తగ్గని డయేరియా
మూడో రోజు మరో 40 మంది ఆస్పత్రుల్లో చేరిక
అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
బెల్లంపల్లి : బెల్లంపల్లిలో డయేరియా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మూడో రోజు శుక్రవారం కూడా బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. వాంతులు, విరేచనాలతో ప్రజలు సతమతమవుతున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతిఖని, సుభాష్‌నగర్, 65 డీప్ ఏరియా, 85 డీప్ ఏరియా, నం.2 ఇంక్లైన్, బెల్లంపల్లిబస్తీలలో డయేరియా బాధితులు పదుల సంఖ్యలో ఉండగా మరికొన్ని బస్తీల్లోనూ ఒకరిద్దరు వాంతులు, విరేచనాలతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో సుమారు 100 మంది వరకు బాధితులు ఆస్పత్రుల్లో చేరగా, శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో 20 మంది, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో 20 మంది చొప్పున చేరారు. ప్రభుత్వాస్పత్రిలో పడకలు పూర్తిగా నిండిపోవడంతో వైద్యం కోసం వచ్చే రోగులకు వరండాలో బెంచీలు, నేలపై కార్పేట్ వేసి చికిత్స చేస్తున్నారు. సింగరేణిలో పని చేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులకు ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మరికొందరు రోగులు ఇళ్ల వద్దనే ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నారు.
అప్రమత్తమైన అధికారులు
బెల్లంపల్లిలో డయేరియా ప్రబలడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ, సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయక్ హుటాహుటిన బెల్లంపల్లికి చేరుకొని రోగులను పరామర్శించారు. తాండూర్, తాళ్లగురిజాల, నెన్నెల తదితర ప్రాంతాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని బెల్లంపల్లికి రప్పించి వైద్యం అందిస్తున్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో పర్యవేక్షణలో బెల్లంపల్లి క్లస్టర్ ఇన్‌చార్జి కరుణాకర్, ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి చంద్రమౌళి ఇతర వైద్యులు రోగులను పరీక్షించారు. తాగునీరు కలుషితం కావడం వల్లనే డయేరియా ప్రబలినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయక్ స్పష్టం చేశారు.
పలువురి పరామర్శ
డయేరియాతో ఆస్పత్రిలో చేరిన రోగులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, తహశీల్దార్ కె.శ్యామలాదేవి, మందమర్రి ఏరియా జీఎం రాఘవులు వేర్వేరుగా వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రిలో చేరిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.