స్టాక్‌ మార్కెట్‌లో స్టార్‌ కావాలంటే.. నిపుణుల సూచనలు | Experts have hope in these stocks in New year | Sakshi
Sakshi News home page

ఒమిక్రాన్‌ భయాలున్నా.. మార్కెట్లు ముందుకే!

Published Sat, Jan 1 2022 8:08 AM | Last Updated on Sat, Jan 1 2022 8:23 AM

Experts have hope in these stocks in New year - Sakshi

దేశీ మార్కెట్లు గత ఏడాది ఇన్వెస్టర్లకు భారీ రాబడులు అందించడంతో పాటు పలు మైలురాళ్లను అధిగమించాయి. కొత్త సంవత్సరంలో మహమ్మారిపరమైన షాక్‌లు మొదలుకుని రాష్ట్రాల ఎన్నికలు, అంతర్జాతీయ ట్రెండ్స్‌ మొదలైనవి మార్కెట్లను నిర్దేశించనున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే కేంద్ర బడ్జెట్‌లో సంస్కరణలు, కార్పొరేట్ల ఆదాయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నడుమ సెంట్రల్‌ బ్యాంకులు అనుసరించబోయే వడ్డీ రేట్ల విధానాలను ఇన్వెస్టర్లను నిశితంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీతో పాటు పలు సంస్థలు లిస్టింగ్‌ కోసం లైను కట్టనుండటంతో కొత్త సంవత్సరంలోనూ ఐపీవోల జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇక, చమురు ధరలు, బాండ్‌ ఈల్డ్‌లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణులు, అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ కదలికలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మహమ్మారిపరమైన అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఎగియడం మొదలైనవి రిస్కులుగా ఉండగలవని చెబుతున్నారు. 2022లో నిఫ్టీ 12–15 శాతం మేర రాబడులు అందించే అవకాశం ఉందని బ్రోకింగ్‌ సంస్థ.. మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకింగ్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పేర్కొంది. ఆర్థిక రికవరీ, కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం ఇందుకు దోహదపడగలవని తెలిపింది. నూతన సంవత్సరంలో ఐటీ, టెలికం, క్యాపిటల్‌ గూడ్స్, సిమెంటు, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు రాణించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా కాస్త వెనుకబడిన బ్యాంకింగ్, ఆటో రంగాలు కూడా పుంజుకోనున్నాయని అంచనా. గ్రీన్‌ ఎనర్జీ, ఇథనాల్, కొత్త తరం వ్యాపారాలు, టెక్నాలజీ, తయారీ, ఆన్‌లైన్‌ ఆధారిత కంపెనీలు మొదలైనవి మార్కెట్ల జోరుకు తోడ్పాటు అందించగలవని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో మెరుగైన రాబడులు అందించగలవని వివిధ బ్రోకింగ్‌ సంస్థలు చేస్తున్న సిఫార్సుల్లో కొన్ని స్టాక్స్‌.. 

ఎడెల్‌వీజ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌.. వ్యూ


ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌ 
ప్రస్తుత ధర: రూ.253
టార్గెట్‌ ధర: రూ.425 
అసెట్‌ లైట్‌ వ్యాపార విధానం కంపెనీ వృద్ధికి తోడ్పడగలదు. అమెరికా ప్రధాన మార్కెట్‌గా ఉండగా, భారత మార్కెట్‌పైనా మరింతగా దృష్టి పెడుతోంది. సామర్థ్యాలను కూడా మరింతగా పెంచుకోవడం సంస్థకు దీర్ఘకాలికంగా సానుకూలాంశం. 



హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ 
ప్రస్తుత ధర: రూ.774
టార్గెట్‌ ధర: రూ.1,150 
చిన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ మొత్తం గృహ రుణాల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ మార్కెట్‌ ఏటా 25–30 శాతం మేర వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో హోమ్‌ ఫస్ట్‌ మెరుగైన రాబ డులు, నికర వడ్డీ మార్జిన్లు నమోదు చేసే వీలుంది.



ఐసీఐసీఐ బ్యాంక్‌ 
ప్రస్తుత ధర: రూ.740  
టార్గెట్‌ ధర: రూ. 900 
మొండిబాకీలు తగ్గుముఖం పడుతున్నాయి. నికర వడ్డీ మార్జిన్లు గడిచిన మూడు నాలుగేళ్లలో 60 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగాయి. ఇక గత మూడేళ్లలో అసెట్స్‌పై రాబడులు 75 బేసిస్‌ పాయింట్ల స్థాయిలో పెరిగాయి. ప్రతిభావంతులైన నిపుణులు సంస్థ సొంతం. 

ఐడీబీఐ క్యాపిటల్‌.. సిఫారసులు


సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ 
ప్రస్తుత ధర: రూ. 743 
టార్గెట్‌ ధర: రూ. 950 
వార్షికంగా 50 శాతం వృద్ధి రేటుతో కంపెనీ ఎదుగుతోంది. రాబోయే రోజుల్లోనూ ఇదే స్థాయిలో వృద్ధి చెందవచ్చు. పటిష్టమైన అవకాశాల కారణంగా ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌లో కూడా స్టాక్‌ స్థిరంగా నిలబడింది. అయిదు, పదేళ్ల పాటైనా పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోతగిన స్టాక్‌ ఇది. 



ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 
ప్రస్తుత ధర: రూ. 1,197 
టార్గెట్‌ ధర: రూ. 1,500 
మొదటి, రెండో వేవ్‌ కోవిడ్‌–19 కారణంగా జీవిత బీమా సంస్థల స్టాక్స్‌ అంతగా రాణించలేదు. అయితే, ప్రీమియంలను పెంచడంతో పాటు కోవిడ్‌ సంబం ధ క్లెయిమ్‌లన్నింటికీ తగిన విధంగా ప్రొవిజన్లు చేశాయి. బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుండటం సానూకూలాంశం. 



కోల్టి–పాటిల్‌ డెవలపర్స్‌ 
ప్రస్తుత ధర: రూ. 301 
టార్గెట్‌ ధర: రూ. 375 
రియల్‌ ఎస్టేట్‌ విభాగంలో అత్యంత ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌ ఉన్న స్టాక్స్‌లో ది కూడా ఒకటి. ముంబై, బెంగళూరులో కంపెనీ గణనీయంగా కార్యకలాపాలు విస్తరిస్తోంది. దీర్ఘకాలికంగా సంస్థకు ఇది సానుకూలాంశం కాగలదు. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ సానుకూలం. 

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. పంచాంగం


గోద్రెజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ 
ప్రస్తుత ధర: రూ. 968 
టార్గెట్‌ ధర: రూ. 1,180 
మధ్యకాలికంగా మార్కెట్లో వాటా పెంచుకోవడం, వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించడం ద్వారా రెండంకెల స్థాయి వృద్ధిపై మరింతగా దృష్టి పెట్టాలని సంస్థ నిర్దేశించుకోవడం సానుకూలాంశాలు. గడిచిన ఏడాదిన్నరగా గోద్రెజ్‌ కన్జూమర్‌ ఉత్పత్తుల అమ్మకాలు దేశీయంగా గణనీయంగా పెరుగుతుండడం సానుకూలం. 



జెన్సార్‌ టెక్నాలజీస్‌ 
ప్రస్తుత ధర: రూ. 521 
టార్గెట్‌ ధర: రూ. 600 
వృద్ధి ధోరణులు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొత్త సీఈవోతో టీమ్‌ ఏర్పడటం, వృద్ధి వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అంచనా. పోటీ సంస్థలకు దీటుగా వేల్యుయేషన్‌ పుంజుకోగలదని, స్టాక్‌ రీ–రేటింగ్‌కు అవకాశాలు ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ భావిస్తోంది. 



అపోలో హాస్పిటల్స్‌ 
ప్రస్తుత ధర: రూ. 5,013 
టార్గెట్‌ ధర: రూ. 5,900 
రిటైల్‌ స్టోర్స్‌ ఊతంతో అపోలో 24/7 ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఫార్మసీ వ్యాపారాన్ని సంస్థ గణనీయంగా విస్తరిస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ–ఫార్మసీ విభాగంలో 14% మార్కెట్‌ వాటా దక్కించుకోవచ్చు. వార్షిక ప్రాతిపదికన 2022–2023 ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయం 16%, లాభం 30 %  వృద్ధి అంచనా.

5పైసా క్యాపిటల్‌.. అంచనాలు


సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ (ఇండియా) 
ప్రస్తుత ధర: రూ. 429 
టార్గెట్‌ ధర: రూ. 480 
రాబోయే రోజుల్లో ఆదాయాలను గణనీయంగా మెరుగుపర్చుకునే దిశగా సంస్థ పురోగమిస్తోందని అంచనా. ప్రస్తుతం ఆకర్షణీయమైన వేల్యుయేషన్‌లో లభిస్తోంది. 



ఐసీఐసీఐ బ్యాంక్‌ 
ప్రస్తుత ధర: రూ. 740 
టార్గెట్‌ ధర: రూ. 810 
పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థ సానుకూలాంశం. అలాగే అత్యుత్తమ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌ గల బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. డిజిటల్‌ మాధ్యమం ద్వారా వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరిగాయి. 


లార్సన్‌ అండ్‌ టూబ్రో 
ప్రస్తుత ధర: రూ. 1,895 
టార్గెట్‌ ధర: రూ. 2,200 
మరిన్ని ప్రాజెక్టులను దక్కించుకోవడం, వేగవంతంగా పూర్తి చేయడంపై కంపెనీ ఆశాభావంతో ఉంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మార్జిన్లను నిలబెట్టుకోగలమనే ధీమాతో ఉంది.   
 

చదవండి:మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? సోషల్‌ మీడియాతో జాగ్రత్త!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement