ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు పూర్తి తొలగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. డెల్టా వేరియంట్‌లో ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్‌లోనే కాకుండా, అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో ఈ మ్యూటేషన్ పరివర్తన కొనసాగుతోంది. దీని కారణంగా వైరస్‌లో మరిన్ని మార్పులు సంభవిస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
భారతదేశంలో డెల్టా–4 అనే కరోనా వేరియంట్‌తో థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని బయో టెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి దేశంలో డెల్టా–4 వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల బృందం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ నుంచి డెల్టా వేరియంట్‌లో మ్యూటేషన్లు జరుగుతూనే ఉన్నాయని , ఈ నెల 13వ తేదీన బయోటెక్నాలజీ విభాగం బృందం కేంద్ర ప్రభుత్వానికి అందించిన ఒక నివేదికలో తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా వేరియంట్లలో మ్యూటేషన్లను గుర్తించేందుకు ఇప్పటివరకు 90,115 నమూనాల జన్యు శ్రేణి పూర్తయిందని, అందులో 62.9 శాతం నమూనాల్లో వైరస్‌కు సంబంధించిన తీవ్రమైన వేరియంట్స్‌ని గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. వీటిలో డెల్టా, ఆల్ఫా, గామా, బీటా, కప్ప వంటి వేరియంట్‌లు కోవిడ్–19కు సంబంధించిన ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సోకుతాయని గుర్తించారు.
దేశంలో మ్యూటేషన్ సి.1.2 అనే వేరియంట్ కేసు ఇప్పటివరకు గుర్తించలేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా, డెల్టాకు సంబంధం ఉన్న ఇతర మ్యూటేషన్లు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. దీని కారణంగా మహమ్మారి విషయంలో పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం పరీక్షిస్తున్న అనేక నమూనాల్లో డెల్టా–4 మ్యూటేషన్‌ను గుర్తిస్తున్నారు. డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం అదే డెల్టా–4 మ్యూటేషన్ మహారాష్ట్ర, కేరళలలో వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వస్తే అందులో డెల్టాలో జరుగుతున్న ఈ మ్యూటేషన్లు కీలకంగా మారుతాయనే ఆందోళనన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) ప్రకారం, గత నెలలో మహారాష్ట్రలో 44 శాతం మంది, కేరళలో సుమారు 30 శాతం మంది రోగులలో డెల్టా–4 వేరియంట్ కనుగొన్నారు. ప్రస్తుతం డెల్టా –4 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైనదిగా వర్గీకరించింది. అయితే వైరస్‌కు సంబంధించిన ఈ కొత్త మ్యూటేషన్లు కొత్త అంటు వ్యాధులకు కారణం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
యాక్టివ్ కేసులు 0.95% మాత్రమే
దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేంద్రం సోమవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80.85 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. దేశంలో గతేడాది మార్చిలో కోవిడ్ కేసులు ప్రారంభమైన తర్వాత మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 0.95 శాతంతో అత్యల్పంగా ఉన్నాయి. దేశంలో గత 183 రోజుల్లో అతి తక్కువగా యాక్టివ్ కేసులు 3,18,181 కు చేరుకున్నాయి. కాగా గత 24 గంటల్లో 30,256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 295 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,45,133కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment