ముంబై: భారత్‌లో వ్యాపార క్రియాశీలత పురోగతి వేగంగా కొనసాగుతోందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా పేర్కొంది. ఆగస్టు 29నాటికి వ్యాపార క్రియాశీలత కరోనా ముందస్తు స్థాయికి చేరుకుందని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► నోమురా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ 2021 ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 102.7కు ఎగసింది. దేశంలో కరోనా ముందస్తు.. అంటే 2020 మార్చి తరువాత ఇండెక్స్ ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. అంతక్రితం ఆగస్టు 22వ తేదీతో ముగిసిన వారంలో ఇండెక్స్ 101.3 వద్ద ఉంది. మార్చి 2020 తర్వాత లాక్‌డౌన్లు, ఆంక్షల నేపథ్యంలో ఇండెక్స్ భారీగా పడిపోయింది.
► 2021 జూన్‌లో ఇండెక్స్ 15 శాతం పెరిగితే, జూలైలో ఈ వేగం 17.1 శాతంగా ఉంది. తొలి ఫలితాల ప్రకారం ఆగస్టు 29 నాటికి 5.6 శాతంగా నమోదయ్యింది.
► ఆగస్టు 29వ తేదీనాటికి గూగుల్ రిటైల్, రిక్రియేషన్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగితే, యాపిల్ డ్రైవింగ్ ఇండిసీస్ 10 శాతం ఎగసింది. వర్క్‌ప్లేస్ మొబిలిటీ ఇండెక్స్ 3.7 శాతం పడిపోయినప్పటికీ, గూగుల్, యాపిల్ సంబంధిత ఇండెక్స్‌లు పెరగడం గమనార్హం.
► విద్యుత్ డిమాండ్ వారం వారీగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది.
► ఇక కార్మికుల భాగస్వామ్య సూచీ 40 శాతం నుంచి 40.8 శాతానికి ఎగసింది.
మూడవవేవ్‌ను తోసిపుచ్చలేం...
కాగా రానున్నది పండుగల సీజన్ కావడంతో మూడవవేవ్ ముప్పును త్రోసిపుచ్చలేమని నోమురా హెచ్చరించడం గమనార్హం. ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 7 రోజుల సగటు (మూవింగ్ యావరేజ్) కేసులు 9,200 పెరిగి 41,000కు చేరినట్లు నోమురా పేర్కొంది. కేసులు పెరుగుతుండడంపై ఇంకా మిశ్రమ వార్తలు వస్తున్నాయని తెలుపుతూ, ఇది మూడవ వేవ్‌కు సంకేతం కావచ్చనీ విశ్లేషించింది. అలాగే ఇదే సమయంలో వ్యాక్సినేషన్ మూవింగ్ యావరేజ్ వారం వారీగా 47 లక్షల డోసుల నుంచి 71 డోసులకు పెరిగిందని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే 2021 డిసెంబర్ ముగిసే నాటికి భారత్‌లో దాదాపు 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపింది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉందని పేర్కొంది.
వృద్ధి 10.4 శాతం
మూడవ వేవ్ సమస్యలు తలెత్తకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ ఎకానమీ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని తన నివేదికలో నోమురా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment