
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: కోవిడ్ మహమ్మారి రెండో దశ బలహీనమై కేసుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో రాష్ట్రంలో మూడోదశ మొదలైందనే వార్త ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ పిల్లలపై పంజా విసురుతోంది. ఆరోగ్య శాఖ అధికారిక సమాచారం మేరకు... గత 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు ఒకటి నుంచి 11 వరకు 0–9 ఏళ్లలోపు పిల్లలకు 210 మంది, 10–18 మధ్య 333 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 270 మంది బాలికలు, 273 మంది బాలురు ఉన్నారు. ఇదిలా ఉండగా 6–15 ఏళ్ల వయసు మధ్య వారితోపాటు 20 ఏళ్లలోపు టీనేజర్లు, నవజాత శిశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
1,669 పాజిటివ్, 1,672 మంది డిశ్చార్జి
రాష్ట్రంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,669 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 1,672 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 22 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,26,401కు చేరుకోగా 28,66,739 మంది కోలుకున్నారు. 36,933 మంది మరణించారు. 22,703 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.98 శాతానికి పెరిగింది.
బెంగళూరులో 425 కేసులు, 424 డిశ్చార్జిలు, ఐదు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 12,32,220కి చేరుకోగా 12,08,097 మంది కోలుకున్నారు. 15,933 మంది మరణించారు. నగరంలో ప్రస్తుతం 8,189 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,69,332 మందికి కరోనా పరీక్షలు చేశారు. 1,47,715 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment