ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటులో 10 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఒమిక్రాన్ వల్ల హరించుకునిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. జనవరి–మార్చి మధ్య ఈ ప్రతికూలత 0.40 శాతం మేర ఉండే వీలుందని పేర్కొంది. క్యూ4కు సంబంధించి ఇక్రా రేటింగ్స్ అంచనాలకు అనుగుణంగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనాలు ఉండడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనాలు ఈ విషయంలో 0.3 శాతంగా ఉంది. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
- మార్కెట్, మార్కెట్ కాంప్లెక్స్‌ల సామర్థ్యాన్ని తగ్గించడం, రవాణా, ప్రయాణ ఆంక్షలు, రాత్రి–వారాంతపు కర్ఫ్యూలు వంటి వివిధ రూపాల్లో నియంత్రణలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇవి ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి.
- క్యూ4లో తొలి అంచనాలు 6.1 శాతంకాగా, దీనిని 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నాం. దీనితో జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ది 5.7 శాతానికి పరిమితం కానుంది. ఇక 2 0 2 1–22 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 9.4 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నాం.
- కొత్త కేసుల్లో ఎక్కువ భాగం కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌గా అనుమానాలు ఉన్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు ఉన్నాయి.
- అయితే ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాల నేపథ్యంలో మొదటి రెండు వేవ్‌లంత తీవ్రత మూడవ వేవ్‌లో ఉండదని భావిస్తున్నాం.
బ్యాంకుల రుణ నాణ్యతకు దెబ్బ!
- రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషణ
- పునర్ వ్యవస్థీకరించిన రుణాలపై ప్రభావం తీవ్రమని అంచనా
బ్యాంకుల రుణ నాణ్యతపై కోవిడ్–19 థర్డ్‌వేవ్ ప్రతికూల ప్రభావం పడనుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రత్యేకించి ఇప్పటికే పునర్‌వ్యవస్థీకరించిన రుణాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషించింది. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మొండిబకాయిలతోపాటు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ఇబ్బందుల కారణంగా రుణదాతలు లాభదాయకత, దివాలా సంబంధిత సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రుణ పునర్ వ్యవస్థీకరణలకు దరఖాస్తులు తక్షణం పరిణామాల ప్రాతిపదిక చూస్తే, 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు 12 నెలల వరకు మారటోరియంతో చాలా వరకూ రుణాలను పునర్‌వ్యవస్థీకరించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత మారటోరియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) నుంచి 2022–23 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వరకూ కొనసాగే వీలుంది. మహమ్మారి రెండు వేవ్‌ల సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రుణగ్రహీతలకు, బ్యాంకులకు ఉపశమనం కలిగించడానికి రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 1.0, 2.0లను ప్రకటించింది. కోవిడ్ 2.0 పథకం కింద పెరిగిన రుణ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ అడ్వాన్స్‌లో (రుణాల్లో) 2.9 శాతానికి పెరిగింది. 2021 జూన్ 30 నాటికి ఇది కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. తాజా పునర్‌వ్యవస్థీకరణల అవకాశాల నేపథ్యంలో మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ రుణాల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్‌బీఐ ద్రవ్య విధానం మరికొంత కాలం ఇంతే.!
- సాధారణ స్థితికి వెంటనే తీసుకురాకపోవచ్చు
- కరోనా ఒమిక్రాన్‌తో ఆంక్షల వల్ల అనిశ్చితి
- ఆర్థికవేత్తల అంచనా
కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ఎంతో సులభతరం చేసి, వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకుంది. వృద్ధికి మద్దతే తమ మొదటి ప్రాధాన్యమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. గత ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు పుంజకుంటూ ఉండడం, అంతర్జాతీయంగానూ ఫెడ్, యూరోపియన్ బ్యాంకు తదితర సెంట్రల్ బ్యాంకులు సులభ ద్రవ్య విధానాలను కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ కూడా తన విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, కరోనా ఒమిక్రాన్ రూపంలో మరో విడత విజృంభిస్తుండడం, లాక్‌డౌన్‌లు, పలు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ఆర్‌బీఐ పాలసీ సాధారణీకరణను ఇప్పుడప్పుడే చేపట్టకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50,000ను దాటిపోవడం తెలిసిందే. ఆర్‌బీఐ సమీప కాలంలో ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురాకపోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త అభిషేక్ బారువా అన్నారు. కనీసం ఫిబ్రవరి సమీక్ష వరకైనా ఇది ఉండకపోవచ్చన్నారు. వృద్ధిపై ప్రభావం పడుతుంది కనుక కీలక రేట్ల పెంపుపై అనిశ్చితి నెలకొందన్నారు. ‘‘ఒమిక్రాన్ కారణంగా ఏర్పడే రిస్క్‌ల నేపథ్యంలో సమీప కాలానికి అనిశ్చితి కొనసాగుతుంది. కనుక ఆర్‌బీఐ ఎంపీసీ వేచి చూసే విధానాన్ని అనుసరించొచ్చు’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తాజైన్ పేర్కొన్నారు. పెరిగే రిస్క్‌లు వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తాయని, దీంతో ఆర్‌బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని ఇక్రా రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ధి అంచనాలను 0.40 శాతం తగ్గిస్తున్నట్టు (4.5–5శాతం) చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటునే ఇక్రా కొనసాగించింది.
కేంద్రం, రాష్ట్రాల సమన్వయ చర్యలు అవసరం - సీఐఐ సూచన
కరోనా ఒమిక్రాన్ రకంతో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీఐఐ కేంద్రానికి సూచించింది. ‘‘ఒమిక్రాన్‌పై కచ్చితంగానే ఆందోళన ఉంది. అయితే, ఇది వేగంగా విస్తరిస్తున్నా కానీ, ఆరోగ్యంపై ప్రభావం స్వల్పంగానే ఉంటున్న అభిప్రాయం ఉంది’’అని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి చర్యలతో కరోనా వైరస్ మూడో విడత ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 2021లో చాలా రంగాలు కోలుకున్నట్టు ఆయన చెప్పారు. ఆతిథ్యం, ప్రయాణం, ఎంఎస్‌ఎంఈ, కొన్ని సేవల రంగాలు వైరస్ రెండు విడతలతో తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నమోదు కావచ్చన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఎదురైన ప్రశ్నకు నరేంద్రన్ స్పందిస్తూ.. కొన్ని సమయాల్లో కొద్ది కాలం పాటు విరామం ప్రకటించాల్సి రావచ్చని, ప్రభుత్వ చర్య కూడా ఇదే అయి ఉండొచ్చన్నారు. మొత్తం మీద సంస్కరణల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్టు అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థపై ‘థర్డ్‌వేవ్’ ఎఫెక్ట్ ఎలా ఉండవచ్చంటే ?
Published Fri, Jan 7 2022 8:03 AM | Last Updated on Fri, Jan 7 2022 8:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment