►1,119 మంది పీజీ మెడికల్ రెసిడెంట్లను కోవిడ్ మేనేజ్‌మెంట్ విధుల కోసం తాత్కాలిక పద్ధతిన నియమించుకోవాలి. నెలకు రూ.25 వేల రెమ్యునరేషన్ ఇవ్వాలి.
►200 మంది ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులను వచ్చే ఏడాది మార్చి వరకు తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి. వారికి రూ.22 వేల చొప్పున చెల్లించాలి.
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు మొదలుపెట్టింది. నిర్ధారణ పరీక్షల దగ్గరి నుంచి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వరకు ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ ఫేజ్–2 కింద తెలంగాణకు రూ.456 కోట్లు కేటాయించింది. ఇప్పటినుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకు ఏయే పనులకు నిధులు అవసరమన్న దానిపై రాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆయా పనులు, కార్యకలాపాల కోసమే ఈ నిధులను ఖర్చు చేయాలని, ఇతర రంగాలకు మళ్లించవద్దని స్పష్టం చేసింది. నెలవారీ ఫైనాన్షియల్ రిపోర్టులు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం కోవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడంపై దృష్టి సారించినా.. ప్రజా రోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని మరిచిపోకూడదని స్పష్టం చేసింది. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే రంగాలపై నిధులు ఖర్చు చేయవచ్చని సూచించింది. ఇందులో 60% కేంద్ర నిధులు, 40% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండనున్నాయి. కేంద్ర వాటాను విడతల వారీగా విడుదల చేయనుంది.
పిల్లల రక్షణపై ప్రత్యేక దృష్టి: ముందస్తు ఏర్పాట్ల ప్రతిపాదనల్లో.. వైద్యారోగ్యరంగంలో మౌలిక సదుపాయాలకు, ప్రధానంగా పీడియాట్రిక్ కేర్ యూనిట్లకు పెద్దపీట వేశారు. ఈ రంగాలకు రూ.270 కోట్లు కేటాయించగా.. ఇందులో పీడియాట్రిక్ కేర్ యూనిట్ల కోసమే రూ.86.90 కోట్లు ఇచ్చారు. పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారుస్పీ ఆస్పత్రికి రూ.2.75 కోట్లు కేటాయించారు. ఆస్పత్రి రూపురేఖలు మార్చి, పిల్లల చికిత్సలో మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఇక ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని, అందులో 20 పీడియాట్రిక్ బెడ్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మూడో వేవ్‌లో కరోనా పిల్లలపై ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
భారీగా ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ కిట్ల కొనుగోలు
కరోనా మూడో వేవ్ మొదలైతే.. వెంటనే గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 1.10 కోట్ల యాంటిజెన్ కిట్లను, 30.77 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటికోసం కేంద్రం రూ.92.38 కోట్లు కేటాయించింది. ఆర్టీపీసీఆర్ ఒక్కో కిట్ ధర రూ.50, యాంటిజెన్ కిట్ ధర రూ.70గా నిర్ధారించింది. అలాగే ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలను బలోపేతం చేసేందుకు రూ.5.10 కోట్లు.. అత్యవసర కోవిడ్ మందులు, డయాగ్నస్టిక్ సేవల కోసం రూ.130.48 కోట్లు కేటాయించారు.
మరిన్ని ఏర్పాట్లు, చర్యలివీ..
►270 మంది జీఎన్‌ఎం నర్సింగ్ ఫైనలియర్ విద్యార్థులను నెలకు రూ.18 వేలతో.. 380 మంది బీఎస్సీ నర్సింగ్ ఫైనలియర్ విద్యార్థులను రూ.20 వేల వేతనంతో తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి.
►మొత్తంగా మానవ వనరుల విస్తరణ కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయవచ్చు. 27 చోట్ల 42 పడకలు, ఆరుచోట్ల 32 పడకలు ఉండే పీడియాట్రిక్ యూనిట్లు ఏర్పాటు చేయాలి.
►వచ్చే ఏడాది మార్చి నాటికి మెడికల్ కాలేజీల్లో 825 ఐసీయూ పడకలు, జిల్లా ఆస్పత్రుల్లో 90 ఐసీయూ పడకలను చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలి.
►451 రిఫరల్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలను సిద్ధం చేయాలి.
►రూ.15 కోట్లతో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలను, రూ.26 కోట్లతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment