కోవిడ్ తర్వాత పిల్లల్లో టైప్– 1 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందేమోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ఇది జరిగేందుకు అవకాశముందనే పరిశోధకుల రిపోర్టులు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’ (జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్)లో ప్రచురితమయ్యాయి.
పరిశోధకుల అధ్యయన ఫలితాల వివరాలివి... వైరస్ తాలూకు ప్రభావంతో చిన్నారుల సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు.. వారి క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథిలోని బీటా కణాలు దెబ్బతీయడం వల్ల పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వచ్చే ముప్పుందని పేర్కొంటున్నారు.
అధ్యయన ఫలితాలు చెప్పేదేమిటంటే...
జర్మనీలో ఫిబ్రవరి 2015 నుంచి అక్టోబరు 2023 వరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధకులు 509 మంది చిన్నారులపై ఓ సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఏడాది మొదలుకొని పదహారేళ్ల వయసున్న పిల్లల్లో మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీలనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ అధ్యయనం సాగింది. ఈ ‘మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీస్’ అనేవి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీసే ్రపోటీన్లు. ప్యాంక్రియాస్‌ను అవి అలా దెబ్బతీయడంలో చిన్నారుల్లో అది టైప్–1 డయాబెటిస్‌కు కారణమవుతుంది. ఐలెట్ ఆటో యాంటీబాడీస్... ప్యాంక్రియాస్‌ను దెబ్బతీయడం జరిగితే ముందు లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... తుదకు అది టైప్–1 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
ఈ తరహా పరిశోధనల అవసరమెందుకంటే...
డయాబెటిస్ వ్యాధిలో రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ దేహం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోవచ్చు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువవ్వడంతో తొలిదశల్లో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా నిశ్శబ్దంగా దెబ్బతీసే చక్కెర వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గా నిపుణులు చెబుతుంటారు. జీవనశైలి సమస్యల్లో ఒకటైన ఈ వ్యాధిని దురదృష్టవశాత్తూ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దాంతో అది దేహంలోని కీలకమైన అవయాలను... మరీ ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చిన్నపిల్లల్లో కనిపించే చక్కెరవ్యాధి (జువెనైల్ డయాబెటిస్) అని పిలిచిన ఈ వ్యాధి... ఇప్పుడు యువత పెద్దయ్యాకా వారిని ప్రభావితం చేస్తుండటంతో మనదేశ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, పరిశోధనలపై ప్రత్యేకంగా
దృష్టి్టపెడుతున్నారు.
గట్ మైక్రోబియమ్ అసమతౌల్యత వల్ల...
జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే ‘గట్ బ్యాక్టీరియా’ లేదా ‘గట్ మైక్రోబియమ్’ అంటారనీ, దీనివల్లనే ప్రతి ఒక్కరిలోని వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఏదైనా వైరస్ సోకాక... ఈ గట్ మైక్రోబియమ్‌లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య తగ్గి, కీడు చేసేవి పెరగడం వల్ల గట్ మైక్రోబియమ్ సమతౌల్యతలో మార్పుల వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, బలహీనమవుతుంది. ఈ పరిణామం డయాబెటిస్, గుండెజబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులకు కారణమవుతుంది.
యాంటిజెన్స్‌కు ఎక్స్‌పోజ్ కానివ్వపోవడంతో...
మునపటి తరంతో పోలిస్తే ఇటీవల పిల్లలను స్వాభావికమైన వాతావరణానికి ఎక్స్‌పోజ్ కానివ్వకుండా అత్యంత రక్షణాత్మకమైన రీతిలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుతూ, ్రపాకృతిక పర్యావరణానికీ, అందులోని కొన్ని వ్యాధికారకాలకు ఎక్స్‌పోజ్ అయినప్పుడు చిన్నారుల్లో ఆ వ్యాధికారకాలను ఎదుర్కొనే యాంటిజెన్స్ ఉత్పన్నం అవుతాయి. కానీ తల్లిదండ్రుల అతిజాగ్రత్త కారణంగా వారు నేచురల్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉండటం తగ్గిపోవడంతో కొన్ని రకాల హానికారక అంశాలకు యాంటిజెన్స్ ఉత్పాదన లేకుండా పోయి, సహజ రక్షణ కవచం ఏర్పడకుండా పోయింది. ఈ అంశం కూడా పిల్లల్లో సహజ రక్షణ వ్యవస్థను బలహీనం చేసిందనే అభి్రపాయం కూడా ఇంకొందరు నిపుణులనుంచి వ్యక్తమవుతోంది.
అప్రమత్తంగా ఉండాల్సిందే...
కనబడుతున్న తార్కాణాలను బట్టి, ప్రస్తుతానికి టైప్–1 డయాబెటిస్‌కు మందులేదనే వాస్తవానికి బట్టి రాబోయే భావితరాలను వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు ...
👉చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటం; మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం.
👉రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటును మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెట్టడం ∙బాగా ఆకలితో ఉండటం; మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా అలసిపోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం ∙కొందరిలో చూపు మసగ్గా కనిపిస్తుండటం (బ్లర్‌డ్ విజన్) ∙జననేంద్రియాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) వంటివి వస్తుండటం.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు.
టైప్–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు
(మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్)
పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ కనిపించినప్పుడు కింద పేర్కొన్న ఆరు అంశాల ద్వారా దాన్ని మేనేజ్ చేయాలి. అవి...
1. ఇన్సులిన్ : డయాబెటిస్‌తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స.
2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఈ అంశాన్ని పిల్లలు ఎంత తిన్నారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, దాని వల్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ వెలువడుతుంది... వంటి అనేక అంశాలను పర్యవేక్షించుకుంటూ ఇన్సులిన్ ఇస్తుండాలి.
3. ఆహారం : కేవలం రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను చూసుకుంటూ యాంత్రికంగా ఇన్సులిన్ ఇవ్వడం కాకుండా... పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం ఉండేలా చూపుకోవాలి. ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్ధాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపోటీన్లు), ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు ఇస్తుండాలి. వీటిని పిల్లల వయసు, బరువు, రోజంతా చేసే శ్రమ వంటి అంశాల ఆధారంగా ఓ ప్రణాళిక రూ΄÷ందించి, దానికి అనుగుణంగా అవసరమైన మోతాదుల్లో ఇవ్వాలి.
4. శారీరక శ్రమ : ఈ రోజుల్లో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర మోతాదులు స్వాభావికంగానే నియంత్రితమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో ఒళ్లు అలిసేలా ఆడుకోవడం చాలా అవసరం.
5. గ్లూకోజ్‌ను పరీక్షించడం : పిల్లల రక్తంలో గ్లూకోజ్ మోతాదుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి.
6. కీటోన్ మోతాదుల కోసం మూత్రపరీక్ష : మూత్రంలో కీటోన్ మోతాదులను పరీక్షించడం కోసం తరచూ మూత్రపరీక్షలు చేయిస్తూ ఉండాలి.
చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు...
కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అన్నది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పెంచడం వల్ల ఆ అంశం ఈ వ్యాధిని ప్రేరేపిస్తోందంటున్నారు మరికొందరు నిపుణులు. ఇక జామా రిపోర్టును అనుసరించి, కోవిడ్–19 బారిన పడ్డ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోనే టైప్–1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మామూలు పిల్లల కంటే 16% ఎక్కువ. మన దేశంలో నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ... పాశ్చాత్య దేశాల అధ్యయనాల ప్రకారం చూస్తే కోవిడ్ (సార్స్–సీవోవీ2) ఇన్ఫెక్షన్ తర్వాత టైప్–1 డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎంటరోవైరస్, సైటో మెగాలో వైరస్, రుబెల్లా వైరస్‌లు ఎటాక్ అయ్యా కూడా టైప్–1 డయాబెటిస్ రావడం జరిగినట్లే... కోవిడ్19 విషయంలోనూ జరుగుతోందని మరికొందరు నిపుణుల అభి్రపాయం.
కారణాలు
టైప్–1 డయాబెటిస్‌కు జన్యుపరమైన కారణాలను ముఖ్యంగా చెప్పవచ్చు. దాంతోపాటు బాధితులు కొన్ని వైరస్‌లకు గురికావడం కూడా మరో ముఖ్యమైన అంశం. కోవిడ్–19 కూడా ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్ కావడం కూడా ఈ ముప్పును పెంచుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్), 2022 నివేదిక ప్రకారం మన దేశంలో టైప్–1 డయాబెటిస్‌తో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 95,600 మంది 14 ఏళ్లలోపు చిన్నారులని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment