'డై' యేరియా! | Diarrhea Cases File in Hyderabad | Sakshi
Sakshi News home page

'డై' యేరియా!

Published Sat, Aug 31 2019 12:10 PM | Last Updated on Mon, Sep 2 2019 12:15 PM

Diarrhea Cases File in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో డయేరియా (నీళ్ల విరేచనాలు) చాపకింది నీరులా విస్తరిస్తోంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 3.5లక్షల మంది డయేరియా బారినపడుతుండగా... సగానికిపైగా కేసులు గ్రేటర్‌ పరిధిలోనే నమోదువుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 2018లో 71,918 డయేరియా కేసులు నమోదు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 41,441 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలోనే ఉంటుందని వైద్యవర్గాలే పేర్కొంటున్నాయి. సీజన్‌ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడుఆయా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలియజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ... నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడాదీన్ని పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో 13 శాతం డయేరియాతోనే సంభవిస్తున్నట్లు సమాచారం. డయేరియాకు అనేక రకాల సూక్ష్మక్రిములు కారణమవుతున్నప్పటికీ... రోటావైరస్‌ ద్వారా సోకే డయేరియా అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. నీళ్ల విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, వాం తులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన 40 శాతం కేసులకు ఈ రోటావైరస్‌నే ప్రధాన కార ణమని ఇప్పటికే వైద్యుల పరిశీలనలో తేలింది.

కలుషిత ఆహారంతో...
నగరంలో చాలా వరకు వాటర్‌ బోర్డు సరఫరా చేసే మంచినీటిపైనే ఆధారపడుతుంటారు. పాతబస్తీ సహా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి పైపులైన్‌ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. మంచినీటి సరఫరా లైన్ల పక్కనే డ్రైనేజీ నీరు కూడా పారుతోంది. పైపులకు లీకేజీలు ఏర్పడి చుట్టూ నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీ నీరు పైపుల్లోకి చేరడం వల్ల మంచినీరు కలుషితమవుతోంది. ఈ నీరు తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనికి తోడు ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేక చాలా మంది ఫాస్ట్‌ఫుడ్డు సెంటర్లు, హోటళ్లపై ఆధారపడుతున్నారు. కొన్ని హోటళ్లు రాత్రి మిగిలిపోయిన వంటలను ఉదయం వడ్డిస్తున్నాయి. వంటశాలలు శుభ్రంగా లేకపోవడం, ఆహారపదార్థాలపై ఈగలు, దోమలు వాలడం, చల్లారిన ఆహార పదార్థాలనే మళ్లీ వేడి చేసి వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడం వల్ల కూడా డయేరియా వ్యాపిస్తోంది. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1200 మంది రోగులు వస్తే వారిలో 150 నుంచి 200 మంది కలుషిత ఆహార బాధితులే ఉంటున్నారు.  

చిన్నారులకు టీకాలు...
డయేరియాను రూపుమాపేందుకు ప్రభుత్వం కొత్తగా రోటావ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 96 దేశాల్లో ఇది అమలవుతోంది. దేశంలో తొలిసారిగా జాతీయ రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టింది. గత పది రోజుల నుంచి హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సులకు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. సెప్టెంబర్‌ 5 నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 6, 10, 14 వారాల శిశువులకు 2.5 ఎంఎల్‌ చొప్పున ఈ వ్యాక్సిన్‌ వేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రతి బుధ, శనివారాల్లోనూ ఈ టీకాలను వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.  

జాగ్రత్తలు అవసరం...
కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీటితో డయేరియా వస్తుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్‌ కడుపులోకి చేరిన మూడు రోజుల తర్వాత ప్రతాపం చూపుతుంది. నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒంట్లోని నీరు, లవణాల శాతం తగ్గి నీరసంతో స్పృహ తప్పుతుంటారు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి భారి నుంచి కాపాడుకోవచ్చు.– డాక్టర్‌ రమేశ్‌ దంపూరి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement