాష్ట్రం జబ్బుల బారిన పడుతోంది. ఎక్కడ చూసినా జ్వరపీడితులే. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతమంది ఇప్పుడు జ్వరాల బారిన పడుతున్నట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. అధికారులంతా ఎన్నికలు, రాష్ట్ర విభజన విధుల్లో నిమగ్నమవడంతో ప్రజారోగ్యం గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో క్లోరినేషన్, శానిటేషన్ పనులతో పాటు, ఆస్పత్రుల్లో వసతులు, ముందు జాగ్రత్త పనులను అధికారులు విస్మరించారు. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి గత నెల 31 వరకు మూడు నెలల్లో ప్రభుత్వాస్పత్రులకు 8.70 లక్షల మందికి పైగా జ్వరపీడితులు వైద్యం కోసం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 3 లక్షల కేసులు నమోదై ఉండవచ్చని అధికారులు అంటున్నారు. చిత్తూరు, ఆదిలాబాద్, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువగా జ్వర పీడితులు వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో నమోదు చేసుకున్న జ్వర పీడితుల్లో టైఫాయిడ్ బాధితులే 3.59 లక్షల మంది ఉన్నారు. వైరల్ హెపటైటిస్ (కామెర్లు) కూడా ఎప్పుడూ లేనంతగా నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వేసవిలో సర్వసాధారణంగా వచ్చే డయేరియా (విరేచనాలు) కేసులూ ఎక్కువయ్యాయి. అయితే, బాధితులు లక్షల్లో వస్తున్నా, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో కలిసి 60 వేల పడకలు కూడా లేవు.
జ్వరాలకు కారణాలివే..
- వేసవిలో నీటిలో మలమూత్రాలు కలుషితమవుతుంటాయి. వీటివల్ల టెఫాయిడ్, ఇతర జ్వరాలు వస్తాయి. అందుకే క్లోరిన్ వేసిన నీటినే తాగాలి.
- వేసవిలో గాలి కలుషితమై వైరస్ అభివృద్ధి తీవ్రంగా ఉండటంవల్ల వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తాయి. ఉదాహరణకు జ్వరబాధితుడు తుమ్మడం వల్ల ఆ తుంపర గాలిలో కలిసి ఇతరులకు సోకుతుంది. ఇలాంటి వారిని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచి సాధారణ వైద్యం చేస్తే సరిపోతుంది.
- డయేరియా కూడా కలుషిత నీరు వల్లనే వస్తుంది. అందుకే ప్రతి వెయ్యి లీటర్ల నీటిలో కనీసం 3 గ్రాముల క్లోరిన్ కలపాలి. డయేరియా బాధితులను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి.
- కామెర్లు కూడా కలుషిత నీటి వల్లే వస్తాయి. అందుకే కాచి చల్లార్చిన నీరు తాగాలి. కామెర్లు సోకినప్పుడు చికిత్స అందించి, త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి.