వణికిస్తున్న డయేరియా
అనంతగిరి : మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా, మలేరియాతో గిరిజనులు బాధపడుతున్నారు. భీమవరం, అనంతగిరి, లుంగపర్తి, పినకోట పీహెచ్‌సీల్లో రోజూ పదుల సంఖ్యలో గిరిజనులు జ్వరాలు, వాంతులు, విరేచనాలతో చేరుతున్నారు. శనివారం గుమ్మకోటకు చెందిన ఇద్దరు, టోకురు నుంచి ఒకరు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవ్వగా 108 సిబ్బందికి ఇబ్బందిగా మారింది. దీంతో తొలుత టోకురు నుంచి బాధితుణ్ణి ఎస్.కోట.ఆస్పత్రికి చేర్చారు.
తర్వాత అదే గ్రామం నుంచి మరో బాధితురాలు అస్వస్థతకు గురవ్వగా, 108 అందుబాటులో లేక, డోలీ మోతతో తరలించారు. అప్పటికి అంబులెన్‌స గుమ్మకోటకు చేరుకొని మరో ఇద్దరు డయేరియా బాధితులను ఎస్‌కోట ఆస్పత్రికి తీసుకెళ్లింది. గ్రామాల్లో వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండడంలేదని, ఇకనైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.